తండ్రికి తగ్గ తనయుడు–స్నేహసాయాల పోషకుడు-యార్లగడ్డ శివరాముడు–TNI ప్రత్యేకం


ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) పుట్టింది న్యూయార్క్‌లో అయినప్పటికీ దానిని పటిష్ఠవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో డెట్రాయిట్ ప్రవాస తెలుగువారు బాపిన తెగువ, చూపిన చొరవ తానా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. డెట్రాయిట్ ప్రాంతం నుండి తానా అధ్యక్షులుగా పలువురు ప్రముఖులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి తానా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకు విస్తరింపజేశారు. అదే విధంగా తానా ఫౌండేషన్‌లోనూ, బోర్డులోనూ పలువురు డెట్రాయిట్ ప్రముఖులు పదవులు అలంకరించి తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. అటువంటి ప్రాంతం నుండి తానాలోని ప్రతిష్ఠాత్మకమైన తానా ఫౌండేషన్ ట్రస్టీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చాలా కష్టతరమైన పని. ప్రస్తుతం జరుగుతున్న తానా ఎన్నికల్లో 2017-2021 సంవత్సరాలకుగానూ ఫౌండేషన్ ట్రస్టీగా చిన్న వయస్సులోనే ఏకగ్రీవంగా ఎన్నికైన యార్లగడ్డ శివరామ్ అభినందనీయుడు. యువకుడైన శివరామ్ ఈ పదవికి ఎన్నిక కావటం పట్ల ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

* తండ్రి బాటలోనే
శివరామ్ తండ్రి ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గురించి అమెరికాలో తెలియని ప్రవాస తెలుగువారు లేరు. లక్ష్మీప్రసాద్‌కు తానా పుట్టినప్పటి నుండి ఆ సంస్థతో విడదీయరాని అనుబంధం ఉంది. నందమూరి తారకరామారావు న్యూయార్క్‌లో జరిగిన తానా సమావేశానికి హాజరయినప్పుడు ఆయనకు సహాయకుడిగా లక్ష్మీప్రసాద్ ఆ పర్యటనలో ఉన్నారు. అంతటి దీర్ఘ కాలంగా ఆయనకు తానాతో సంబంధాలు ఉన్నాయి. రెండేళ్లకొకసారి జరిగే తానా మహాసభలకు ఆయన ప్రత్యేక అతిథిగా క్రమం తప్పకుండా హాజరవుతూ ఉంటారు. ఆయన ప్రసంగం ప్రవాసాంధ్రులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తండ్రి బాటలోనే ఆయన తనయుడు శివరామ్ కూడా తానా చరిత్రతో మమేకమవుతూ వర్తమానంలో దాని ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ సమాంతరంగా పయనిస్తున్నారు.* బాల్యం-విద్యాభ్యాసం
లక్ష్మీప్రసాద్, సౌజన్య దంపతుల కుమారుడైన శివరామ్ ప్రసాద్ బాల్యం విజయవాడలో గడిచింది. ప్రాథమిక విద్య వికాస్ విద్యావనంలో, ఉన్నత విద్య సిద్ధార్థ ఆదర్శ్ పబ్లిక్ స్కూల్లో చదివారు. కోనేరు లక్ష్మయ్య కళాశాల ఐటీ విభాగ తొలిబ్యాచ్‌లో శివరాం విద్యార్థి. సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయంలో ఏంబీఏ పూర్తి చేశారు.
* చురుగ్గా సేవా కార్యక్రమాలు
* 2001లో అమెరికాలో ప్రవేశించిన శివరామ్ అడెకో సంస్థలో ఐటీ విభాగ ప్రాంతీయ సంచాలకులుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం హోటల్ వ్యాపారంలో స్థిరపడ్డారు.
* మాయి(Mai) ఫౌండేషన్ ద్వారా ఆయన చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గోంటున్నారు. వృద్ధులు, నిరాదరణకు గురైనవారు, మత్తుకు బానిసైన వారిని ఆదుఖొవడం, పునరావాసం కల్పించటం ఈ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశాలు. ఈ సంస్థ ద్వారా 7దక్షిణాసియా దేశాలకు సేవా కార్యక్రమాలు అందుతున్నాయి.
* తానాతో అనుబంధం
* 2005 నుండి తానాతో శివరాంకు అనుబంధం ఏర్పడింది. ఆ ఏడాది అక్కడ జరిగిన తానా మహాసభలకు భద్రత విభాగం సమన్వయకర్తగా పనిచేశారు.
* 2013-15 సం.లలో తానా తెలుగు అభివృద్ధి కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
* 2015లో డెట్రాఇట్‌లో జరిగిన తానా మహా భలకు వేదిక కమిటీ అధ్యక్షుడిగా సేవలందించారు.
* గత తానా ఎన్నికల్లో డెట్రాయిట్ నుండి ప్రాంతీయ ప్రతినిధిగా ఎన్నికయ్యారు.
* తానాతో పాటు డెట్రాయిట్ తెలుగు సంఘం తదితర సంస్థల్లో సభ్యుడిగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు.
* తానా తరుపున అటు అమెరికాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.
* నేపాల్ భూకంప బాధితులకు పెద్ద ఎత్తున అమెరికాలో విరాళాలు, ఇతర వస్తు సామాగ్రి సేకరించి స్వయంగా నేపాల్ వెళ్లి బాధితులకు అందజేశారు.
* చెన్నై వరద బాధితుల కోసం తన మిత్రుల సహాయంతో పెద్ద ఎత్తున వస్త్రాలను, వస్తు సామాగ్రిని అందజేశారు.
* తానా బ్యాక్‌ప్యాక్ పథకం కింద డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్దులకు విరివిగా బ్యాగులు పంపిణీ చేశారు.

* కుండ బద్దలు కొట్టినట్లుగా
శివరామ్ ప్రసాద్ మాంచి మాటకారి. ఎవరు ఏమి అనుకున్నా తాను నమ్మినదానిని, తనకు ఇష్టమైన విషయాన్ని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పడంలో వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో తన మిత్రులు, సన్నిహితులు వ్యతిరేకించినా, వెక్కిరించినా, వెనక్కులాగినా రాజకీయంగా తాను నమ్మిన నాయకులకు బహిరంగంగా మద్దతు ప్రకటించడంలో శివరామ్ ఎప్పుడు వెనుకాడలేదు.
ప్రస్తుతం తానాలో కీలకమైన ఫౌండేషన్ విభాగానికి ట్రస్టీగా ఏకగ్రీవ ఎన్నిక కావడం ద్వారా తనపై బాధ్యతలు మరింతగా పెరిగాయని గతంలో కన్నా చురుగ్గా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని శివరామ్ TNIకు తెలిపారు. తానా ఖ్యాతిని ఇనుమడింపజేయడానికి, తెలుగు భాషను పరిరక్షించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తన స్నేహితులే బలం, బలగం, బలహీనతగా ప్రచారం చేసుకునే శివరాం తాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన తానా నేతలకు, స్థానిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.—కిలారు ముద్దుకృష్ణ.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com