జగన్నాధుని తాళాల మిస్టరీ ఇంకా వీడలేదు

విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రం రత్నభాండాగారం ప్రధాన(మూడో) గది తాళం చెవి మాయమైంది. ఖజానాలో ఇది లేదని కలెక్టర్‌ అరవింద అగ్రవాల్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ ఈ వ్యవహారంపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రఘువీర్‌దాస్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. దర్యాప్తు ఏ కోణంలో జరగనుంది? ఎవరెవరిని ప్రశ్నిస్తారు? తాళం చెవి ఆచూకీ తెలుస్తుందా? భాండాగారం తలుపులు తెరిపించి సంపద(ఆభరణాలు) లెక్కింపు దిశగా చర్యలు తీసుకుంటారా? ఇలా… భక్తుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ద్వారం తెరవాలంటే మరో రెండు తాళం చెవులు కూడా ఉండాలని పలువురు చెబుతున్నారు.

ఒక గది…మూడు తాళాలు: శ్రీక్షేత్ర అధికారవర్గాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు వెలకట్టలేని సంపదలున్న భాండాగారం ప్రధాన గదికి మూడు తాళాలున్నాయి. ఈ మూడింటిని పెట్టి తెరిస్తేనే తలుపు తెరుచుకుంటుంది. ఒక తాళం చెవి పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ వద్ద, మరో చెవి సెక్యూరిటీ సిబ్బంది వద్ద, మూడోది పాలనాధికారి వద్ద ఉంటుంది. 1985లో చివరిసారిగా ఈ గది తలుపులు తెరిచి మళ్లీ తాళాలు వేశారు. అప్పట్లో నాటి పాలనాధికారి తన వద్ద ఉన్న తాళంచెవిని కలెక్టర్‌కిచ్చి ఖజానాలో భద్రపరచాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముప్పై సంవత్సరాలకు పైగా వ్యవధి తర్వాత గత ఏప్రిల్‌ 4న హైకోర్టు ఆదేశాల మేరకు గదిని తెరవడానికి వెళ్లిన నిపుణులు, అధికారులు లోనికి వెళ్లకుండా తిరిగొచ్చారు. కలెక్టర్‌ ఆధీనంలో ఉన్న తాళం చెవి లేకపోవడంతో వీరు మూడో గది లోపలికి వెళ్లలేకపోయారు. విషయాన్ని రహస్యంగా ఉంచినా ఇటీవల ఏర్పాటైన పాలకవర్గం సమావేశంలో బహిర్గతమైంది.

ఎందుకీ రాద్ధాంతం?: 1978లో భాండాగారం తెరిపించిన ప్రభుత్వం సంపద లెక్కింపజేయించింది. శ్రీక్షేత్రం ఆస్తుల రిజిస్టర్‌లో దీనికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు లేవు. లోపల ఏముందన్న విషయమై ప్రస్తుత రాజు గజపతి వద్ద కూడా వివరాలు లేవు. ఆ సంపద మాత్రం భద్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు. తాళం చెవి పోయిందని తెలిసిన తర్వాత భక్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్నాథుని భూముల తరహాలో భాండాగారంలోని ఆభరణాలు పరుల చేతుల్లోకి వెళ్లలేదన్న గ్యారంటీ ఏమిటని ఎంతోమంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై బిజద సీనియర్‌ నేత దామోదర్‌రౌత్‌ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. గజపతి విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన స్పందన ఏమిటన్నది తెలియడం లేదు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఆలయ పాలనాధికారి స్పష్టంగా ఏ విషయమూ చెప్పడం లేదు.

చిత్తశుద్ధి ఉందా?: శ్రీక్షేత్రంలో సంస్కరణలు అమలు చేస్తామని, భక్తుల సౌకర్యాలు, భద్రతపై దృష్టి సారిస్తామన్న ప్రభుత్వం లోగడ జస్టిస్‌ బి.పి.దాస్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అది తొలి అధ్యయన నివేదిక సమర్పించింది. ఇంతలో దానికిచ్చిన వ్యవధి పూర్తయింది. మరో నివేదిక సమర్పించాల్సి ఉండగా న్యాయశాఖ ఉపేక్షించింది. అధ్యయనం అసంపూర్ణంగా ఉందని మరికొంత వ్యవధి ప్రసాదించాలని జస్టిస్‌ దాస్‌ లిఖితపూర్వకంగా తెలిపినా అది పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తాళం చెవి వ్యవహారంలో మరో కమిషన్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం దీనికీ మూడు నెలల గడువిచ్చింది. ఈ వ్యవధిలో దర్యాప్తు సాధ్యమేనా? గుట్టు రట్టవుతుందా? తాళం చెవి మాయంలో ఎవరి పాత్ర ఉందన్నది స్పష్టమవుతుందా? అందరూ కోరుతున్న విధంగా ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి భాండాగారం తెరిపించి సంపద లెక్కిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ఈ వ్యవహారంలో సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో న్యాయస్థానం ఏమని ఆదేశిస్తుందో వేచిచూడాలి.

నవీన్‌జీ! పెదవి విప్పండి: కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్‌
‘నవీన్‌జీ! విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో అపశృతులు పునరావృతమవుతున్నాయి. రత్నభాండాగారం లోపలి గది తాళం చెవి మాయమైంది. మీరు దీనిపై పెదవి విప్పకపోవడం ఆశ్చర్యంగా ఉంది’ అని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ అన్నారు. గురువారం భువనేశ్వర్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఏదైనా సంఘటన జరిగిన వెంటనే చట్టం తనపని చేస్తుందని పునరుద్ఘాటించే ముఖ్యమంత్రి తాళం చెవి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కమిషన్‌ ఏర్పాటు దీనికి సమాధానం కాదని, ఇది కంటితుడుపు చర్య మాత్రమేనని పేర్కొన్నారు. 2015 నవకళేబర యాత్రలో అడుగడుగునా అపశృతులు దొర్లాయని, అప్పట్లో దీనిపై కమిషన్‌ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి తదుపరి చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించారు. భాండాగారం తాళం చెవి అదృశ్యమైందని తెలిసిన భక్తుల్లో ఆవేదన కనిపిస్తోందని, దీనిపై నవీన్‌ సమాధానం చెప్పాలని, ముఖ్యమంత్రిగా ఇది ఆయన బాధ్యత అని పేర్కొన్నారు.

నా వద్ద తాళం చెవి లేదు: గజపతి
పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ప్రధాన ద్వారం తాళం చెవి తన వద్ద లేదని పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ గురువారం రాత్రి ఒక పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. విదేశాలలో ఉన్న ఆయన ఇటీవల కాలంలో తనపై వ్యక్తమవుతున్న అనుమానాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1960 వరకు ప్రధాన గది తాళం చెవి తన వద్దనే ఉండేదని, ఆ తర్వాత శ్రీక్షేత్ర పాలనా బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వం స్వీకరించిందని, నిబంధనల మేరకు తాను తాళం చెవిని నాటి పాలనాధికారికి అప్పగించామని చెప్పారు. తర్వాత దీని గురించి తనకు ఏమీ తెలియదని తెలిపారు. ప్రధాన ద్వారం తాళం చెవి బాధ్యత శ్రీక్షేత్ర పాలనాధికారి, కలెక్టర్‌కే పరిమితమని గజపతి స్పష్టం చేశారు. తాళం చెవులు ప్రభుత్వ ఖజానాలోనే ఉండాలన్నారు. తన వద్ద భాండాగారం మొదట గదికి సంబంధించి ఒక తాళం చెవి మాత్రమే ఉందని, మరో రెండు తాళం చెవులు అధికారుల వద్ద ఉంటాయని పేర్కొన్నారు. తొలి గది తెరిచే సమయంలో తన ప్రతినిధి అక్కడ ఉంటారని వివరించారు. 1960కు ముందు పూరీ రాజులకు సూపరింటెండెంట్‌ హోదా ఉండేదని, సర్వాధికారాలు కలిగి ఉండేవారని, ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లాక రాజుల పాత్ర నామమాత్రమేనని, పాలకవర్గం సమావేశాలకు అధ్యక్షత వహించడం మినహా, ఇతరత్రా అధికారాలు ఏవీ లేవన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునేది పాలనా యంత్రాంగం మాత్రమేనని, రాజుగా తాను సంతకం చేయడం మినహా చేసేదేమీ లేదన్నారు. తనపై కొందరు అనుమానాలు వ్యక్తం చేయడం, తాళం చెవి ఉందని పేర్కొనడం పట్ల విష్మయానికి లోనయ్యాయని గజపతి పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com