“తెలుగు పద్యం-సంగీత స్వరకల్పన”పై టాంటెక్స్ సదస్సు


ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్ ) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 130వ నెలనెలా తెలుగు వెన్నల కార్యక్రమం ఆదివారం నాడు ఇర్వింగ్‌లో వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారుల ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. డా.యు.నరసింహారెడ్డి “తెలుగు సిరి సంపదలు” అనే అంశంలో సామెతలపై ప్రసంగించారు. డా.పుదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యద నుండి “నట త్పయోబ్ది వీక్ష్య..” సీస పద్యంలో శ్రీ కృష్ణదేవరాయల గంభీర వర్ణన చక్కగా వివరించారు. మాసానికో మహనీయడు అంశంలో జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం చలం తదితరులను ప్రస్తావించారు. వేముల లెనిల్ బాబు తెలుగు వ్యుత్పత్తిపై కంజరతో పాటల రూపంలో వివరించారు. ముఖ్యఅతిథిగా హాజరయిన ఎర్రాప్రగడ రామకృష్ణ “తెలుగు పద్యం-సంగీత స్వరకల్పన” అనే అంశంపై అమితాసక్తి కలిగించే ప్రసంగం చేశారు. తెలుగు పద్యం అర్ధం చేసుకోవడానికి అత్యున్నత మానసిక స్థితి అవసరం అని ప్రతి పద్యాన్ని భావుకతతో చదివినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది అని చెప్పారు. వెయ్యి సంవత్సరాలకు పైగా తెలుగు పద్యం నిలబడింది కేవలం దాని నిర్మాణాత్మక విలువలపైనేనని పేర్కొన్నారు. పద్యాన్ని రాగయుక్తంగా చదవడం ఎంతో అవసరం అని రాగం మారినప్పుడు పద్యంలో సాంద్రత, ఆర్ద్రత మారతాయని వెల్లడించారు. అనంతరం ఎర్రాప్రగడను టాంటెక్స్ సాహితీ కమిటీ సభ్యులు, టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం, ఉత్తరాధ్యక్షులు చినసత్యం వీర్నపు, పాలకమండలి సభ్యులు, శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.








More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com