తనకి…పెళ్ళికి ముందే పిల్లలు ఉన్నారు

తన భార్య హసీన్‌ జహాన్‌ చేసిన ఆరోపణలు ఖండిస్తూనే ఆమెతో రాజీకి ప్రయత్నిస్తూ వచ్చిన టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమి.. తొలిసారిగా ఆమెపై ప్రత్యారోపణలు చేశాడు. విమర్శలు గుప్పించాడు. తనను రెండో పెళ్లి చేసుకున్న విషయాన్ని హసీన్‌ దాచిందని అతనన్నాడు. ‘‘నన్ను ఆమె రెండో పెళ్లి చేసుకున్న విషయం నాకు ముందు తెలియదు. పెళ్లయిన తర్వాతే దాని గురించి తెలిసింది. తన ఇద్దరు కూతుళ్లను అక్క పిల్లలుగా నాకు పరిచయం చేసింది’’ అని షమి చెప్పాడు. పెళ్లయిన తర్వాత హసీన్‌ కోసం ఇప్పటిదాకా రూ.1.5 కోట్లు తాను ఖర్చు చేసినట్లు షమి తెలిపాడు. ‘‘కుటుంబం కోసం నేను అన్ని బాధ్యతలూ సక్రమంగా నిర్వర్తించాను. నా భార్య ఎప్పుడూ అభద్రతా భావంతో ఉండేది. ఎప్పుడూ ఏదో ఒక ఆరోపణ చేయడం ఆమెకు అలవాటు. తనో అబద్ధాల కోరు. తన కోసం రూ.1.5 కోట్లు ఖర్చు చేశా. ఆమె నా డెబిట్‌ కార్డుతో షాపింగ్‌ చేసేది’’ అన్నాడు. ఇటీవల దుబాయ్‌లో తాను ఏం చేశానో హసీన్‌కు అంతా తెలుసని.. ఆ సమయంలో కూడా తనకు వజ్రం, బంగారం తీసుకురావాలని తనను కోరిందని షమి చెప్పాడు. తాను హసీన్‌ను ఫోన్లో బెదిరిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై షమి స్పందిస్తూ.. ‘‘నేను ఆమెతో రాజీ కోసమే గట్టిగా ప్రయత్నిస్తున్నా. అందుకోసమే ఫోన్‌ చేస్తున్నా. కానీ ఆమె మాత్రం నేను బెదిరిస్తున్నానని అంటోంది. నాకు నా కూతురి భవిష్యత్తు గురించి భయంగా ఉంది. ఈ వ్యవహారంలో హసీన్‌ను ఎవరో రెచ్చగొడుతున్నట్లుంది’’ అన్నాడు. తనపై హసీన్‌ చేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపైనా షమి స్పందించాడు. తాను ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు విచారణలో తేలితే ఉరికి సిద్ధమని ప్రకటించాడు. తనపై వచ్చిన ఆరోపణల గురించి స్పందించే క్రమంలో షమి కన్నీటి పర్యంతమయ్యాడు. ‘‘నేనెప్పుడూ నిజాయితీగానే ఆడాను. బీసీసీఐ తొందరపడి నా కాంట్రాక్టును రద్దు చేసింది. బోర్డు చేసే విచారణలో నేను నిందితుడినని తేలితే ఉరి తీయండి’’ అని షమి అన్నాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com