తరతరాల రచయితలపై తెలుగు వెన్నెల సదస్సు

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారంనాడు సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 109 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు. కార్యక్రమంలో ముందుగా స్థానిక సంగీత అధ్యాపకులు స్వాతి మరియు వారి శిష్యబృందం పది మంది పిల్లలు తెలుగుదనం ఉట్టిపడే వస్త్రధారణతో ‘విఘ్నేశ్వర స్తోత్రం’ మరియు ‘వందేభారతమాతరం‘ గేయాలను రాగ భావయుక్తంగా చక్కగా ఆలపించారు. తరువాత సాహిత్యవేదిక సభ్యులు బసాబత్తిన శ్రీనివాసులు, తాను ‘ మోటారు బైకు మీద మెక్సికో ప్రయాణం ‘ పై వ్రాసిన వ్యాసంలో మొదటి భాగాన్ని సభకి పరిచయం చేసారు. బైకు మీద దూర ప్రయాణాలకి కావలసిన సామాగ్రి, తీసుకోవలసిన జాగ్రత్తలు, సన్నాహాలు వివరంగా తెలియచేస్తూ ప్రయాణంపై ఉత్సుకత పెంచి, తదుపరి భాగం మళ్ళీ వేదికలో అంటూ సశేషం అన్నారు. సాహిత్యవేదిక సభ్యులు డా. కలవగుంట సుధ ఆంధ్రనాట్యం, పేరిణి శివతాండవం వంటి కళలను వెలికితీసి ప్రత్యేక స్థానం కల్పించిన డా. నటరాజ రామక్రిష్ణ “ఆంధ్రనాట్యం – ఆలయ నృత్యాలు” రచనా సంకలనాన్ని సభకు పరిచయం చేశారు. రామప్ప గుడిలో శిల్పాల భంగిమల ఆధారం గా పుట్టినది ఆంధ్రనాట్యం అనీ, ఇది కేవలం ఆలయ సాంప్రదాయంగా ఉండేదని, దేవదాసీలు మాత్రమే ఆలయంలో వివిధ స్థానాలలో ఒక పద్దతి ప్రకారం చేసే నృత్యం అనీ, కాలక్రమేణా స్త్రీ పురుషులు రాజాస్థానాలలో చేస్తూ అందరూ చేసే కళగా మారిందనీ వివరించారు. సాహిత్యాభిమాని వేముల లెనిన్ బాల్యంపై మహాకవులు తమ భావాలను ఎలా తెలిపారో వింనండి అంటూ శ్రీ శ్రీ, దాశరథి, గోరేటి వెంకన్నల రచలను దరువుతో వినిపించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. భారతదేశం నుండి విచ్చేసిన డా. కమలాదేవి తమ స్వీయ కవిత “నదిని నేను ” వినిపించారు. ‘చంద్రలత ‘ గారి రచనలో నదికి ఆనకట్ట కట్టడం అవసరమా, కడితే ఎక్కడ కట్టాలి, దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు, పర్యావరణం మీద ఉండే ప్రభావాలు ఏమిటి వంటి అంశాలన్నిటిని దృష్టిలో పెట్టి పరిశీలన చేసి వ్రాసిన రచన అని అటువంటి రచనలు కలకాలం గుర్తుండిపోతాయని “దృశ్యా దృశ్యం” నవలను పరిచయం చేశారు. ఈ నాటి 109వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.చిర్రావూరి శ్యాం(మెడికో శ్యాం)ని పరిచయం చేస్తూ సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ వేదిక మీదకు ఆహ్వానించగా, స్థానిక సినీ నిర్మాత మరియు దర్శకుడు హరిచరణ్ ప్రసాద్ మెడికో శ్యాంకి పుష్పగుచ్చం అందజేశారు. ముఖ్య అతిథి డా.చిర్రావూరి శ్యాం (మెడికో శ్యాం)“ఆలోచనాలోచనల్లో నే చదివిన పాత్రలూ వాక్యాలు” అనే అంశం మీద ప్రసంగించారు. మారుతున్న మానవ సంబంధాలతో మనతో చివరి వరకూ మిగిలేవి ఙ్ఞాపకాలు అనుభూతులే కదా, నే చదివిన రచనలలో నాకు తరచుగా గుర్తుకువచ్చే కొన్ని పాత్రలూ వాక్యాలు మీతో పంచుకుంటాను అంటూ మొదలైన ప్రసంగం గంటన్నర పాటు ఆసక్తికరంగా సాగి అందరినీ ఆకట్టుకుంది. ఒక రచన ప్రజలకు గుర్తుండిపోవడానికి కారణం రచయిత శక్తే కానీ, కథా వస్తువు కాదని, కవితకి నిజం ఖనిజం కాదేమో కానీ, కథకు మాత్రం నిజం ఖనిజం అని తాను నమ్ముతానని చెప్పారు. బుచ్చిబాబు, కొకు, చాసో, శ్రీపాద, రావిశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు, పురాణం సీత, కొమ్మూరి వేణుగోపాల్ రావ్, పతంజలి శాస్త్రి, ముళ్ళపూడి వెంకట రమణ, కవన శర్మ, భరాగో, తిలక్, ఆరుద్ర, వసుంధర, మల్లాది వెంకట క్రిష్ణమూర్తి, నిడదవోలు మాలతి, త్రిపుర మొదలైనవారి రచనలలోనుండి తనకు నచ్చిన పాత్రలూ, కొన్ని వాక్యాలు సభతో పంచుకుని, వీరందరి నుంచి మనం ఏమైనా నేర్చుకోగలమా, మన ప్రయాణం సుగమం చేసుకోగలమా అనేది ఆలోచించవలసిన విషయాలు అంటూ తమ ప్రసంగాన్ని ముగించారు. బసాబత్తిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో , ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రసంగాన్ని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న “టాంటెక్స్ తరంగిణి” టోరి రేడియో కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం చేసారు. ముఖ్య అతిథి డా.చిర్రావూరి శ్యాం (మెడికో శ్యాం)ని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి శాలువతో మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తక్షణ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కోశాధికారి దండ వెంకట్, మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, అట్లూరి స్వర్ణ, బసాబత్తిన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ సదస్సు విజయవంతానికి తోడ్పడిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com