తాటిముంజలు తిన్నారా?

వేసవి మొదలైందని ఎండలూ, మామిడి కాయలే కాదు… తాటికాయలూ గుర్తుచేస్తాయి. ఎండల తాపాన్ని తగ్గించుకోవడానికి గ్రామీణులు ప్రధానంగా ఆశ్రయించేది ఠండా ఠండా తాటి ముంజల్నే. వాటిని రోజూ తింటుంటే వేసవి కూడా ఎంతో చల్లగా ఉంటుంది.
*మామిడి, జామ, సపోటాలాంటి చెట్ల కాయలూ, పండ్లని ఎవరైనా కోయచ్చు. కానీ తాటి కాయలు అలా కాదు, కొందరు మాత్రమే చెట్టెక్కి వాటిని కిందకి దించగలరు. తర్వాత ఆ కాయల్ని ఒక దగ్గర చేర్చడం, చేర్చిన వాటిని కత్తితో కోసి తినడం… కాస్త శ్రమతో కూడిన పని. ఒకరిద్దరివల్ల కాదు. అందుకే తాటి కాయలు తినాలంటే పల్లెల్లో స్నేహితులూ, కుటుంబ సభ్యుల బృందమే బయలుదేరుతుంది. గుండ్రని తాటికాయకి పైన ఉండే డిప్పని కోసేయగానే నిండు కుండల్లాంటి మూడు కళ్లు ప్రత్యక్షమవుతాయి. అంతే, అమాంతం బొటనవేలుని వాటిలోకి చొప్పించి నోట్లోకి తాజా తాజా గుజ్జుని జుర్రుకోవడం మొదలుపెడతాం. తాటి కాయలు లేతగా ఉంటే వాటిలో నీటిని తాగేసి దాహాన్ని తీర్చుకోవచ్చు. అలాకాకుండా ద్రవ, ఘన స్థాయులకి మధ్యలో ఉంటే ఆ గుజ్జుని జుర్రుకుని దాహంతోపాటు ఆకలినీ తీర్చుకోవచ్చు. తాటిముంజల్ని చేత్తో తినడం అందరికీ చేతకాదు. ముఖ్యంగా పట్నం, నగరాలకు చెందినవాళ్లు చేత్తో తినడంరాక ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి ముంజల్ని కాయనుంచి బయటకు తీసి ఇస్తారు. దీని ఆకారం, రంగు, రుచిని చూసి ఆంగ్లేయులు తాటి ముంజలకు ‘ఐస్‌ ఆపిల్‌’ అని పేరు పెట్టారు. ప్రజల వద్దకే అన్నీ అన్నట్టు… ఇప్పుడు పట్టణాలకూ, నగరాలకూ తాటి ముంజలు వస్తున్నాయి. ఇంట్లో కూర్చుని తింటే దాహం తీరి, పొట్ట నిండుతుందేమో కానీ వాటిని పొలం గట్లమీద తిన్నపుడు ఉండే ఫీల్‌ రాదు. పక్కవాళ్లతో పోటీపడుతూ, కబుర్లు చెప్పుకుంటూ, వేళాకోళాలాడుకుంటూ తింటుంటే వచ్చే మజాయేవేరు. అసలు పల్లెల్లో తాటికాయలు తినడం అంటే ముంజలు తినడంతో పూర్తికాదు. ఆ దార్లో ఉండే మామిడి కాయల్నీ, జీడి మామిడినీ రుచి చూడాల్సిందే, తిరిగొస్తూ పొలంలో మోటారు బావి దగ్గర స్నానాలు కానివ్వాల్సిందే. కాబట్టి ఈ వేసవికి పల్లెటూరు ప్లాన్‌ చేసుకోండి.
*చల్లని ముంజ పోషకాల ఇలా
100 గ్రాముల ముంజల్లో 43 కేలరీల శక్తి ఉంటుంది. దీన్లో పోషక విలువలూ ఎక్కువే. విటమిన్‌-ఎ సమృద్ధిగా ఉంటుంది. బి, సి విటమిన్లూ ఉంటాయి. అరటి పండు స్థాయిలో వీటిలోనూ పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడటమే కాకుండా శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. ఇంకా ఐరన్‌, జింక్‌, ఫాస్ఫరస్‌, కాల్షియం లాంటి ఖనిజ లవణాలూ ఉంటాయి. ముంజల్లో అధిక శాతం నీరు ఉండటంవల్ల వీటిని తినడంద్వారా డీహైడ్రేషన్‌ రాకుండా చూసుకోవచ్చు. అందుకే పిల్లలూ పెద్దలూ ముంజలు తినాల్సిందే.
*తాటిపండులో ఎన్ని రూపాలో…
బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా… ఈ నానుడి తాటి కాయలకు వర్తించదు. ముదిరిన తాటికాయల్ని కొట్టకుండా చెట్టుకే వదిలేస్తే అవి పండి కిందపడతాయి. అలాంటపుడు వాటిపైన ఉండే తాటి గుజ్జుని తినొచ్చు. దాంతో బెల్లం, తాటి తాండ్ర కూడా తయారుచేస్తారు. ఈ గుజ్జుతోనే పిండి వంటలూ చేస్తారు. పండి నేల రాలిన తాటికాయల్ని అలాగే వదిలేస్తే వాటిలోని ముంజ ఎండి లేత కొబ్బరి ముక్కలా మారి, బుర్రగుంజు వస్తుంది. లోపల కాస్త మెత్తగా ఉండే దీన్ని కూడా తినొచ్చు. పండిన తాటికాయల్ని కుప్పగా పోసి వాటిపైన మట్టిని కప్పేస్తే వర్షాకాలంలో అవి మొలకెత్తి తేగలు వస్తాయి. అప్పుడు తేగల్ని టెంక నుంచి వేరుచేసి కాల్చి తినొచ్చు. ఆ తేగల్ని టెంకల నుంచి వేరుచేయకుండా వదిలేస్తే మొక్కలవుతాయి. ఇన్ని రూపాల్లో తినగలిగేది ఇంకోటి ఉండదేమో! తాటాకు ఇళ్లులేని పల్లెటూళ్లు ఉంటాయేమో కానీ, తాటి చెట్టులేని పల్లెటూరు ఉండదంటే అతిశయం కాదు. అయితే మిగతా చెట్లలానే వీటి సంఖ్యా క్రమంగా తగ్గిపోతోంది. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, తాటి చెట్లు ఉంటే, ఈ వేసవే కాదు, ప్రతి వేసవీ చల్లగా ఉంటుంది!

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com