తానాలో రాజుకుంటున్న ఎన్నికల వేడి-TNI ప్రత్యేకం

ప్రపంచంలోనే పెద్ద ప్రవాసాంధ్ర తెలుగు సంఘంగా రూపుదిద్దుకున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లో ప్రతి రెండేళ్లకొకసారి పాలకవర్గ ఎన్నికలు నిర్వహిస్తారు. మరొక 5నెలల్లో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. తానా పాలకవర్గంలో చోటు సంపాదించడం కోసం చాలా మంది ఆశావహులు ఇప్పటి నుండే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. తెరవెనుక లాబీయింగ్ జోరుగా నిర్వహిస్తున్నారు. తానా అధ్యక్ష పదవి కోసం ఇప్పటి వరకు ఇరువురు నేతల పేర్లు బయటకు వచ్చాయి. తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ తాళ్లూరి జయశేఖర్(న్యూయార్క్), తానా ఫౌండేషన్ ప్రస్తుత చైర్మన్ గోగినేని శ్రీనివాస్(డెట్రాయిట్)లు అధ్యక్ష పదవి కోసం తలపడుతున్నారు. వీరిరువురూ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించి తమకు అనుకూలంగా మద్దతును కూడగట్టుకుంటున్నారు. వాస్తవానికి గత తానా ఎన్నికల సమయంలోనే తాళ్లూరి జయశేఖర్ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. తానాలో పెద్దలు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల బరిలో నుండి తప్పుకున్నారు. ఈ పర్యాయం ఆయన మళ్లీ అధ్యక్ష పదవికి సిద్ధమవుతున్నారు. తానా అధ్యక్ష పదవికోసం మూడో వ్యక్తి కూడా రంగంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాంటాకు చెందిన తానా కమ్యూనిటి సర్వీసెస్ చైర్మన్ లావు అంజయ్యచౌదరి తనకు అధ్యక్ష పదవి కావాలని ‘మారాం’ చేస్తున్నారు. తానా పెద్దల చెవిలో తనకు అధ్యక్ష పదవి కావాలంటూ పోరుపెడుతున్నారు.

*తానా కార్యదర్శి పదవికి తీవ్రపోటీ
తానా కార్యదర్శి పదవికి కూడా ఈ పర్యాయం పోటీ తీవ్రంగా ఉండే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తానా కొశాధికారిగా ఉన్న డల్లాస్‌కు చెందిన వెన్నం మురళి ఈ పర్యాయం కార్యదర్శి పదవికోసం ప్రయత్నిస్తున్నారు. ఆయనకు పోటీగా సిలికాన్‌వ్యాలీ నుండి భక్తా భల్లా రంగంలో ఉంటారని సమాచారం. ఈ పర్యాయం కోశాధికారి పదవిని చాలా మంది ఆశిస్తున్నారు. తానా సహాయ కార్యదర్శి పదవిలో ఉన్న ఫిలడెల్ఫియాకు చెందిన పొట్లూరి రవి, సహాయ కోశాధికారి పదవిలో ఉన్న డల్లాస్‌కు చెందిన డా.అడుసుమిల్లి రాజేశ్ ఈ పర్యాయం కోశాధికారి పదవి బరిలో నిలవనున్నారు. తానా అధ్యక్షుడిగా వేమన సతీష్ ఎన్నికైన అనంతరం యువతరంలో చైతన్యం ఏర్పడింది. తానా పాలకవర్గంలో చోటు సంపాదించడం కోసం అమెరికా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో యువకులు ఉత్సాహంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. రీజనల్ ఉపాధ్యక్షులు, ఇతర పాలకవర్గ సభ్యుల పదవుల కోసం ఈ పర్యాయం పోటీ తీవ్రంగా ఉండే పరిస్ధితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.-కిలారు ముద్దుకృష్ణ

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com