జగన్ కేసులు మాఫీ చేస్తారేమో! చంద్రబాబు బెంగ.

వైకాపా అధ్యక్షుడు జగన్‌ అనుచరులు ప్రధాని కార్యాలయంలోనే ఉంటున్నారని, దానికి బదులుగానే ఆయనపై కేసుల్లో సడలింపులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇదంతా కుట్ర రాజకీయాల్లో భాగమేనని, రేపోమాపో జగన్‌పై ఉన్న కేసులన్నీ కొట్టేస్తారన్న ప్రచారమూ జరుగుతోందని తెలిపారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం తెదేపా ఎంపీలు, శాసనసభ వ్యూహ కమిటీ ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైకాపాను ఎవరూ నమ్మడం లేదని, అందుకే ఆ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి స్పందన రాలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తెదేపా అవిశ్వాస తీర్మానం పెట్టిన గంటలోనే పలు పార్టీలు సానుకూలంగా స్పందించాయని, జాతీయ స్థాయిలో తెదేపాకు ఉన్న విశ్వసనీయతకు ఇదే నిదర్శనమని తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో సోమవారం ఓటింగ్‌కు పట్టుబట్టాలని, డివిజన్‌ అడగాలని సభ్యులకు సూచించారు. ఆరుగురు సభ్యుల ఎంపీల బృందం ఈ రెండు రోజులు దిల్లీలోనే ఉండాలని, అన్ని పార్టీల నేతలనూ వ్యక్తిగతంగా కలవాలని, తెదేపా ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు కూడగట్టాలని సూచించారు. ‘ఇది అత్యంత కీలకమైన సమయం. ఎంపీలంతా మరింత చురుగ్గా, ఉత్సాహంగా పనిచేయాలి. అవిశ్వాసంపై మనం సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకున్నామని, మూడు పార్టీల మహాకుట్రను బయట పెట్టామని ప్రజల్లో చర్చ జరుగుతోంది’ అని తెలిపారు. ‘కేంద్రాన్ని ప్రశ్నించకుండా జగన్‌, పవన్‌ నన్ను విమర్శిస్తున్నారు. ఈ సమయంలో నన్ను బలహీనపరిచి ఎవరికి లాభం చేకూరుస్తున్నారు? దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌వైపే చూస్తోంది. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రజల గొంతు వినిపించాం. మనకు కావలసింది రాజకీయం కాదు. రాష్ట్రానికి న్యాయమే లక్ష్యం’ అని తెలిపారు. కేసుల మాఫీకే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని కార్యాలయంలో తిరుగుతున్నారని, కేంద్ర పెద్దలకు పాదాభివందనాలు, ప్రదక్షిణలు దానిలో భాగమేనని ఆరోపించారు. లోక్‌సభలో అశోక్‌గజపతిరాజు, రాజ్యసభలో వై.ఎస్‌.చౌదరి సమర్థంగా మన వాదన వినిపించారని, ఆ స్ఫూర్తిని కొనసాగించాలని, రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు పోరాడాలని ఆదేశించారు. దిల్లీలో ఇప్పటికే పలు పార్టీల నేతలను కలిశామని, వారంతా మద్దతు ప్రకటించారని, రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అభిప్రాయపడుతున్నారని తెదేపా లోక్‌సభా పక్ష నేత తోట నరసింహం తెలిపారు. జాతీయ టీవీ ఛానళ్లలో జరుగుతున్న చర్చనూ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రస్తావించారు. ప్రధాని మోదీని విమర్శించకుండా.. చంద్రబాబు, లోకేష్‌లపై ఎందుకు ఆరోపణలు చేశారని ఒక టీవీ యాంకర్‌ పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించగా సమాధానం దాటవేశారని తెలిపారు. లోకేష్‌పై చేసిన ఆరోపణలకు రుజువులు చూపాలని అడిగినా జవాబివ్వలేదని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘ఆరోపణలు చేసిన మర్నాడే వాటి గురించి పవన్‌కల్యాణ్‌ వద్ద విలేకరులు ప్రస్తావించగా… అందరూ అంటున్నారు కాబట్టే తానూ అన్నానని బదులిచ్చారు. గతంలో సాక్షి పత్రికలో వచ్చిన పసలేని ఆరోపణల్నే పవన్‌ చేశారు. ప్రజలు వాటిని గమనిస్తున్నారు’ అని పేర్కొన్నారు. తెదేపా జాతీయ రాజకీయాల్లోకి వస్తోందని, ఫ్రంట్‌ ఏర్పాటుచేస్తోందంటూ జాతీయ ఛానళ్లు సమస్యను పక్కదారి పట్టించేలా ప్రచారం చేస్తున్నాయని సీఎం రమేష్‌ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ‘రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా.. జాతీయ రాజకీయాలపై మీడియా దృష్టి పెట్టడం సరికాదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జాతీయ మీడియాలో చర్చ జరిగేలా ఎంపీలు దృష్టి పెట్టాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌తో చెలగాటమాడితే ఎంతటివారికైనా పరాభవం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా, అశాస్త్రీయంగా విభజించిన కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదన్నారు. రాష్ట్ర సుస్థిరతను దెబ్బతీయాలని చూస్తున్న శక్తుల ఆటలు సాగనివ్వబోమని ఆయన పేర్కొన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ కుట్రల్ని, కుతంత్రాల్ని తిప్పికొట్టిన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఉందని తెలిపారు. నాడు ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాగ్రహానికి తలవంచి మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపే ప్రకటనలో ఈ వ్యాఖ్యలు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com