తిరువూరు మున్సిపాల్టీని దోచుకుతింటున్న అధికార పార్టీ నేతలు-TNI ప్రత్యేకం


తిరువూరు మున్సిపాల్టీలో దోపిడీ దొంగలు అడ్డగోలుగా నిధులన్నింటిని దోచుకు తింటున్నప్పటికి వీటిని అడ్డుకునే నాయకుడే కరువయ్యాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ది కోసం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఉంటే దిగువ స్థాయిలో ఉన్న ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ నిధులను, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన నిధులను 24గంటలూ అడ్డగోలుగా సిగ్గువిడిచి దోచుకుతినే పనిలోనే నిమగ్నమై ఉన్నారు. అవినీతిలో తిరువూరు నగర పంచాయతీ రాష్ట్రంలోనే రికార్డును సాధించింది.రూ. 20లక్షల ఫించన్ల సొమ్మును దిగ మింగిన ఆరోపణలపై ఇప్పటికే నలుగురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. అయినప్పటికీ నిధుల దుర్వినియోగం ఏ మాత్రం ఆగిపోలేదు. తమకు అనుకూలంగా లేని ముగ్గురు కమీషనర్లను అధికార పార్టీ నాయకులు గత నాలుగేళ్లలో బదిలీ చేయించారు. కొద్దిరోజుల క్రితమే నాలుగో కమీషనర్ ఈ మున్సిపాల్టీకి వచ్చారు. తిరువూరు మున్సిపాల్టీలో గత నాలుగేళ్లలో కోటి రూపాయలకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు ‘కాగ్’ దృవీకరించినప్పటికి ఇక్కడ అధికారులు, నాయకులు ఆ నివేదికను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఇంజనీరింగ్ ముఖ్య అధికారి ముడుపుల సొమ్ముతో విజయవాడలో కోటి రూపాయలు విలువైన భవనాన్ని నిర్మించుకున్నాడని ఆరోపణలు వెల్లివిరుస్తున్నాయి. నిధుల దుర్వినియోగంలో అధికార పార్టీ నేతలు ఇంజనీరింగ్ అధికారి భారీగా సహకరిస్తున్నట్లు కమీషన్ కింద ముడుపులు సేకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కొక్క పనికి ఒక్కొక్క కాంట్రాక్టర్ మాత్రమే టెండర్ వేసే విధంగా అధికార పార్టీ నాయకులు ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. కేవలం ఒక్క కాంట్రాక్టర్ కే యాభై లక్షలు విలువైన ఏడు పనులను అప్పగించారు. మరో కాంట్రాక్టర్ కు మరో రెండు పనులు అప్పగించారు. మొత్తం తొమ్మిది పనులకు అధికార పార్టీ నాయకులు ఇరువురు కాంట్రాక్టర్లు బీనామీలుగా ఏర్పాటు చేసుకుని పనులు చేయకుండానే బిల్లులు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దిగువ ఎజెండాను పరిశీలిస్తే అధికార పార్టీ నాయకుల అవినీతి బాగోతం సామన్య ప్రజలకు సైతం అర్ధమవుతుంది.

**అడ్డుకుంటున్న ప్రతిపక్షం
సోమవారం నాడు నిర్వహించిన తిరువూరు మునిసిపాలిటీ సమావేశంలో 21పనులను ఆమోదించడానికి అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రయత్నించగా ప్రతిపక్ష కౌన్సిలర్లు అడ్డుకున్నారు. అయినప్పటికీ మేయర్ హడావుడిగా ఈ పనులన్నీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సమావేశాన్ని ముగించి వెళ్ళిపోయారు. దీనితో వైకాపా కౌన్సిలర్ల తిరువూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరవధిక ఆందోళన చేపట్టారు.

**ఛీఛీ..వైకాపా విమర్శలకు సమాధానం చెప్పలేకపోతున్న తెదేపా.
తిరువూరు మున్సిపాల్టీలో అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా చేస్తున్న దోపిడీని ప్రతిపక్షం వైకాపా ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ అల్లరి చేస్తూనే ఉంది. ఈ విషయం దినపత్రికల్లో ప్రముఖంగా వస్తున్నప్పటికీ ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా వైకాపా విమర్శలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. స్వామిదాసు ఇంట్లో ఇరువురు మున్సిపల్ సిబ్బంది అనధికారికంగా వెట్టి చాకిరి చేస్తున్నారని వైకాపా కౌన్సిలర్లు ఆరోపణలు చేసినప్పటికీ వాటికి సమాధానం చెప్పే తెదేపా నేతలే కరువయ్యారు. తెదేపా నేతలు మున్సిపాల్టీని అడ్డంగా దోచుకుతింటున్నారని ఆ పార్టీ దిగువ స్థాయి నాయకులూ, కార్యకర్తలు సైతం బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు వరసగా పరాజయం పాలైన తెదేపా వచ్చే ఎన్నికల్లో సైతం నేతల అవినీతి మూలంగా మళ్ళి పరాజయం పాలుకావడం తప్పదేమోనని తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. – కిలారు ముద్దుకృష్ణ








More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com