చమురు ధర చుక్కలెక్కబోతోంది

చాలాకాలంపాటు త‌గ్గుముఖం పట్టి భారత ఆర్థిక వ్యవస్థకు ఊరట కలిగించిన చమురు ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఈ నెల ఒకటిన పీపా బ్రెంట్‌ ముడిచమురు ‘ఫ్యూచర్స్‌’ ధర 70 డాలర్లు పలికింది. గడచిన నాలుగేళ్లలో చమురు ధర ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. గత ఆరు నెలల్లో ముడిచమురు ధరలు 55 శాతం పెరగ్గా, ఒక్క జనవరిలోనే ఆరు శాతం హెచ్చాయి. ఈ పరిణామానికి కారణమేమిటి? ఇదే పరిస్థితి మరి కొంతకాలం కొనసాగితే భారత్‌పై పడే ప్రభావం ఏమిటనే ప్రశ్నలు నేడు విధానకర్తల్నే కాదు, సామాన్యుల్నీ వేధిస్తున్నాయి. ఒక దశలో పీపా 28 డాలర్లకు పడిపోయిన చమురు ధర, ఇప్పుడు పైచూపులు చూడటం సహజంగా సంచలనం రేపుతోంది. గతంలో మితిమీరిన ఉత్పత్తి, చైనా నుంచి గిరాకీ తగ్గిపోవడం వల్ల అంతర్జాతీయంగా చమురుకు డిమాండ్‌ కోసుకుపోయి ధరలు క్షీణించాయి. చమురు ఉత్పత్తిని తగ్గిస్తే ధరలు పెరిగి ఉండేవి కానీ పశ్చిమాసియా రాజకీయ పరిస్థితుల వల్ల చమురు ఉత్పత్తి దేశాల సంఘం (ఒపెక్‌) ఆ పని చేయలేదు. పాశ్చాత్య దేశాలు చిరకాల ఆంక్షలు ఎత్తివేశాక మళ్ళీ విపణిలోకి వచ్చిన ఇరాన్‌ చమురు ఎగుమతులను పెంచి ఆర్థికంగా బలపడుతుందేమోనన్న భయంతో సౌదీఅరేబియా దాన్ని అడ్డుకోదలచింది. సౌదీ రాజకీయాల వల్లే ఒపెక్‌ చమురు ఉత్పత్తిని తగ్గించకుండా హెచ్చు స్థాయిలో కొనసాగించింది. మరోవైపు ఇరాన్‌ నుంచి కొత్తగా చమురు వచ్చిపడింది. ఇంకోవైపు అమెరికా నుంచి షేల్‌ ఆయిల్‌ కూడా మార్కెట్‌ను ముంచెత్తసాగింది. ఈ పరిస్థితిలోనూ ఒపెక్‌ తన ఉత్పత్తిని తగ్గించకపోవడంతో చమురు గిరాకీకన్నా సరఫరా ఎక్కువై ధరలు పడిపోయాయి. అటు ఇరాన్‌ను, ఇటు అమెరికన్‌ షేల్‌ ఆయిల్‌ పరిశ్రమను దెబ్బకొట్టాలని సౌదీ నాయకత్వంలోని ఒపెక్‌- చమురు ఉత్పత్తిని పెంచుతూ పోయింది. దీని దుష్ప్రభావాన్ని సౌదీ కూటమి సైతం అనుభవించక తప్పలేదు. ఈ దేశాలకు చమురు ఎగుమతుల వల్ల వచ్చే ఆదాయం నానాటికీ కుదించుకుపోయి బడ్జెట్‌ లోటు అధికమైంది. చమురు ధరలు ఇంకా దిగజారితే ఒపెక్‌ దేశాల ఆర్థిక మూలాలకే ఎసరు వస్తుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించి ఇకపై చమురు ఉత్పత్తిని ఒక స్థాయికి పరిమితం చేయాలని 2016 నవంబరులో ఒపెక్‌ తీర్మానించింది. రష్యానూ ఒపెక్‌లో చేర్చుకోవడం, సంక్షుభిత లిబియా తన అవసరాల మేరకు చమురు ఉత్పత్తి చేయడానికి అనుమతించడం వంటి చర్యలూ తీసుకుంది. దీనివల్ల 2017 మధ్యకాలం నుంచి చమురు ధరలు మళ్ళీ ఊపందుకోసాగాయి. చైనాతోపాటు మిగతా ప్రపంచంలోనూ ఆర్థికాభివృద్ధి మెలమెల్లగా పుంజుకోవడంతో చమురుకు గిరాకీ ఇనుమడించి, ధరలు మళ్ళీ పైచూపులు చూడసాగాయి. అయితే, ధర ఏకంగా 70 డాలర్లు పలకడానికి ప్రధాన ప్రేరణ- అమెరికా డాలర్‌ విలువ తగ్గడమే! 2017 ఆరంభం నుంచే డాలర్‌ విలువ అన్ని ప్రధాన కరెన్సీలకన్నా తగ్గసాగింది. బలహీన డాలరే తమ విధానమని దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా ఆర్థికమంత్రి స్టీవెన్‌ మెనూచిన్‌ ప్రకటించినప్పటి నుంచి చమురు ధరలు పైకి ఎగబాకసాగాయి

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com