చిన్నారులకు ఈ పౌష్టిక ఆహారం మేలు

‘ఆషోడశాత్‌ భవతే బాలః కుమారః’ అంటుంది ఆయుర్వేదం. 16 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలు వివిధ దశల్లో పరిణతి చెందుతారనేది దీనర్థం. వారి ఆరోగ్య పరిరక్షణకు ఇది చాలా విశిష్టమైన సమయం. తల్లిదండ్రులు సూచించే ఆహారవిహారాల పైనే పెరిగే వయసులో ఉన్న పిల్లల శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శారీరక వ్యాయామం, వినయవిధేయతలు, సామాజిక సాంస్కృతిక స్పృహ… వీటి మీద కూడా పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ‘లోకో భిన్న రుచిః’ అన్న ఆర్యోక్తి వాస్తవమే అయినా, పెరిగే వయసులో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు నేర్పే ఆహారపుటలవాట్లు వారిపై జీవితాంతం ప్రభావం చూపుతాయన్నది శాస్త్ర సమ్మతం. మనం చేసే అలవాటుని బట్టే మన నాలుక రుచుల్ని కోరుతుందన్నది మరచిపోకూడదు. శరీర పోషణకు ఎలాంటి ఆహారం అవసరమన్నది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇది కల్తీ పదార్థాల వ్యాపారంతో నిండిన కాలమని అర్థం చేసుకుని, పిల్లలకు ఇచ్చే ఆహారపదార్థాలను నిర్ణయించుకోవాలి.
*వీటిని తీసుకోకూడదు…
ఉప్పుని అతి తక్కువ ప్రమాణంలోనే అంటే రోజు మొత్తం మీద మూడు గ్రాములు దాటి సేవించకూడదు. నూనెను మరిగించి (డీప్‌ ఫ్రై) చేసే వంటకాలు (పూరీలు, గారెలు, సమోసా, చిప్స్‌ వంటివి) నెలకు రెండు సార్లకు మించి ఎక్కువగా తినకూడదు.పంచదార నిషేధం. (దానికి బదులు బెల్లం, తేనె, ఖర్జూరం వాడుకోవచ్చు). రిఫైన్డ్‌ ఆయిల్స్‌ బదులు నువ్వులనూనె వాడటం మంచిది.బజారులో అమ్మే తినుబండారాలను విడిచిపెట్టడం ఉత్తమం. ఐస్‌క్రీములు, చాకొలేట్లు, లాలీపాప్, స్వీట్స్, భుజియా, సేవ్, నూడుల్స్, పిజ్జా,బర్గర్, శీతల పానీయాలు, బిస్కెట్లు, బ్రెడ్‌ మొదలైనవి.మైదాపిండి వాడకం మానేస్తే మంచిది.
*ఎందుకు తినకూడదు…
పైన చెప్పిన పదార్థాలలో పోషక విలువలకి సంబంధించి ‘విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రొటీన్లు ఉండవు. పైగా కొవ్వులు, శర్కర కలిగిన పిండి పదార్థాలు అధిక స్థాయిలో ఉండి, అక్కర్లేని అధిక క్యాలరీలను మాత్రం అందిస్తాయి. వీటి తయారీలో వాడే కృత్రిమ రంగులు, తీపికోసం + నిల్వ కోసం వాడే కెమికల్స్, అధిక ఉప్పు, చౌకబారు కారం, నూనెలు మొదలైనవన్నీ రోగాలు కలిగిస్తాయి. బయట అమ్మే చెరుకురసం, పానీపూరీ వంటి వాటిలో కల్తీతో పాటుగా ఇన్‌ఫెక్షన్‌ సమస్య ప్రధానమైనది. వాంతులు, విరేచనాలు, వివిధ జ్వరాలు, పచ్చకామెర్ల వంటివి చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ.
*వీటిని తినొచ్చు…
∙ఇంట్లో వండుకుని తయారుచేసుకున్నవి మాత్రమే పిల్లల ఆరోగ్యానికి మంచిది. ∙ఇడ్లీ, దోసెలు, పెసరట్లు లేదా రకరకాల ఇతర అట్లు చక్కగా తినొచ్చు. ∙రాగులు కంద కూడా వాడుకోవచ్చు ∙సాధారణంగా వరి అన్నంతో పులిహోర తయారుచేస్తాం. కొర్రల వంటి ఇతర బియ్యాలను కూడా వాడుకుంటే మంచిది. ∙అటుకులు, నిమ్మరసం, కొత్తిమీర ఉపయోగించి వంటకాలు చేసుకుంటే అధిక పోషక విలువలు లభిస్తాయి. ∙బొంబాయిరవ్వతో చేసే ఉప్మా కంటే బియ్యపురవ్వతో చేసుకునే ఉప్పుడు పిండి మంచిది. ఇందులో ఇంగువ కూడా వాడితే రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మంచిది. ∙కిచిడీ, పులగం, బిరియానీలలో పోషకాలు లభిస్తాయి. ∙మినపరొట్టె, పప్పు బియ్యపు రొట్టె వంటివి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొదలైన తాజా చట్నీలతో తింటే బలకరం. ∙సేమ్యా ఉప్మా అప్పుడప్పుడు తింటే పరవాలేదు.∙కాయగూరలతో చేసిన సూప్స్‌లో కొంచెం మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకోవాలి. అలాగే క్యారట్, టొమాటో, పచ్చి జ్యూస్, గ్రీన్‌ సలాడ్స్‌ తినడం మంచిది. ∙బెల్లానికి బదులు పచ్చి ఖర్జూరాల్ని వాడుకుని, వేరుసెనగ పలుకుల ఉండలు, చక్కీలు, మరమరాల ఉండలు, అటుకుల ఉండలు, నువ్వుల ఉండలు, డ్రైఫ్రూట్స్‌ ఉండలు పిల్లలకు ఇస్తే పోషక విలువలు సమృద్ధిగా ఉండటమే కాకుండా, అధిక క్యాలరీలు, కల్తీల సమస్య ఉండదు. ∙బెల్లంతో చేసే మినపసున్ని, కొబ్బరి ఉండలు కూడా మంచిది. ∙సేమ్యాపాయసం, బియ్యం పాయసం, జున్ను మొదలైనవాటిని తేనెతో చేస్తే పోషకాలు బావుంటాయి.గుమ్మడి, టొమాటో, ఆకుకూరలతో చేసిన వడియాలు, పిండి వడియాలు, పేల వడియాలు అప్పుడప్పుడు తినడం ప్రయోజనకరం. ∙అరటిపండ్లు, సీతాఫలం, సపోటా, మామిడి, పనసతొనలు లభించడాన్ని బట్టి తినడం మంచిది. ∙దానిమ్మ, జామ, బొప్పాయి పండ్ల వలన చాలా పోషకాలు లభిస్తాయి. ∙బత్తాయి, కమలా, పుచ్చకాయలు ‘రస’ ప్రధానమైనవి. ఇవి కూడా మంచిది. ∙ద్రాక్ష, ఆపిల్‌ వంటివి అత్యధిక క్రిమిసంహారక మందుల ప్రభావానికి గురవుతాయి కనుక వాటి జోలికి పోవకపోవడమే మంచిది. ∙డ్రైఫ్రూట్స్‌ని తగు ప్రమాణంలో ప్రతిరోజూ పిల్లలకు ఇవ్వాలి. ∙ చెరకుని నమిలి తినడం, కొబ్బరినీళ్లు, అల్లం, కరివేపాకులతో చేసిన పలుచని మజ్జిగ మొదలైనవి మంచిది. ∙పళ్ల రసాల కంటే పండుని మొత్తంగా తినడం మంచిది.
*గమనిక
కార్బైడ్, పెస్టిసైడ్స్‌ వంటి విషాలు చాలా ప్రమాదకరం. ప్రస్తుతం ఇది ఒకసామాజిక సమస్యగా మారింది. పండ్ల వలన కలిగే లాభాల కన్నా, ఈ విషాల వల్ల కలిగే హాని అధికంగా ఉంది. వీటి గురించి వైద్యులు వివరించగలరే కాని ‘నివారణ/నిర్మూలన’ వారి చేతుల్లో లేదని గమనించాలి.
*డ్రైఫ్రూట్స్‌
తగు ప్రమాణంలో మితంగా తినడం మంచిది. ప్రతిరోజూ కొంచెం కొంచెం పిల్లలకివ్వాలి.
పానీయాలు: చెరకుని నమిలి తినడం, కొబ్బరినీళ్లు, అల్లం, కరివేపాకులతో చేసిన పలుచని మజ్జిగ మొదలైనవి మంచిది. పళ్ల రసాల కంటే పండుని మొత్తంగా తినడం మంచిది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com