చరిత్రలో చోటు దక్కించుకున్న ప్రముఖ ప్రాంతాలు

వింతగొలిపే ప్రదేశాలు, సాహసయాత్రలు యువతను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. మరి చరిత్రకు సంబంధించి ఇప్పటి యువతకు తెలియాల్సింది చాలానే ఉంది. ఎక్కడో ఒక చోట వాటి గురించి తెలుసుకోవడం కంటే వాటిని ప్రత్యక్షంగా చూడడం ద్వారా కొత్త ఉత్సాహాన్నే కాదు విజ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అలా విజ్ఞానాన్ని పెంచే కొన్ని పురాతన నిర్మాణాలు యునెస్కో లిస్ట్‌లో చోటుదక్కించుకున్నాయి. గొప్ప సందర్శనీయ ప్రదేశాలుగా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్న ఆ నిర్మాణాలు ఏ దేశాలకు చెందినవో మీరూ తెలుసుకోండి.
**ఛిచెన్‌ ఇట్జ
మెక్సికోలో రెండవ అతి పురాతన దర్శనీయ స్థలాల్లో ఛిచెన్‌ ఇట్జ ఒకటి. స్పానిష్‌ భాషలో ‘ఛి’ అంటే నోరు లేదా చివర అని, ‘చెన్‌’ అంటే బావి అని అర్థం. మెక్సికోలోని యుకటన్‌ నగరానికి తూర్పు ప్రాంతంలో ఉందీ ఛిచెన్‌ ఇట్జ. మాయన్‌ కాలానికి చెందిన చారిత్రాత్మిక నిర్మాణ శైలుల్లో అతి పురాతనమైనదిగా పేరొందిన ఈ నిర్మాణం మధ్య యుగం నాటి వివిధ నిర్మాణ శైలులకు అద్దం పడుతుంది. యుకటన్‌ ద్వీప కల్పంలోని మాయా లోల్యాండ్స్‌లో అత్యంత పురాతన కట్టడంగా పేరొందిన ఛిచెన్‌ ఇట్జ ప్రపంచ వింతల్లోనూ చోటు దక్కించుకుంది. ఇక ఈ నిర్మాణ శైలుల్ని తిలకించేందుకు దాదాపు 27 లక్షల మంది యాత్రీకులు ఇక్కడికి వచ్చిపోతుంటారు.
***అల్హాబ్రా-స్పెయిన్‌
స్పెయిన్‌లోని గ్రనడ, యాండలూషియా, ప్రాంతాల్లో ఉంది ఈ కోట సముదాయం. క్రీ.శ 889లో రోమన్‌ల పాలనలో ఇది ఒక చిన్న కోటగా ఉండేది. 13వ శతాబ్దం మధ్య కాలంలో నస్‌రిద్‌ ఇమర్‌ మహమ్మద్‌ బెన్‌ అల్‌ అహ్మర్‌ ద్వారా పుననిర్మించబడిన ఈ కోట నిర్మాణాల్లో ఆ తర్వాత కాలానుగుణంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కోట నిర్మాణాల్లో ఎన్నో మార్పులున్నా కోట లోపలి భాగంలో ఎర్ర మట్టితో నిర్మించిన కొన్ని కట్టడాలను ఇప్పటికీ వీక్షించొచ్చు. కోట లోపల అందమైన పూదోటలు, ఫౌంటెన్‌లు, రహస్య మార్గాలతోపాటు మధ్య యుగంనాటి నిర్మాణ రీతులు సందర్శకులను కట్టిపడేస్తాయి. నెపోలియన్‌ కాలంలో ఈ కోటలో చాల భాగం దగ్ధమైంది. ఇప్పుడు వీక్షించగలిగింది అందులో కొంత భాగమే. స్పెయిన్‌లో ముస్లిమ్‌ ఎమిర్ల నిర్మాణ రీతులకు అద్దంపట్టే ఈ కోటను వీక్షించేందుకు ఎన్నో దేశాల నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు వచ్చిపోతుంటారు.
**స్టోన్‌ హెన్గ్‌
పురాతన చారిత్రక కట్టడాలు ఎప్పుడూ ఆశ్చర్యపరిచేవిగానే ఉంటాయి. అయితే స్టోన్‌ హెంజ్‌ నిర్మాణం పురాతత్వ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. మెగాలితిక్‌ నిర్మాణ శైలిని అనుసరించి చేసిన ఈ నిర్మాణం ఇంగ్లండ్‌లోని శాలిస్‌బరీలో ఉంది. ఈ నిర్మాణం క్రీ.పూ. 3000 నాటిదంటే ఆశ్చర్యం కలగక మానదు. అసలు ఇంతకీ ఈ నిర్మాణంలో అంత ప్రత్యేకత ఏంటంటే బ్రిటన్‌లోని వేల్స్‌ ప్రాంతం నుంచి తెచ్చిన అతి బరువైన కొండ రాళ్ళను నిటారుగా ఒక వృత్తం ఆకారంలో ఉంచి వాటిపై రాళ్ళను మెగాలిథిక్‌ నిర్మాణ శైలిలో పేర్చడం ఒక గొప్ప కళనే చెప్పాలి. ఎందుకంటే పదమూడు అడుగుల ఎత్తు, ఏడు అడుగుల వెడల్పున ఉండే ఒక్కో రాయి బరువు దాదాపు 22,660 కిలోలు. ఈ రాళ్ళను సుదూర ప్రాంతం నుంచి తీసుకురావడంతోపాటు వాటిని ఒక అందమైన కళాకృతిగా మలచడం ఒక అద్భుతమే. ఈ నిర్మాణ శైలి నియోలిథిక్‌ సమాజపు ప్రజల జీవనానికి అద్దంపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ జనావాసాలు నిరోధించబడినా ఇక్కడ చోటుచేసుకునే అందమైన సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను వీక్షించేందుకు యాత్రికులు ఎక్కువగా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు.
**ఈస్టర్‌ ఐల్యాండ్‌- చిలీ
చారిత్రాత్మక దర్శనీయ ప్రదేశాల్లో ఈస్టర్‌ ఐల్యాండ్‌ ఒకటి. పసిఫిక్‌ మహాసముద్రానికి నైరుతి ప్రాంతంలోని చిలీ వాసుల ద్వీపంగా దీనికి పేరు. 887 కాలంనాటి స్మారక విగ్రహాలకు ప్రసిద్ధి పొందింది ఈ ద్వీపం. మావౌ జాతికి చెందిన వారి ద్వారా తయారుచేయబడిన స్మారకాలకు మావౌ స్ట్యాట్యూస్‌ అని పేరు. క్రీ.శ. 700-1000 మధ్య ఈ ద్వీపంలో పాలినేషియన్‌లు ఎక్కవగా స్థిరపడ్డారనే ఆధారాలున్నాయి. అలా అప్పటి తెగల సంస్కృతీ సంప్రదాయాలను అద్దంపట్టేవిగా ఉంటాయి. అధిక జనాభా కారణంగా వచ్చే ప్రమాదాల కారణంగా కొంతకాలానికి ఇక్కడ రాప నుయికి సంబంధించిన నాగరికత అంతరించిపోయినా వాటిని ప్రతిబింబించే శిలలను ఇక్కడ మనం ఇప్పటికీ వీక్షించొచ్చు. 1888 నుంది చిలీలోని ఒక ప్రత్యేక భూభాగంగా ఉన్న ఈస్టర్‌ ఐల్యాండ్‌ను 1995లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది. అప్పటి నుంచి ఈస్టర్‌ ఐల్యాండ్‌లో మావౌ తెగ కాలం నాటి వేలాది విగ్రహాలను ఇక్కడి రాపా నుయి జాతీయ వనంలో పొందుపరిచారు.
**పార్థినన్‌-గ్రీస్‌
పురాతన గ్రీకు సంప్రదాయానికి చెందిన ఒక ఆలయంగా పార్థినన్‌ నిర్మాణం జరిగిందనే కథనం ప్రచారంలో ఉంది. ఎథెనా దేవతను ఆరాధించేందుకు ఏర్పాటుచేసిన ఈ ఆలయాన్నే ఎథేనియన్‌ ఆక్రోపోలీస్‌ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అతి పురాతన సాంస్కృతిక స్మారక కట్టడాల్లో ఒకటిగా పేరొందిన ఈ ఆలయం గ్రీకుల డోరిక్‌ నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. భవనం చుట్టూతా స్తంభాలతో ఎంతో ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. క్రీ.పూ 447లో ప్రారంభించిన ఈ ఆలయ నిర్మాణ పనులు 438లో పూర్తిచేశారు. అయితే గ్రీకు సంప్రదాయ రీతుల్లో ఈ భవనాన్ని అందంగా తీర్చిదిద్దడానికి మరో ఆరేళ్లు పట్టింది. పర్షియన్‌ తిరుగుబాటుదారులపై విజయాన్ని పొందినందుకు తమ దేవతకు కృతజ్ఞతా పూర్వకంగా నిర్మించిన ఈ ఆలయ భవపం యునెస్కో వారసత్వ సంపదల్లో చోటుదక్కించుకుంది. కాలక్రమంలో ఈ నిర్మాణాల్లో కొంత భాగం శిథిలమయ్యింది. అయితే ఈ అరుదైన కట్టడాలను పరిరక్షించే దిశగా గ్రీకు ప్రభుత్వం వీటి పున:నిర్మాణాన్ని చేపట్టింది. చాలా భాగం కూలిపోయినప్పటికీ అప్పటి గ్రీకు సంప్రదాయ నిర్మాణ రీతులను అద్దం పట్టే ఈ నిర్మాణాన్ని వీక్షించేందుకు ఎంతోమంది యాత్రికులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు.
**కొలోసియమ్‌
రోమన్‌ల కాలంలో అత్యంత పేరొందిన నిర్మాణాల్లో కొలోసియమ్‌ ఒకటి. లాటిన్‌ భాషలో దీనికి ఫ్లావియన్‌ యాంఫీథియేటర్‌ అని పేరు. రోమ్‌లో చక్రవర్తి వెస్పాసియన్‌ ఈ కొలోసియమ్‌ యాంఫీథియేటర్‌ నిర్మాణాన్ని చేపట్టాడు. అసలీ యాంఫీథియేటర్‌ ఏంటనేగా మీ సందేహం. నాటకాలు, క్రీడలు, బలప్రదర్శనలు లాంటివన్నీ ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసిన ఒక వేదికేే యాంఫీథియేటర్‌. ఇప్పటి ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియమ్‌ను పోలుండే ఈ యాంఫీథియేటర్‌ నిర్మాణాన్ని క్రీ.శ.72లో మొదలుపెట్టారు. రోమన్‌, గ్రీకు సాంప్రదాయ నిర్మాణ శైలుల్లో తీర్చిదిద్దిన ఈ థియేటర్‌ నిర్మాణం క్రీ.శ. 80 నాటికి పూర్తయ్యింది. మరిన్ని కొత్త హంగులు అద్దడానికి మరో ఆరేళ్ళ కాలం పట్టింది. అంటే పూర్తిగా ఈ నిర్మాణ పనులు పూర్తిచేసింది క్రీ.శ. 86 నాటికి. ఇక వృత్తాకారంలో మొత్తం మూడు అంతస్తులుగా ఈ థియేటర్‌ను నిర్మించారు. ఎనభైవేల మంది ఒకేసారి ఇక్కడ జరిగే ప్రదర్శనలని వీక్షించొచ్చు. ఎన్నో ఏళ్ళ క్రితమే రోమ్‌లో చోటుచేసుకున్న ఈ తరహా నిర్మాణాలు అప్పటివారి సృజనకు అద్దంపడతాయి. యాంఫీథియేటర్‌లో నాటకాలతోపాటు ఎక్కువగా గ్లాడియేటర్‌ పోటీలు, బుల్‌ ఫైట్‌ లాంటి ప్రదర్శలను నిర్వహించేవారు. రోమన్‌ల కట్టడాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కొలోసియమ్‌ యాంఫిథియేటర్‌లో మధ్యయుగ కాలంలో ప్రదర్శనలను నిలిపివేశారు. ఆ తర్వాత పునర్వైభవాన్ని సంతరించుకుంది. అయితే కాలానుగుణంగా వచ్చే మార్పుల కారణంగా ఈ నిర్మాణంలో కొంత భాగం కూలిపోయినా ఇప్పటికీ ఈ కొలోసియమ్‌ను వీక్షించేందుకు ఏడాది పొడవునా ఇక్కడకు యాత్రికులు వస్తుంటారు. ఇటీవలే ఈ కొలోసియమ్‌ యునెస్కో వారసత్వ సంపదల జాబితాలో చోటుదక్కించుకుంది.
**ఫతేపూర్‌ సిక్రి -ఆగ్రా
మన దేశంలో ప్రముఖ దర్శనీయ స్థలాల్లో ఫతేెపూర్‌ సిక్రి ఒకటి. ఢిల్లీ దగ్గరలోని ఆగ్రాలో ఉందీ కట్టడం. ముఘల్‌ చక్రవర్తుల కాలంలో ముఘల్‌ రాజ్యానికి రాజధాని నగరంగా ఉన్న ఈ ఫతేెపూర్‌లో ఎన్నో అద్భుతమైన రాజభవన నిర్మాణాలు జరిగాయి. వింధ్య పర్వత శ్రేణుల నుంచి జాలువారే జలపాతాలతో ఏర్పడిన ఒక సహజసిద్ధమైన సరస్సు ఒడ్డున జల్‌ మహల్‌ను నిర్మించారు. ఈ మహల్‌తో పాటు మరెన్నో ముఘల్‌ల కాలంనాటి కట్టడాలకు కేంద్రంగా ఉంటుందీ ప్రాంతం. ఇండో-అరబ్బు మిశ్రమ నిర్మాణ శైలుల్ని అనుసరించి నిర్మించిన ఈ రాజ భవనాలన్నీ ప్రపంచ ఖ్యాతిని గడించాయి. అత్యంత ప్రజాదరణ ఉన్న ఫతేెపూర్‌ నగరం యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com