తితిదేకు పురావస్తు శాఖ భరోసా

తిరుమల శ్రీవారి సన్నిధిలో పన్నెండు సంవత్సరాలకోసారి నిర్వహించే మహా సంప్రోక్షణ కార్యక్రమం ఆగస్టు 12 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. మూల విరాట్‌ కొలువైన పీఠం నుంచి గర్భాలయంలోని ప్రతి భాగం పటిష్టతకు పవిత్ర వేడుకగా మహా సంప్రోక్షణ చేయనున్నారు. గర్భాలయంలో శ్రీవారు మూల విరాట్‌ నిలబడిన పీఠాన్ని సీసం, ఇతర అష్టబంధన ద్రవ్యాలతో పటిష్టం చేయనున్నారు. సాధారణ సంప్రోక్షణలో ఆలయాన్ని మాత్రమే శుద్ధి చేస్తుండగా.. మహాసంప్రోక్షణలో గర్భాలయాన్ని కూడా శుభ్రం చేయనున్నారు. గర్భాలయంలో ఉన్న చిన్నచిన్న మరమ్మతులను పూర్తి చేస్తారు. గర్భగుడి గోపురాన్ని ప్రత్యేక జలాలతో సంప్రోక్షణ చేస్తారు. సంప్రోక్షణ జరిగే ఐదు రోజుల పాటు శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. మూలమూర్తి దర్శనం మాత్రం యథావిధిగా కొనసాగుతుందని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.
**తితిదే పరిధిలోని ఆలయాల వివరాలివ్వండి -ఈవోకు పురావస్తుశాఖ లేఖ
తితిదే పరిధిలో ఉన్న ఆలయాలు, పురాతన కట్టడాల వివరాలివ్వాలంటూ కేంద్ర పురావస్తుశాఖ తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు లేఖరాయడం చర్చనీయాంశంగా మారింది. పురాతన కట్టడాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని, పూర్వకాలంలో రాజులు ఇచ్చిన విలువైన ఆభరణాలు, భక్తులు సమర్పిస్తున్న కానుకలకు సరైన భద్రత కల్పించడంలేదని ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. వీటిపై స్పందించిన కేంద్రం పరిశీలించి నివేదిక సమర్పించాలని పురావస్తుశాఖను ఆదేశించింది. దీంతో తిరుమలలో ఉన్న పురాతన ఆలయాలు, భవనాల వివరాలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కేంద్ర పురావస్తు శాఖ తితిదేను కోరింది. ఈ మేరకు అమరావతిలో ఉన్న పురావస్తు శాఖ ప్రాంతీయ కార్యాలయం తితిదే ఈవోకు లేఖ రాసింది.
**తితిదే వర్గాల స్పందన
అమరావతి ప్రాంతీయ కార్యాలయం ద్వారా తితిదేకు పంపిన లేఖపై అధికారులు పూర్తిగా స్పందించడంలేదు. లేఖ రాసినట్టు తమకు సమాచారం ఉంది గానీ దాన్ని పూర్తిగా పరిశీలించాకే తాము నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. కేంద్ర పురావస్తు శాఖ తితిదే పరిధిలోని తిరుమలలో ఉన్న ఆలయాలను పరిశీలించేందుకు ఓ బృందం వస్తోందన్న సమాచారం ఉందన్నారు. ఈ లేఖను అన్ని కోణాల్లోనూ పూర్తిగా పరిశీలించాకే ప్రత్యుత్తరం రాస్తామని పేర్కొంటున్నారు. తితిదే ఆలయాలు, భవనాలు పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్తే.. భక్తులకు అవసరమైన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ఆటంకం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
**తితిదేలో జోక్యంపై వెనక్కి తగ్గిన కేంద్రం
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలను పరిశీలించడానికి అనుమతివ్వాలని కోరుతూ పురావస్తుశాఖ తితిదే ఈవోకు రాసిన లేఖపై దుమారం రేగింది. శ్రీవారి భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో పరిస్థితిని గమనించిన పురావస్తుశాఖ వెనక్కి తగ్గింది. ఈ మేరకు తామురాసిన లేఖను వెనక్కి తీసుకుంటున్నట్టు తితిదే ఈవోకు ఆ శాఖ డీజీ ఫోన్‌ చేసి తెలిపారు. ఈ వివరాలను తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాకు వివరించారు. ‘‘పురావస్తు శాఖ పరిధిలోకి తితిదే ఆలయాలు తీసుకొనే అవకాశం లేదని ఆ శాఖ డైరెక్టర్‌ ఫోన్‌లో స్పష్టం చేశారు. భక్తుల్లో ఎలాంటి ఆందోళన అవసరంలేదు. విజయవాడ పురావస్తు శాఖ కార్యాలయం నుంచి ఈ ఉదయం ఒక లేఖ వచ్చింది. తితిదే ఆధ్వర్యంలోని ఆలయాలను సురక్షిత ఆలయాల జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉందా? లేదా? అనే అంశంపై అధ్యయనం కోసం సమాచారం, ఫొటోలు సేకరించాల్సి ఉందని ఓ లేఖ వచ్చింది. దీనిపై భక్తుల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది. ఈ విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో దిల్లీ నుంచి కేంద్ర పురావస్తుశాఖ డీజీ ఫోన్‌ చేసి నాతో మాట్లాడారు. తితిదే ఆలయాలను తమ పరిధిలోకి తీసుకొనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదని డైరెక్టర్‌ చెప్పారు. భక్తుల తరఫున వారికి ధన్యవాదాలు చెప్పా’’ అని ఈవో వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com