తెలంగాణా ఇచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీనే కదా?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కుసంస్కారంతో వ్యవహరిస్తోందనీ, ప్రాజెక్టులపై పిచ్చి వ్యతిరేకతను కనబరుస్తోందని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. మంత్రిమండలి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ పదేళ్లపాటు కేంద్రంలో, రాష్ట్రంలో, మహారాష్ట్రలోనూ అధికారంలో ఉంది. అప్పట్లో ఎందుకు ఒప్పందం చేసుకోలేదు? ఒప్పందం లేకుండానే పిచ్చిపిచ్చి పనులుచేశారు. కానీ మేం ఇప్పుడు చేస్తున్న పద్ధతి శాశ్వతం! కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి సాక్షిగా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటున్నాం. మంచి చెడులు ప్రజలు నిర్ణయిస్తారు. మీకు ఒప్పందం చేసుకునే తెలివిలేదు. నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో అసలేమీలేదు. మన రాష్ట్రానికి ప్రధాని వస్తుంటే ఆయనను రావొద్దని ఉత్తరం రాశారు. అదేం సంస్కారమో వారే చెప్పాలి! మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందం చేసుకుంటుంటే నిరసన ఎందుకు? కారణమేమైనా ఉందా? ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ చెప్పాలి. వాళ్లది పిచ్చి వ్యతిరేకత అంతే! ఈనెల 23న మహారాష్ట్రతో నీటి ఒప్పందానికి వెళుతున్నా. ఇది చరిత్రాత్మక ఒప్పందం కానుంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరించిన వైఖరి వల్ల పొరుగు రాష్ట్రాలతో పంచాయతీ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు కోరుకుంటోంది. అందుకే మహారాష్ట్రకు తొలి పర్యాయం వెళ్లినప్పుడు సృహృద్భావ వాతావరణం కల్పించి వచ్చాం. మనకు ఏమేం కావాలో చెప్పొచ్చాం. వివరాలిస్తే చూద్దామన్నారు. ఇచ్చాం. రెండోసారి వెళ్లినప్పుడు అంతర్రాష్ట్ర బోర్డును ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు తుది ఒప్పందంపై సంతకానికి వెళ్తున్నాను. తెలంగాణకు ఇది మంచి విజయం. కేంద్రం జోక్యం లేకుండా రాష్ట్రాలే ఒప్పందాలు చేసుకోవటం, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవటం శుభపరిణామం. మేం బతుకుతాం… మీరూ బతకండనేది మంచి పద్ధతి. అదే మన విధానం. ఛత్తీస్‌గఢ్‌తో కూడా వెయ్యి మెగావాట్లకు విద్యుత్‌ ఒప్పందం చేసుకున్నాం. కర్ణాటక చరిత్రలో ఎన్నడూ మనకు నీరివ్వలేదు. కానీ, నేను బృందాన్ని పంపించి అడిగితే… ఒక టీఎంసీ నీరిచ్చారు. ఇరుగుపొరుగులతో ఇదే సంబంధాలు కొనసాగిస్తాం.’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘ప్రధాని వచ్చి ఏ హామీ ఇవ్వలేదనడం సరికాదు. హైదరాబాద్‌పై మీకెంత హక్కుందో దిల్లీపైనా అంతే హక్కుంది అని అన్నారాయన! దిల్లీ మీకు చాలా దగ్గర అని చెప్పారు. ఆ మాటల్ని అర్థం చేసుకున్నవాళ్లకు అర్థమవుతుంది. లేనివాళ్లకు లేదు.’’ అని కేసీఆర్‌ అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com