చలికాలం వేడి పెంచే ఆహారం తీసుకోవాలి

వణికించే చలి.. పిల్లలు మొదలు పెద్దల వరకు ఎవరినైనా ఇబ్బంది పెడుతుంది. శరీరం పొడిబారి ఈ కాలం ఎంత త్వరగా ముగుస్తుందా అని అనుకోవడం సహజం. ఇలాంటి వాతావరణంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వేడినిచ్చే ఆహారం తీసుకోవాలి. దాహం వేయని ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని ఏం తీసుకుంటామని కొందరికి అనిపిస్తుంది. ఈ కాలంలో ఎటువంటి ఆహారం అవసరం? అవి అందరికీ అందుబాటులో ఉంటాయా అని మరికొందరు ఆలోచిస్తుంటారు. చలి కాలానికి చిరుధాన్యాల వినియోగం, ఆకుకూరల వినియోగమే పరిష్కారమంటున్నారు జాతీయ పోషకాహార నిపుణులు.

* దాహం వేయట్లేదు కదా అని నీళ్లు తాగడం శీతాకాలంలో తగ్గించేస్తుంటారు. దీనివల్ల శరీరంలో వివిధ అవయవాలు చేసే ప్రతి పనికి ముఖ్యమైన ధాతువును మనం దూరం చేసినట్టే అవుతుంది.
* మన శరీరానికి శక్తినివ్వడంతోపాటు ఎదగడానికి, జీవ రసాయన ప్రక్రియలకు పిండి పదార్థాలుండాలి.
* జీర్ణప్రక్రియ మెరుగుకు, పోషకాలు సమకూర్చేందుకు, వూబకాయం తగ్గడానికి పీచు పదార్థాలు ఉత్తమం.
* ఆరోగ్యానికి, ఎదుగుదలకు.. కొవ్వు పదార్థాలు, రోగనిరోధక శక్తికి మాంసకృత్తులు, జీవ రసాయన ప్రక్రియ, శరీర నిర్మాణానికి ద్రవాలు దోహదపడతాయి.
* విటమిన్‌ ఎ కంటిచూపు మెరుగుకు, వ్యాధి నిరోధక శక్తికి, ఆరోగ్య చర్మానికి, వూపిరితిత్తులకు అండ.
* చలికాలంలో శరీరం బిగుసుకుపోతుంది. దీనికి విటమిన్‌ బితో సమాధానం చెప్పొచ్చు.
* వ్యాధి నిరోధకశక్తి పెరగడానికి, గాయాలు మానడానికి విటమిన్‌ సి, ఎముకలకు కాల్షియం ఉన్నాయిగా.

చిరుధాన్యాలైన రాగులు, సామ బియ్యం, మొక్కజొన్న, కొర్రలు, జొన్నలు,తోటకూర గింజలు, కోడిసాము, సజ్జలు, వరిగెలు, నువ్వులు ఆరోగ్యకర ఆహారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జొన్న ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో కండరాలు పట్టేయడం వంటి సహజ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే కాల్షియం, మాంగనీసు, ఇనుప ఖనిజాలు అందుతాయి. భోజనం తర్వాత నువ్వులతో చేసే మిఠాయిలు తినడం ద్వారా సరిపడా తేమ సమకూరుతుంది. వేరుసెనగతో గుండెకు మేలు. పొగలు కక్కే సూప్‌లు, వేడి కాఫీ, టీలు అప్పటికప్పుడు హాయినిస్తాయేమో కాని చలికాలాన్ని ఎదుర్కొనే శక్తినివ్వవు. అందుకే తేనే, నిమ్మసరం కలగలిపిన గోరువెచ్చటి నీళ్లు తాగితే మలబద్ధక సమస్యతోపాటు శరీరం ముడతలు పడకుండా ఉంటుంది. శీతాకాలంలో ఆకుకూరలన్నీ యాంటీ ఆక్సిడెంట్లనందిస్తాయి. వందగ్రాముల పాలకూరలో 28 మిల్లీగ్రాముల విటమిన్‌ సి ఉంటుంది. కావాల్సినంత ఐరన్‌ అందుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరగడానికి, గాయాలు మానడానికి కూడా ఈ కూర ఉపయోగపడుతుంది. ఇక 100 గ్రాముల తోటకూరలో మాంసకృత్తులు 4 గ్రాములు, విటమిన్‌ సి 999 మిల్లీగ్రాములు, కాల్షియం 397 మిల్లీగ్రాములు ఉంటాయి. గోంగూర, కరివేపాకు కూడా ఈ కాలంలో మేలు చేసేవే. రోజూ తినే ఆహారంలో 400 గ్రా కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. చక్కటి పోషకాహారంతో కార్బొహైడ్రేట్లు, పీచు, విటమిన్‌ ఎ, సి శరీరానికి అందుతాయి. ఉడికించిన చిలగడ దుంపలపై మిరయాల పొడి, ఉప్పు చల్లి తింటే ఖనిజ లవణాలతోపాటు తక్షణ శక్తి అందుతుంది. దుంప జాతి ఆహారం శీతాకాలంలో ఎంతో శక్తి, వేడినందిస్తాయి. రాగి జావతో ఐరన్‌, కాల్షియం, పీచు ఉండి పిండి పదార్థాలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. వేసవిలో ఒంట్లో ఉన్న వేడిని తగ్గించే ఈ జావ శీతాకాలంలో పెంచుతుంది. 100 గ్రాముల రాగిలో ప్రొటీన్‌ 7.3 గ్రాములు, కొవ్వులు 1.3, ఖనిజాలు 2.7, ఫైబర్‌ 3.6, కాల్షియం 344 మి.గ్రాములు, కార్బొహైడ్రేట్లు 72, ఫాస్పరస్‌ 283 మి.గ్రాములు ఉంటాయి. శీతాకాలమంటే వూపిరితిత్తుల సమస్యలు అధికం. ఆస్తమాతో బాధపడేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవిసెగింజల కషాయం దగ్గు, అయాసం, గొంతు నొప్పిని పోగొట్టడంలో పనిచేస్తుంది. ఇక ఉసిరి దృష్టి బలహీనత నుంచి బయటపడేస్తుంది. బొప్పాయి పండు జీర్ణకారే కాక కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలను అరికడుతుంది. తులసి ఆకుల రసం, మిరియాల కషాయం జలుబు, దగ్గు, జ్వరానికి మంచిది. అలాగే జీలకర్ర శరీరానికి తగిన వేడి, తేమనందిస్తుంది. చలిగా ఉంది కదాని చాలామంది వ్యాయామానికి అంతగా ప్రాధాన్యమివ్వరు. దీనివల్ల చురుకుదనం తగ్గుతుంది. కనీసం గంట సమయం వరకు అందరికీ నిత్యం వ్యాయామం అవసరం. ఎముకల పటుత్వానికి ఎండ అవసరం. కనీసం 15 నిమిషాలు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. రోజూ 3 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. అలాగే చేతులు, ముఖం, కాళ్లు రోజుకు మూడు దఫాలు శుభ్రం చేసుకోవాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com