జగన్నాథునికి కస్తూరి కరువు

‘జై జగన్నాథ’ నామ స్మరణతో పూరీ పుణ్యక్షేత్రం నిత్యం మారుమోగుతూ ఉంటుంది. జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుల దర్శనంతో భక్త కోటి పులకిస్తుంది. పూరీ క్షేత్రానికి ఎప్పుడెప్పుడు వెళదామా అని భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ పూరీ ఆలయం మాత్రం నేపాల్‌ నుంచి వచ్చే కస్తూరి కోసం వేచి చూస్తోంది. జగన్నాథ స్వామికి..కస్తూరి అంటే మహా ప్రీతి అని చెబుతారు.
***పూరీ జగన్నాథుని ఆలయం 12వ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీన పుణ్య క్షేత్రం! పూరీ ఆలయ సంప్రదాయల ప్రకారం.. జగన్నాథుడు, సుభద్ర, బలభ్రదుడు, సుదర్శన విగ్రహాలకు ఏడాదిలో మూడు పర్వదినాల్లో కస్తూరిని పూస్తారు. కీటకాల నుంచి విగ్రహాలు పాడవకుండా.. కస్తూరి లేపనం కాపాడుతుందని భావిస్తారు. అలాగే 8 నుంచి 18 ఏళ్లకు ఒకసారి ‘నవ కళేబర’ అనే ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సందర్భంలో కూడా పెద్ద ఎత్తున కస్తూరిని ఉపయోగిస్తారు. చివరిసారి ఈ ఉత్సవం 2015లో జరిగింది. అయితే 2008 నుంచి పూరీ ఆలయంలో కస్తూరి కొరత ఏర్పడింది. గతంలో మాదిరిగా పూరీ జగన్నాథుని ఆలయానికి కస్తూరిని సరఫరా చేయడం సాధ్యం కాదని నేపాల్‌ చివరి రాజు జ్ఞానేంద్ర బిర్‌ బిక్రమ్‌ షా దేవ్‌ తెలిపారు. ఇందులో న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని వెల్లడించారు. కస్తూరి కోసం అరుదైన జింకలను చంపడం నేపాల్‌ వన్యప్రాణి చట్టాల ప్రకారం నేరమని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న జ్ఞానేంద్ర పూరీ జగన్నాథుడిని దర్శించారు. నేపాల్‌ నుంచి కస్తూరి సరఫరాపై నిస్సహాయత వ్యక్తం చేశారు. కస్తూరి సరఫరాపై నేపాల్‌తో మాట్లాడాలని ఒడిశా ప్రభుత్వం విదేశాంగ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లింది. అనేక విజ్ఞాపనలు చేసింది. బంగారం రేటు కంటే కస్తూరి ధర 3 రెట్లు ఉంటుంది. పూరీ సంప్రదాయాలను కొనసాగించడానికి మార్కెట్‌ ధరకైనా కస్తూరి కొనడానికి ఆలయ వర్గాలు సిద్ధంగా ఉన్నాయి. అయినా దొరికే పరిస్థితి లేదు.
**కస్తూరి ఎలా వస్తుంది?
కస్తూరి జింక శరీరంలోని ఓ గ్రంథి నుంచి స్రవించే ద్రవాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నేపాల్‌ రాజవంశం శతాబ్దాల పాటు కస్తూరిని పూరీ ఆలయానికి ఉచితంగా అందించింది. నేపాల్లో రాజరిక పాలన కొనసాగినంత కాలం పూరీ ఆలయానికి కస్తూరి సరఫరా జరుగుతూనే వచ్చింది. అయితే నేపాల్లో పదేళ్ల క్రితం 239 ఏళ్ల రాచరిక వ్యవస్థ అంతమైంది. అప్పటి నుంచి పూరీ ఆలయానికి కస్తూరి సరఫరా నిలిచి పోయింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com