తెదేపా అవినీతి మొత్తం బయటకి లాగండి-అమిత్ షా సూచన

ఏపీ ప్రజల ముందు భాజపాను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశంపై దండయాత్ర మొదలుపెట్టాలని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌ భాజపా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇకపై రాష్ట్రంలో భాజపా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతి, వైఫల్యాలను ప్రజల ముందుంచాలని చెప్పారు. త్వరలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసుకొని ఏపీకి కేంద్రం చేసిన సాయం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆంధ్రప్రదేశ్‌పై భాజపాకున్న శ్రద్ధపై తీర్మానించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు. రాజకీయ పొత్తుల గురించి ఎన్నికలప్పుడు మాట్లాడుకుందాం.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలను బలంగా ఢీకొనాలన్నారు. తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో పార్టీకి దిశానిర్దేశం చేయడానికి అమిత్‌షా రాష్ట్ర పార్టీ కోర్‌కమిటీని శనివారం దిల్లీకి పిలిపించి మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌, ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, రాష్ట్ర మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌, కంతేటి సత్యనారాయణరాజు, పార్టీ నేతలు సురేష్‌రెడ్డి, రవీంద్రరాజు, రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు సతీష్‌జీ పాల్గొన్నారు. ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ బలంగా పోయిందని, దాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల్లో భాజపాను విలన్‌గా చూపడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వారు అమిత్‌షాకు చెప్పారు. అమిత్‌షా బదులిస్తూ ‘ప్రత్యేకహోదా సెంటిమెంట్‌ ఉన్నమాట నిజమే. హోదా పేరు ప్రకటించడం రాజ్యాంగపరంగా సాధ్యం కాదని బదులుగా ఎంత డబ్బుంటే అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలకు వివరించాలి. ఎన్డీయే నుంచి వైదొలుగుతూ చంద్రబాబు రాసిన లేఖకు ప్రత్యుత్తరం రాస్తా. అందులోని అంశాలనూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తెలుగుదేశం ఎన్డీయే, కేంద్ర ప్రభుత్వాల నుంచి వైదొలగడానికి కారణాలేమిటో కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలి. కేంద్ర సాయం, రాష్ట్ర వైఫల్యాలతో నివేదిక తయారుచేసి ప్రచార ప్రణాళిక ఖరారు చేయాలి. ప్రత్యేక హోదాపై వాళ్లు ఎలా భావోద్వేగాలు రెచ్చగెడుతున్నారో అలాగే మనం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించాలి. విభజన చట్టంలో చెప్పినవన్నీ ఒకేసారి ఇస్తే తెదేపా ఒత్తిడితో ఇచ్చినట్లవుతుంది. నెలా రెండునెలల తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కరిద్దాం. రాష్ట్రంలో భాజపా రాజకీయ మనుగడకు అధికార పార్టీతో యుద్ధం చేయాలి. తెదేపాపై విమర్శల దాడి పెంచాలి. భాజపాపై ప్రజలను ఉసిగొల్పడంతో చంద్రబాబు విజయవంతమైనట్లు మీరు చెబుతున్నందున కౌంటర్‌ చేయడం ప్రధానం’ అని స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్‌.. చంద్రబాబు, లోకేష్‌ అవినీతి గురించి బహిరంగంగా విమర్శించారని కొందరు ప్రస్తావించినప్పుడు సరైన సాక్ష్యాలుంటే మనం కూడా వెంటపడాలన్నారు. స్పెషల్‌పర్పస్‌ వెహికిల్‌ ఏర్పాటు చేసుకుంటే ప్రత్యేక హోదాకు సమానమైన మొత్తాన్ని ఇస్తామన్నా చంద్రబాబు ఎందుకు స్పందించలేదో ప్రశ్నించాలన్నారు. రాష్ట్రానికి భాజపా చేకూర్చిన లబ్ధిపై ప్రచారానికి బస్సుయాత్ర చేపట్టాలన్నారు. డబ్బులిచ్చినా రాజధానిలో అభివృద్ధి మొదలు కాలేదని, కేంద్ర నిధుల వినియోగ ధ్రువపత్రాలు రాలేదని ప్రజలకు తెలియపరచాలన్నారు. హోదాకు సమానమైన మొత్తాన్ని ఈఏపీలు, నాబార్డు, స్పెషల్‌పర్పస్‌ వెహికల్‌ ద్వారా ఇవ్వాలని చంద్రబాబు అడిగిన లేఖలన్నీ మన దగ్గరున్నాయని, వాటన్నింటికీ అంగీకరించినా ఎందుకు తీసుకోవడం లేదో నిలదీయాలన్నారు. పారిశ్రామిక రాయితీల కింద పెట్టిన రూ.100 కోట్లు ఎందుకు ఖర్చు చేయలేదో ప్రశ్నించాలన్నారు. రూ.80 వేల కోట్ల రైతు రుణమాఫీకి రూ.11 వేలు కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం, నిరుద్యోగభృతి ఇవ్వకపోవడం, ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించకపోవడాన్ని ఎండగట్టాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం పార్టీపరంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే తానూ వస్తానని అమిత్‌షా చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చర్చించలేదని, విమర్శలపైనే చర్చ జరిగినట్లు ఒక నాయకుడు చెప్పారు. హోదాకు సమానమైన మొత్తమివ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉండడం, విభజన చట్టంలోని సంస్థలన్నీ మూడున్నరేళ్లలో ఏర్పాటు చేయడం, పోలవరానికి సహకారంపై ప్రజలకు తెలియజెబుతామని హరిబాబు చెప్పారు. ఏపీ అభివృద్ధికి భాజపా నాలుగేళ్లుగా ఎంతో సహకరించిందని రామ్‌మాధవ్‌ అన్నారు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ప్రశ్నలు వేశారు… భవిష్యత్తులో మేం వేసే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. ఏపీ భాజపా నాయకులతో అమిత్‌షా తన ఇంట్లో సమావేశమైనప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ అక్కడికి వచ్చారన్న అంశం కలకలం రేపింది. 2014 ఎన్నికల సమయంలో భాజపా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్‌ కిశోర్‌ ప్రస్తుతం వైకాపా రాజకీయ వ్యూహ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన అమిత్‌షా ఇంట్లోకి వెళ్లినట్లు బయట ఉన్న ఓ విలేకరి అనడంతో కలకలం ప్రారంభమైంది. అమిత్‌షా ఇంటి ప్రాంగణంలో వేచి ఉన్న భాజపా నాయకులను దాని గురించి అడిగినప్పుడు అవును వచ్చారు.. ఆయన ఏపీ నాయకుల సమావేశంలో కాకుండా వేరే గదిలో కూర్చున్నట్లు పేర్కొన్నారు. ప్రశాంత్‌కిషోర్‌ అమిత్‌షా ఇంట్లోకి వెళ్లినట్లు విన్పించడంతో ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. వాటిని ప్రశాంత్‌కిషోర్‌ కార్యాలయం ఖండించింది. ఆయన శనివారం అసలు దిల్లీలోనే లేరని ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. అమిత్‌షాతో సమావేశం అనంతరం ఏపీ భాజపా నేతలంతా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చంద్రబాబు చేసిన తప్పులను వెతకాలని రామ్‌మాధవ్‌ రాష్ట్ర నాయకులకు సూచించినట్లు తెలిసింది. దిల్లీ నుంచి కూడా తగిన ఆధారాలు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసినట్లు సమాచారం. ఒక్కో అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి సీఎం చేసిన విమర్శలన్నింటికీ దీటుగా సమాధానం చెప్పాలని నిర్దేశించినట్లు సమాచారం. అమిత్‌షా నిర్వహించిన సమావేశానికి ముందు ఏపీ భాజపా అధ్యక్షుడిని ప్రకటిస్తారనే చర్చ జరిగింది. సమావేశంలో దీని ప్రస్తావన రాలేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com