తెలంగాణాలో కొత్త మునిసిపాలిటీలు ఇవే

రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. 28 కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను ఏర్పాటు చేయడానికి జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. 199 శివారు పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయనున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉండటంతో కొత్త పురపాలక సంఘాలు, విలీన పంచాయతీల సంఖ్య పెరగనుంది. సమీపంలోని రెండు, మూడు పంచాయతీలను విలీనం చేసి కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. మొత్తం 52 పంచాయతీల విలీనం ద్వారా 28 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని 15 జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా ఐదు మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి.
**జనాభా 15 వేలు మించితే మున్సిపాలిటే…
15 వేలకు మించి జనాభా ఉన్న మేజర్‌ పనచాయతీలతో పాటు ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీలకు చుట్టూ ఒకటి నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పంచాయతీలను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లేనిపక్షంలో ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విలీనం చేసేందుకు అవసరమైన ప్రతిపాదనల కోసం ప్రభుత్వం తొమ్మిది మంది ప్రత్యేకాధికారులను నియమించింది. జిల్లా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించారు. ప్రత్యేకాధికారులు 28 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న 73 మున్సిపాలిటీల్లో 199 శివారు పంచాయతీలను విలీనం చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు.
**ఆగస్టులో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు
పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం వచ్చే జూలైతో ముగియనుంది. ఆ వెంటనే కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆ లోపే పూర్తి చేయనుంది. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు లేదా మున్సిపాలిటీల్లో విలీనంపై సంబంధిత పంచాయతీల్లో ప్రజాభిప్రాయ సేకరణ కోసం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బహిరంగ ప్రకటన జారీ చేయనుంది. అభిప్రాయాలు తెలపడానికి స్థానిక ప్రజలకు 10 రోజుల గడువు ఇస్తారు.
**కొత్త మన్సిపాలిటీలు ఇవే…
28 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. జనగామ జిల్లా నుంచి ఘనపూర్, జగిత్యాల జిల్లా నుంచి ధర్మపురి, రాయికల్, పెద్దపల్లి జిల్లా నుంచి మంథని, సుల్తానాబాద్, ఖమ్మం జిల్లాలో వైరా, ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు, నిర్మల్ జిల్లా నుంచి తిమ్మాపూర్, కుమురం భీం ఆసిఫాబాద్ నుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో చెన్నూరు, నిజామాబాద్ జిల్లాలో భీంగల్, డిచ్ పల్లి ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో చేర్యాల, మెదక్ జిల్లా నుంచి రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ కొత్తగా మున్సిపాలిటీలు కానున్నాయి. యాదాద్రి జిల్లా నుంచి పోచంపల్లి, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌటుప్పల్, ఆలేరు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో భూత్పూరు, మక్తల్ ఉన్నాయి. గద్వాల జిల్లా నుంచి అలంపూర్, వడ్డేపల్లి, వనపర్తి జిల్లా నుంచి పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు కొత్త మున్సిపాలిటీలు కానున్నాయి.
**సెంచరీ దాటనున్న మున్సిపాలిటీలు
రాష్ట్రంలో GHMCతోపాటు 73 మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 28 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాగా, తుది ప్రతిపాదనలు సిద్ధమయ్యే సరికి ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఈ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కొత్త పురపాలికలను ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 100కి చేరనుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com