తెదేపా చేసిన దగాకు నిరసనగా కన్నబాబు నిష్క్రమణ

ఎలమంచిలి మాజీ శాసనసభ్యుడు ఉప్పలపాటి రమణమూర్తిరాజు (కన్నబాబు) తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మే 5న వైకాపాలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో చేరతానని స్పష్టం చేశారు. 2004, 2009 ఎన్నికల్లో ఎలమంచిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో తెదేపా అభ్యర్థిత్వాన్ని ఆశించారు. భాజపాతో ఒప్పందం కారణంగా విశాఖలోని ఉత్తర నియోజకవర్గాన్ని తెదేపా ఆ పార్టీకి వదలాల్సి వచ్చింది. దీంతో అనూహ్యంగా పంచకర్ల రమేష్‌బాబును ఎలమంచిలి నుంచి తెదేపా రంగంలోకి దింపింది. ఈ పరిణామాలతో నిరాశ పడ్డ కన్నబాబుకు శాసనమండలి అవకాశం ఇస్తామని అప్పట్లో తెదేపా నాయకులు బుజ్జగించారు. కొన్ని సమీకరణాల నేపథ్యంలో మండలిలో పోటీకి పప్పల చలపతిరావుకు అవకాశం దక్కింది. దీంతో కన్నబాబు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అధిష్ఠానం ఆదేశాలతో మంత్రి అయ్యన్నపాత్రుడు రంగంలోకి దిగి కన్నబాబు నామినేషన్‌ వెనక్కి తీసుకునేలా ఒప్పించారు. అనంతర క్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్‌ను కలిసినా స్పష్టత లేకపోవడంతో తెదేపాను వీడాలని నిర్ణయించుకున్నట్టు కన్నబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఆదేశాల మేరకు శనివారం కన్నబాబును రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఇంటికి ఆహ్వానించి మంతనాలు జరిపారు. సుదీర్ఘంగా మాట్లాడినా చర్చలు ఫలించలేదు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కన్నబాబు తేల్చి చెప్పినట్లు సమాచారం. మంత్రి గంటాతో తనకు మంచి స్నేహం ఉందని.. ఈ నేపథ్యంలో ఆయన ఆహ్వానం మేరకు వెళ్లి కలిశానని వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com