టాటాలు కూడా వెనుకడుగు

తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను నష్టకష్టాలు వెంటాడుతున్నాయి. అప్పుల భారం తగ్గించేందుకు ప్రైవేటీకరణ బాట పట్టినా.. కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. తొలుత కొన్ని సంస్థలు ఆసక్తి చూపించినా.. ఆ తర్వాత వెనక్కి తగ్గుతున్నాయి. ఎయిరిండియాలో వాటా కొనుగోలు ప్రక్రియకు తాము దూరంగా ఉంటున్నట్లు ఇప్పటికే ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్‌లు ప్రకటించాయి. తాజాగా టాటా గ్రూప్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎయిరిండియా వాటా కొనుగోలుకు దూరంగా ఉండాలని టాటా గ్రూప్‌ భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న కొందరు వ్యక్తులు మీడియాకు చెప్పారు. కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం విధించిన నిబంధనలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎయిరిండియాలో వాటా కొన్న వారు తమ సొంత వ్యాపారాలతో దీన్ని విలీనం చేయరాదని ప్రభుత్వం పేర్కొంది. దీంతో పాటు ఉద్యోగులను తగ్గించకూడదని ఇలా ఇతరత్రా నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు చెప్పినప్పటి నుంచి కొనుగోలుకు ఎవరూ ముందుకు రావట్లేదు. తొలుత వాటా కొనేందుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబర్చినా.. తాజా నిబంధనల కింద ఎయిరిండియాను నడపగలమా? లేదా అన్న సందిగ్ధతలో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై టాటాగ్రూప్‌ ఇంకా స్పందించలేదు. ఎయిరిండియాకు ఇప్పటికే వేల కోట్ల రూపాయాల అప్పులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ మంది సిబ్బందిని కొనసాగించడం వల్ల అదనపు భారం పడుతుందని సంస్థలు భావిస్తున్నాయి. అంతేగాక ఓ సంస్థను ఏదైనా కంపెనీ కొనుగోలు చేసిన తర్వాత దానిపై నియంత్రణ హక్కులను కోరుకోవడం సహజమే. కానీ, ప్రభుత్వ నిబంధనలతో ఆ హక్కులు పూర్తిగా రావట్లేదని సంస్థలు భావిస్తున్నాయి. అందుకే కొనుగోలుకు ముందుకు రావట్లేదని విశ్లేషకుల అభిప్రాయం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com