Business

తగ్గిన బంగారం ధర – TNI వాణిజ్యం

తగ్గిన బంగారం ధర  – TNI వాణిజ్యం

*మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే శుభవార్త. గత కొద్ది రోజులుగా బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్న పసిడి ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. కేవలం ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చమురు ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్’కు 0.8% తగ్గి $1,975.69కు పడిపోయింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 0.5% తగ్గి 1,978.80 డాలర్లకు చేరుకుంది.ప్రపంచ రేట్లకు అనుగుణంగా భారతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఒక్కరోజులో సుమారు రూ.2,000కి పైగా పడిపోవడం విశేషం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్‌ గోల్డ్‌ 999) బంగారం ధర సుమారు రూ.2050కి పైగా తగ్గి రూ.52,230కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.49,723 నుంచి రూ.47,843కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.49,800 నుంచి రూ.48,200కు తగ్గింది. అంటే ఒక్కరోజులో రూ.1600 తగ్గింది అన్నమాట.ఇక బిస్కెట్‌ గోల్డ్‌ బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.52,580కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. వెండి ధర రూ.3,000కి పైగా తగ్గి రూ.68,837కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. పసిడి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి అనే విషయం గుర్తుంచుకోవాలి.

*భారత్‌పే వ్యవహారాలపై జీఎస్‌టీ దర్యాప్తు
ఫిన్‌టెక్‌ సంస్థ భారత్‌పే పన్ను ఎగవేతలపై జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ విభాగం మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. సేవలకు సైతం నకిలీ ఇన్వాయిస్‌లను జారీ చేశారా, లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకోనుంది. గడిచిన నాలుగేళ్ల కాలానికి సంబంధించి కంపెనీ పుస్తకాలను తనిఖీ చేసే పనిలో ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్‌పే సహ వ్యవస్థాపకుడైన అష్నీర్‌ గ్రోవర్, అయన భార్య మాధురి జైన్‌ అక్రమాలు, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు కంపెనీ అంతర్గత దర్యాప్తులో వెల్లడి కావడం తెలిసిందే. దీంతో గ్రోవర్‌ దంపతులను అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు భారత్‌పే ప్రకటించింది.భారత్‌పే ఎటు వంటి ఉత్పత్తులు సరఫరా చేయకుండానే నకిలీ ఇన్వాయిస్‌లు జారీ చేయడంపై జీఎస్‌టీ అధికారులు గడిచిన ఏడాది కాలం నుంచి దర్యాప్తు నిర్వహిస్తుండడం గమనార్హం. గతేడాది అక్టోబర్‌లో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారులు భారత్‌పే ప్రధాన కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహించారు. ‘‘సరుకుల సర ఫరా లేకుండానే ఇన్వాయిస్‌లు జారీ చేసిన కేసులో దర్యాప్తు నిర్వహిస్తున్నాం. ఎటువంటి సేవలు అందించకుండా ఇన్వాయిస్‌లు జారీ చేసినట్టు మాధురీ జైన్‌కు వ్యతిరేకంగా ఇటీవలి ఆరోపణలు రావడంపై వాటిపైనా దృష్టి పెట్టనున్నాం’’ అని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

*త్వరలో అమెరికాలో కొవాక్సిన్‌: భారత్‌ బయోటెక్‌
అమెరికా, కెనడా దేశాల్లోనూ కొవాక్సిన్‌ టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. ఇందుకోసం ఆక్యుజెన్‌ ఇంక్‌ అనే అమెరికా కంపెనీతో కలిసి పని చేస్తున్నట్టు తెలిపింది. ఈ రెండు దేశాల్లోనూ అన్ని వయసుల వారికి ఈ టీకాను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని ఈ మేరకు ట్విటర్‌లో సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

*హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే విజయా డయాగ్నోస్టిక్‌ నుంచి ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ కారకోరం లిమిటెడ్‌ తప్పుకుంది. కంపెనీ ఈక్విటీలో తనకు ఉన్న 73 లక్షల షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా దాదాపు రూ.332 కోట్లకు విక్రయించింది. గత ఏడాది డిసెంబరు నాటికి విజయా డయాగ్నోస్టిక్‌ ఈక్విటీలో కారకోరం లిమిటెడ్‌కు 9.64 శాతం వాటా ఉంది. సోమవారం ఈ షేర్లను సగటున ఒక్కో షేరు రూ.425.75 చొప్పున విక్రయించింది.

*చర్మ రక్షణ ఉత్పత్తుల రంగంలో తన పట్టు మరింత పెంచుకునేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే చెన్నై కేంద్రంగా ఉన్న స్కిన్‌కేర్‌ ఉత్పత్తుల కంపెనీ క్యురేషియో హెల్త్‌కేర్‌ను దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ కంపెనీ కొనుగోలు కోసం బిడ్‌ దాఖలు చేసింది. మరోవైపు డాక్టర్‌ రెడ్డీస్‌తో పాటు అరబిందో ఫార్మా, బయోకాన్‌, జేబీ కెమికల్స్‌, టొరంట్‌ ఫార్మా, జైడస్‌ హెల్త్‌కేర్‌ కంపెనీలు కూడా క్యురేషియో కోసం పోటీపడుతున్నాయి. ఈ సంస్థలతో పాటు మూడు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు కూడా క్యురేషియో ఆస్తులపై ఆసక్తితో ఉన్నాయి. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన ఈ కంపెనీ కొనుగోలు కోసం ఈ నెలాఖరుకల్లా కంపెనీల నుంచి రెండో విడత బిడ్స్‌ ఆహ్వానించే అవకాశం ఉంది

*టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రూ. 18 వేల కోట్ల విలువైన షేర్ బైబ్యాక్ ఆఫర్ 9 వ తేదీన ప్రారంభమై, 23 న ముగియనుంది. కిందటి(ఫిబ్రవరి) నెల 12 న… కంపెనీ 4 కోట్ల షేర్లను… రూ. 4,500 చొప్పున షేర్ బైబ్యాక్ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ మేరకు… టీసీఎస్ ఏప్రిల్ ఒకటిన… స్టాక్ ఎక్స్ఛేంజీల్లో… బిడ్ల సెటిల్మెంట్ కోసం చివరి తేదీగా నిర్ణయించింది.2017లో కూడా ఇలాంటి కసరత్తు జరిగింది.

*నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను ఏడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కో-లొకేషన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రను సీబీఐ ఆదివారం ఢిల్లీలో అరెస్ట్ చేసింది.

*ఉద్యోగ మార్కెట్‌కు కరోనా వైరస్‌ గండం దాదాపుగా తొలిగినట్టేనని ఓ సర్వే పేర్కొంది. భవిష్యత్‌లో పుట్టుకొచ్చే కొవిడ్‌ కొత్త వేరియంట్లు ఉద్యోగ నియామకాలపై అంతగా ప్రభావం చూపకపోవచ్చని మెజారిటీ (73 శాతం) ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. 27 శాతం మాత్రం భవిష్యత్‌ స్థితిగతులపై ఖచ్చితంగా లేమని అన్నారని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ తాజా సర్వే నివేదిక వెల్లడించింది. ఐటీ, ఐటీఈఎస్‌, బీపీఓ, లాజిస్టిక్స్‌, మాన్యుఫాక్చరింగ్‌, మీడియా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫార్మా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇంజనీరింగ్‌, ఎడ్యుకేషన్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆతిథ్యం, హెచ్‌ఆర్‌ సహా పలు రంగాలకు చెందిన 1,468 మంది ఉద్యోగులు, ఎగ్జిక్యూవ్‌లను ఆన్‌లైన్‌లో సర్వే చేసినట్లు జీనియస్‌ కన్సల్టెంట్స్‌ తెలిపిం.

*రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడుదుడుకులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ డిపార్ట్‌మెంట్‌ (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే అన్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ మెగా ఐపీఓ ప్రారంభంపై పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి (మార్చి 31) ఎల్‌ఐసీ ఐపీఓను పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దాంతో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభ సమయంపై ప్రభుత్వం పునరాలోచించవచ్చని శుక్రవారం ఆయన పేర్కొన్నారు