తెలుగు భాష కోసం కృషి చేసింది ముగ్గురే ముఖ్యమంత్రులు-యార్లగడ్డ-TNI ప్రత్యేకం


తెలుగు రాష్ట్రాన్ని చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారని, వారిలో తెలుగు భాష కోసం కృషి చేసింది ముగ్గురు ముఖ్యమంత్రులేనని వారికి తెలుగుజాతి ఎప్పటికీ రుణపడి ఉంటుందని మాజీ రాజ్యసభ సభ్యుడు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. చెన్నైలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య రజతోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన “తెలుగుభాష-సాంస్కృతిక వికాసం” అనే చర్చాగోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1975వ సంవత్సరంలో తొలి తెలుగు మహాసభలు నిర్వహించి జలగం వెంగళరావు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని, ఎన్.టీ.రామారావు ముఖ్యమంత్రి అయిన అనంతరం తెలుగు భాషకు వన్నె తేవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఎన్‌టీఆర్ ఏర్పాటు చేసిన తెలుగు ప్రముఖుల విగ్రహాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని యార్లగడ్డ పేర్కొన్నారు. అనంతరం తెలుగు భాష కోసం కృషి చేసిన ఘనత డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డికి దక్కుతుందని, తెలుగు భాషకు ప్రాచీన హోదా కేంద్రంతో పోరాడి సాధించిన ఘనత వై.ఎస్.ఆర్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. విశాఖ కైలాసగిరి కొండపై తెలుగు భాషా వికాసం కోసం మ్యూజియం ఏర్పాటుకు 5ఎకరాల స్థలం కేటాయించిన ఘనత కూడా వై.ఎస్.ఆర్‌దేనని లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఇటీవలే వచ్చిన ముఖ్యమంత్రులకు తెలుగు భాషపై అవగాహన లేదని, వారికి ఎంతసేపూ కొడుకూ-మనవడు-మునిమనవళ్లను ముఖ్యమంత్రులుగా చేయాలనే దూర దురాలోచన తప్ప తెలుగు భాషాభివృద్ధికి ఏ విధమైన ప్రయత్నం చేయట్లేదని యార్లగడ్డ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు గొల్లపూడి మారుతీరావు, హాస్యావధాని శంకరనారాయణ, తెలుగు విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ పీ.గౌరీశంకర్, ప్రముఖ సంగీతావధాని మీగడ రామలింగస్వామి తదితరులు ప్రసంగించారు. వీరందరినీ సమాఖ్య అధ్యక్షురాలు వీ.ఎల్.ఇందిరాదత్ ఘనంగా సన్మానించారు. —చెన్నై నుండి TNI ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ.

























More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com