తులసీదే ప్రథమ స్థానం

తులసి ఆకుల గొప్పతనాన్ని ఇంట్లో బామ్మలు చెప్తూనే ఉంటారు. కాస్తంత దగ్గు అనిపిస్తే నాలుగు తులసి ఆకులు తెంపి నోట్లో వేయడమూ సర్వ సాధారణమే. ఇది సాధారణ ఆకు కాదు. మూలికల్లోనే మహారాణి. దేహంలో మలినాలను తొలిగించేందుకు దోహదం చేసే యాంటీఆక్సిడెంట్స్ తులసి ఆకుల్లో పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు.. విటమిన్ ఏ, బీటా కెరోటిన్, పొటాషియం, ఐరన్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ధాతువులు మెండుగా ఉంటాయి. యూజినోల్, సిట్రనెల్లాల్, లైమనెన్ వంటి ఔషధాలు కూడా ఉంటాయి. ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి కాబట్టే ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో తులసి ఆకు విశిష్టస్థానాన్ని ఆక్రమించింది. తులసి ఆకుల గొప్పతనాన్ని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు ధ్రువీకరిస్తున్నారు. భారీకాయులకు ఇది వరపదాయిని అని చెప్తున్నారు. దీనిలో ఉన్న ధాతువులు, ఔషధ గుణాల కారణంగా ఇది కొవ్వును కరిగించేందుకు గొప్పగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. అధిక బరువుతో బాధపడుతున్నవారు దీనిని ఉపయోగిస్తే కొవ్వు కరిగి, బరువు తగ్గి సన్నగా తయారవుతారని స్పష్టంచేస్తున్నారు. ఇందుకోసం తులసి ఆకులను మజ్జిగతో కలిపి ఉదయం పూట తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందని పేర్కొంటున్నారు. నిద్రలేమితో బాధ పడేవారికి కూడా తులసి ఆకులు గొప్ప ఔషధంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. తులసిలో ప్రత్యేక రకమైన అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతీరోజు రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తీసుకుంటే చక్కగా నిద్రపడుతుందని చెప్తున్నారు. తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం పళ్లు తోముకుంటే నోటి దుర్వాసన పోతుందని, నోటిలో పొక్కులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి తాగినా, లేదా ఆ రసంలో ఒక చెంచా తేనె చేర్చి తాగినా కఫం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తులసి ఆకుల రసంలో తేనెను కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి. అంతేగాకుండా జలుబు, దగ్గుతో బాధపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, ఐదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని తాగితే మంచి ఫలితముంటుంది. తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం కూడా ఉంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే జ్వరం తగ్గుతుంది. తులసి ఆకుల్ని నీటిలో వేసి మరిగించి, ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయని చెప్పారు. తేనెతో కలిపి ప్రతీరోజు తాగితే నోటిపూత, గొంతునొప్పి తగ్గి, బొంగురుపోయిన గొంతు సాఫీగా మారుతుంది. తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి తాగితే విరేచనాలు తగ్గుతాయని తెలిపారు. గుండె నొప్పులు నివారించేందుకు, మూత్రపిండాల్లో రాళ్లు తగ్గించేందుకు కూడా తులసి రసం పనికివస్తుందని పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com