డోనాల్డ్…కళ్ళు తెరువు. అమెరికాలో మెరికలంతా వలసవాదులే!

ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వలసదారులు, శరణార్థులను అడ్డుకోవాలని ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ విమర్శించారు. అమెరికా వలసదారుల దేశమని, అందుకు గర్వపడాలని ఆయన అన్నారు. ముస్లిం మెజారిటీ దేశాల నుంచి ఇస్లామిక్‌ ఉగ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించకుండా ఉండేందుకు, శరణార్థులను తగ్గించేందుకు నిబంధనలను కఠినతరం చేసే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ‘మీలో చాలా మంది లాగే నేను కూడా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ప్రభావాల గురించి ఆందోళన చెందుతున్నా’ అని జుకర్‌బర్గ్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. ‘ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. కానీ అందుకు కేవలం దేశానికి ఆపద కలిగించే వారిపై మాత్రమే దృష్టి పెట్టాలి. శరణార్థుల కోసం, సహాయం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం మన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచాలి. మనమంతా అలా వచ్చిన వాళ్ల వారసులమే. కొన్ని దశాబ్దాల క్రితం ఇలాగే శరణార్థులను తిప్పి పంపించి ఉంటే ఈరోజు ప్రిసిల్లా కుటుంబం ఇక్కడ ఉండేది కాదు’ అని జుకర్‌బర్గ్‌ రాశారు. జుకర్‌బర్గ్‌ భార్య ప్రిసిల్లా చాన్‌ చైనా, వియత్నాంల నుంచి అమెరికాకు వచ్చిన శరణార్థుల కుటుంబానికి చెందిన వారు. తన తాత ముత్తాతలు కూడా జర్మనీ, ఆస్ట్రియా, పోలండ్‌ల నుంచి వచ్చినవారేనని జుకర్‌ పేర్కొన్నారు. ‘ప్రిసిల్లా విషయం నా వ్యక్తిగతం. కానీ కొన్నేళ్ల క్రితం స్థానిక మిడిల్‌ స్కూల్‌లో క్లాస్‌ తీసుకున్నప్పుడు చాలా మంది నా బెస్ట్‌ స్టూడెంట్స్‌ వలసదారులు. వాళ్లు మన భవిష్యత్తు కూడా. మనది వలసదారులతో కూడిన దేశం. ప్రపంచంలోని ఉన్నతమైన, ప్రతిభావంతులైన వారు ఇక్కడ ఉండడానికి, పనిచేయడానికి అవకాశం లభిస్తే అమెరికాకు చాలా లాభం జరుగుతుంది. ప్రజలందరినీ ఒకటిగా చేసి, ఈ ప్రపంచాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ధైర్యం, సహానుభూతి మనందరిలో రావాలని ఆశిస్తున్నా’ అని ఆయన తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com