తితిదేలో నూతనంగా నలుగురు ప్రధాన అర్చకులు

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా పని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తితిదేపై విమర్శలు గుప్పించిన ఎ.వి.రమణదీక్షితులపై వేటు పడింది. ఆయనను ప్రధాన అర్చకులుగా తొలగిస్తూ గురువారం తితిదే నిర్ణయం తీసుకుంది. మరోపక్క దేవస్థానం చరిత్రలో తొలిసారిగా ఒకేసారి నలుగురు ప్రధాన అర్చకులను నియమించింది. పూర్వపు మిరాశీ వ్యవస్థ కింద గొల్లపల్లి కుటుంబం నుంచి వేణుగోపాల దీక్షితులు, పైడిపల్లి వంశీయుల నుంచి కృష్ణ శేషాచల దీక్షితులు, పెద్దింటి కుటుంబం నుంచి శ్రీనివాస దీక్షితులును బుధవారమే నియమించగా తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందరాజ దీక్షితులను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే విధుల్లో చేరాలని వారందరిని ఆదేశించింది. ఆలయంలో పని చేస్తున్న మిరాశీయేతర అర్చకులు 32 మంది సర్వీసును క్రమబద్ధీకరించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అర్చకులకు విధులు కేటాయింపు బాధ్యతలు ప్రధాన అర్చకుల చేతిలో ఉండగా ఈ విధానాన్ని రద్దు చేసింది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోకు అధికారాలు బదలాయించారు.
*** రమణ దీక్షితులకు తీతీదే నోటీసులు
తిరుమల తిరుపతి దేవస్ధానం అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం టీటీడీ పాలక మండలి, అధికారులు, ఏపీ ప్రభుత్వంపై రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా రమణ దీక్షితులుకు అధికారులు నోటీసు జారీ చేశారు. అయితే టీటీడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు రమణ దీక్షితులు ఇంటికి వెళ్లగా.. ఆ సమయంలో ఆయన లేరు. దీంతో నోటీసులను అధికారులు ఇంటికి అంటించారు. కాగా, మంగళవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన రమణ దీక్షితులు.. టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనాదిగా వస్తున్న అర్చక వారసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధమంటూనే ఎన్నో అవమానాలను భరించాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. టీటీడీలోని అధికారులు కొంతమంది అధికార బలంతో ఆలయ నిబంధనలను విస్మరిస్తున్నారని, సినీ, రాజకీయ ప్రముఖులకు భజన చేస్తూ ఆలయ సంప్రదాయాలను, కైంకర్యాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రమణ దీక్షితులు చేసిన విమర్శలు, ఆరోపణలు టీటీడీ అధికారులు, వేదపండిత, ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com