డాలర్ దెబ్బకు భారతీయ విద్యార్థులు వెనుకడుగు

అమెరికా విద్యపై అత్యధిక ఆసక్తి చూపే భారతీయులు… ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులకు డాలర్‌ దెబ్బ ఆశనిపాతంగా మారింది. ఇప్పటికే తమ పిల్లలకు ఉద్యోగావకాశాలు దక్కుతాయో? లేదో? అని ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులను ఈ పరిణామాలు కలవరపరుస్తున్నాయి. ఆస్తులు తాకట్టు పెట్టి.. పొలాలు అమ్ముకుని..ఉన్నదంతా ఊడ్చినా సరిపోక బ్యాంకు రుణాలు పొంది.. ఇలా ఉజ్వల భవిష్యత్తు కోసం పిల్లలను అమెరికా చదువుకు పంపిన వారు ఇక ముందు చెల్లించే రుసుముల భారాన్ని తలచుకుంటూ ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం వేసుకున్న ఆర్థిక ప్రణాళిక తారుమారైందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక ఈ జులై, ఆగస్టులో తమ బిడ్డలను ఆ దేశానికి పంపేందుకు సమాయత్తమైన వారిపై ఈ పరిణామం మరింత భారం మోపనుంది. అమెరికాకు వెళ్లే విద్యార్థుల్లో 77 శాతం ఆసియా దేశాల వారే. అమెరికాలో 12 లక్షల మందికిపైగా వివిధ దేశాల విద్యార్థులు ఉండగా.. చైనా తర్వాత 2,11,703 మందితో భారత్‌ది రెండో స్థానం. వారిలో కనీసం 30 శాతం వరకు ఏపీ, తెలంగాణ విద్యార్థులే ఉంటారని అంచనా. భారత్‌ నుంచి 2016లో 65,257 మందికి అమెరికా విద్యార్థి వీసాలు జారీ చేయగా..2017లో అది 47,302 మందికి తగ్గింది. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు ఎక్కువగా జులై, ఆగస్టు(ఫాల్‌ సీజన్‌)లోనే వెళ్తుంటారు. అక్కడికి వెళ్లే వారు కనీసం ఆర్నెల్ల ముందు నుంచే అవసరమైన ప్రక్రియను ప్రారంభిస్తారు.ఈ ఏడాది జనవరిలో డాలర్‌ విలువ రూ.65(డాలర్‌ కొనుగోలు) ఉండగా.. ఇప్పుడది రూ.70కి ఎగబాకిన నేపథ్యంలో దాని ప్రకారం పెరగబోయే వర్సిటీల రుసుముల భారాన్ని లెక్కించుకుంటూ తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇంతటితో ఆగుతుందా? ఇంకా పెరుగుతుందా? అన్నది తెలియక..ఏం చేయాలో పాలుపోక తర్జనభర్జనలు పడుతున్నారు. అమెరికాలో సెమిస్టర్‌కు 3,500-18 వేల డాలర్ల వరకు ట్యూషన్‌ ఫీజు ఉన్న విశ్వవిద్యాలయాలున్నాయి. ఇక సెమిస్టర్‌కు జీవన వ్యయం ప్రాంతాన్ని బట్టి 3 వేల డాలర్ల నుంచి 6 వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువగా రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీకి రుసుములు 15-20 వేల డాలర్ల (దాదాపు రూ.10-14లక్షలు) వరకు ఖర్చయ్యే విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందుతుంటారు. దీన్నిబట్టి పెరిగిన డాలర్‌ ధర ప్రకారం ఒక్కో విద్యార్థిపై రెండేళ్లలో రూ.లక్ష అదనపు భారం పడుతుంది. జీవన వ్యయం కింద మరో రూ.50 వేల అదనపు భారం తప్పదు. అంటే మొత్తం మీద రూ.లక్షన్నర భారం మోయాలన్నమాట. రుసుములు అధికంగా ఉండే వర్సిటీల్లో చేరితే రెండేళ్లకు కలిపి రూ.3 లక్షల వరకు ఆర్థిక భారం తప్పేలా లేదన్నది నిపుణుల విశ్లేషణ.
* ఆయన జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఆచార్యుడు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన కుమారుణ్ని..పెర్డూ విశ్వవిద్యాలయంలో మాస్టర్‌ డిగ్రీ చదివించేందుకు గతేడు అమెరికా పంపారు. ప్రస్తుతం మూడో సెమిస్టర్‌ చదువుతున్నాడు. సెమిస్టర్‌కు 15 వేల డాలర్లు ట్యూషన్‌ ఫీజు. డాలర్‌ విలువ పెరగడం వల్ల ఒక్కో సెమిస్టర్‌కు కేవలం వర్సిటీ రుసుం కోసమే రూ.75 వేలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి. వసతి, ఇతర ఖర్చుల కోసం ఒక్కో సెమిస్టర్‌కు 3 వేల డాలర్లు ఖర్చవుతుండగా.. ఆ భారం మరో రూ.15 వేలు. అంటే ఈ రెండు సెమిస్టర్లకు కలిపి దాదాపు రూ.లక్షన్నర అదనపు భారం పడుతుంది. దానివల్ల నెలకు రూ.90 వేల వేతనం అందుకుంటున్న తానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, సాధారణ ఉద్యోగుల పరిస్థితి తలకిందులవక మానదని ఆ ఆచార్యుడు వ్యాఖ్యానించారు.
* ఆయనో రైతు. పేరు దండమూడి రాంబాబు. ఊరు కృష్ణా జిల్లా ఉయ్యూరు. ఆయన కుమార్తె నందిని సెంట్రల్‌ మిషిగాన్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ఎంఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సెమిస్టర్‌కు 5 వేల డాలర్ల చొప్పున నాలుగింటికీ 20 వేల డాలర్లు ఖర్చవుతుంది. ‘రూపాయి విలువ తగ్గడం వల్ల రెండు సెమిస్టర్లకు జీవన వ్యయంతో కలిపి సుమారు రూ.90 వేల వరకు అదనపు భారం భరించాల్సి వస్తోందని, ఇది నేను ఊహించలేదని’ ఆయన వాపోయారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com