తిరుమల ఆదాయం పెరిగింది

ఇల వైకుంఠం తిరుమలలో నిత్యకల్యాణం పచ్చతోరణమే. కొండకు వచ్చే స్వామివారి భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతుండగా ఈసారి హుండీ ఆదాయం సైతం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జనవరిలో శ్రీనివాసుడిని 20లక్షల97వేల మంది భక్తులు దర్శించుకోగా….హుండి ద్వారా స్వామి వారికి రూ.83కోట్ల84లక్షల వరకు ఉంది.
**కొండలలో నెలవైన శ్రీనివాసుడి దర్శనం కోసం నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. సాధారణ రోజుల్లో 60 నుంచి 70 వేలమంది, సెలవు, పర్వదినాల్లో లక్షకుపైగా భక్తులు స్వామిని సేవించుకుంటారు. రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. గతంలో రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు దర్శనానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు అంత సమయమేం పట్టట్లేదు. సాధారణ సమయంలో 4 నుంచి 8 గంటల్లో దర్శనం అయిపోతుంటే రద్దీ రోజుల్లో 8 నుంచి 12 గంటలలోపే పడుతోంది.
**ఏడాదిగా కొండకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గతేడాది కంటే అదనంగా 26వేల 605 మంది భక్తులు శ్రీనివాసున్ని దర్శించుకున్నారు. గతేడాది జనవరి మాసంలో 20లక్షల70వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా ఈ ఏడాది జనవరిలో 20లక్షల 97వేల మంది భక్తులు వెంకటేశుడిని సేవించుకున్నారు.
అయితే భక్తుల సంఖ్య స్వల్పంగా పెరిగినా హుండీ ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. 2016 నవంబర్ 8న పెద్దనోట్ల రద్దుతో ఆ ఏడు స్వామి హుండీ ఆదాయం బాగా తగ్గింది. తరువాత జనవరి నుంచే క్రమంలో ఆదాయం పెరిగింది. గతేడాది జనవరిలో స్వామివారి హుండీ ఆదాయం రూ.69 కోట్ల 95 లక్షలు కాగా… ఈఏడు జనవరిలో ఆదాయం రూ.83 కోట్ల 84 లక్షలు.
**అటు భక్తులకు కావల్సినన్ని లడ్డూకు అందచేస్తుండడంతో లడ్డూ విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. సర్వదర్శనం గుండా స్వామివారిని దర్శించుకునే ఒక్కో భక్తుడికి 5 లడ్డూలు, నడకదారిలో వచ్చే ఒక్కొక్కరికి నాలుగు లడ్డూలు అందజేస్తుండడంతో గతేడాదితో పోలిస్తే 2 లక్షల అదనపు లడ్డూల విక్రయాలు జరిగాయి. గతేడాది జనవరిలో 85 లక్షల 57 వేల లడ్డూల విక్రయాలు జరగ్గా ఈసారి 87 లక్షల 49 వేల లడ్డూల్ని టీటీడీ విక్రయించింది. స్వామి వారి అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య కూడా 5 లక్షల 89 వేలు పెరిగింది. గత ఏడాది జనవరిలో 43లక్షల 19వేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించగా ఈ ఏడాది 49లక్షల 8వేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గదుల కేటాయింపులు పెరిగాయి. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 4వేలు పెరిగింది. పోయిన ఒక్క నెలలోనే 7లక్షల96 వేల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
**జనవరి మాసంలో ఆంగ్లసంవత్సరాదితో పాటు రథసప్తమి పర్వదినాలు రాగా గత అనుభవాల దృష్ట్యా టీటీడీ ముందస్తు వ్యూహంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రద్దీ పెరిగినా ఎలాంటి ఇబ్బంది జరగకుండా లక్షలాది మంది భక్తులు సంతృప్తిగా స్వామి దర్శనం చేసుకున్నారు. దీంతో టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com