డబ్బాల్లో వేయండి…అక్కడ వద్దు

సైనిక సిబ్బంది ఎవరైనా తమకున్న సమస్యలను గ్రీవెన్స్‌ బాక్సుల ద్వారా తెలియజేయాలని, సామాజిక మాధ్యమాలకు వెళ్లొద్దని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన పలు విషయాలను వెల్లడించారు. ‘ఎవరికైనా ఇబ్బందులు ఉంటే నేరుగా నన్ను సంప్రదించి చెప్పవచ్చు. ఆర్మీ ప్రధాన కార్యాలయంలో, ప్రతి విభాగంలో గ్రీవెన్స్‌ బాక్సులను ఏర్పాటు చేశాము. సిబ్బంది ఎవరైనా తమ సమస్యలను రాసి, తమ పేరు, చిరునామాతో సహా అందులో వేయవచ్చు. వారి పేరును బహిరంగపర్చకుండా సమస్యను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటాం. మనమంతా ఒకటే, దేశం కోసం మనం కలిసి పనిచేయాలి’ అని అన్నారు. ఆర్మీ డేని పురస్కరించుకొని ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశామని.. మీడియా ద్వారా జవాన్లందరికీ ఈ సందేశాన్ని తెలియజేస్తున్నానని తెలిపారు. తమ సమస్యలను పట్టించుకుంటారన్న నమ్మకం పై అధికారుల పట్ల సిబ్బందికి కలగాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఆహారంలో నాణ్యత లోపించడం గురించి బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌, పని ఒత్తిడి, వివక్ష గురించి సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ జీత్‌ సింగ్‌, ఆఫీసర్లు తమ చేత బూట్లు పాలిష్‌ చేయించుకుంటున్నారని ఆరోపిస్తూ లాన్స్‌నాయక్‌ యజ్ఞప్రతాప్‌ సింగ్‌.. వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌ కావడంతో సైన్యానికి సంబంధించిన అంశాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ పై విధంగా మాట్లాడారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com