త్వరగా మేలుకుంటే ఆరోగ్యం మీదే

ఉదయాన్నే మేలుకో.. విజయాన్నే ఏలుకో!
**నరేంద్ర మోదీ, ప్రధాని
చాయ్‌వాలా నుంచి ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ.. 120 కోట్ల పైచిలుకు భారతీయుల ప్రతినిధి. ఎక్కడున్నా అయిదు గంటలకే నిద్ర లేస్తారు. ప్రాణాయామం, సూర్య నమస్కారాలు యోగా చేశాక దినచర్యను ప్రారంభిస్తారు.
**ముఖేష్‌ అంబానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
ఇటీవలి కాలంలో అందరి నోళ్లలో నానుతున్న పేరు జియో… ముఖేష్‌ అంబానీ. రోజూ పొద్దునే 5-5.30 గంటల మధ్యలో నిద్ర లేస్తారు ముఖేశ్‌. తన ఇంటి రెండో అంతస్తులో ఉన్న జిమ్‌లో కసరత్తు చేస్తారు. కాసేపు ఈతకొట్టాక.. పత్రికలను తిరగేస్తారు.
**రతన్‌ టాటా, టాటా గ్రూప్‌
రతన్‌ టాటా పేరు తెలియని వారుండరు. రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా సరే.. సూర్యోదయానికి ముందే లేస్తారు. ఆరు గంటల వరకు కార్యకలాపాల్లో మునిగిపోతారు. సెలవు రోజులైన శని, ఆదివారాల్లో ఉదయం కారు నడుపుతారు. లేదంటే సొంత జెట్‌ విమానంలో చక్కర్లు కొడతారు.
**ఒబామా.. అమెరికా అధ్యక్షుడు
ప్రపంచానికి పెద్దన్న అమెరికా.. ఆ దేశాధ్యక్షుడిగా పని చేయడమంటే ఆషామాషీ వ్యవహారమేం కాదు. క్షణం తీరిక లేని షెడ్యూలులోనూ ఒబామా ఆరున్నర కల్లా మేలుకోవాల్సిందే. వ్యాయామశాలకు వెళ్లి కసరత్తులు చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఉదయాహారం తీసుకుంటారు.
**టిమ్‌ కుక్‌- యాపిల్‌ సీఈవో
యాపిల్‌ ఫోన్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇదొక్కటి చాలు.. ఆ బ్రాండ్‌ ఘనతను చెప్పేందుకు. అలాంటి సంస్థను ముందుకు నడిపించే నాయకుడు టిమ్‌ కుక్‌. ఈయన అందరి కంటే ముందే కార్యాలయానికి వెళ్తారు. అందరూ వెళ్లిపోయాక ఇంటికి బయలుదేరుతారు. అయినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 4.30 గంటలకే నిద్ర లేస్తారు. లేచిన వెంటనే మెయిల్స్‌ చూసుకుంటారు. 5 గంటలకు జిమ్‌లో వ్యాయామం చేస్తారు. ఆ తర్వాత ఉదయాహారం తీసుకుంటారు.
**జెఫ్‌ బెజోస్‌, అమెజాన్‌ ఛైర్మన్‌, సీఈవో
ఈ కామర్స్‌ వ్యాపారంలో ప్రముఖ కంపెనీల్లో ఒకటి అమెజాన్‌. దీ సీఈవో జెఫ్‌ బెజోస్‌కు వినియోగదారుల సేవ తప్ప మరో వ్యాపకం ఉండదు. అలాగని 24 గంటల పాటు పని చేస్తూనే ఉంటారనుకుంటే పొరపాటే. రాత్రి 10 గంటలు అయ్యిందంటే చాలు. ఎంత కీలకమైన సమావేశంలో ఉన్నా సరే గుడ్‌ నైట్‌ చెప్పేందుకు వెనుకడుగు వేయరు. ఎందుకని అడిగితే.. పొద్దున్నే నిద్ర లేవాలి కదా అంటూ సమాధానమిస్తారు.
**జాక్‌మా, అలీబాబా గ్రూప్‌
వ్యాపార ప్రపంచంలో చైనా అలీబాబా గ్రూప్‌ గురించి తెలియని వారుండరంటే అతియోశక్తి కాదేమో. ఈకామర్స్‌, ఆన్‌లైన్‌ వేలం, ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌, మొబైల్స్‌ కామర్స్‌ తదితర వ్యాపారాల నిర్వహించే ఈ సంస్థలో దాదాపు 47 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ బాస్‌.. జాక్‌ మా. ఈయనకు క్షణం తీరిక ఉండదు. రాత్రి ఎప్పుడు నిద్రపోతారో తెలియదు. ఉదయం 6 గంటలకు లోపే నిద్ర లేస్తారు. విశ్రాంతి అవసరం లేదా అని అడిగితే.. జీవితమంటేనే ఆస్వాదించడం.. ఉదయం ప్రకృతిని ఆస్వాదించడంలో ఉన్నంత సంతోషం ఎందులోనూ లేదంటారు.
**బిల్‌ గేట్స్‌, మైక్రోసాఫ్ట్‌
మైక్రోసాఫ్ట్‌… బిల్‌ గేట్స్‌… ఈ పేర్లు తెలియని వారు అరుదు. సూరీడితో పోటీ పడి ఠంఛనుగా పొద్దునే నిద్ర లేస్తారు బిల్‌. ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్‌ చేయనిదే మనసుకు ఏదీ పట్టదంటారీయన. సంగీతం వినడం, ఫోన్లు మాట్లాడటం… చేయగలిగే పనులన్నీ ట్రెడ్‌మిల్‌పైనే చేస్తారు.
**మార్క్‌ జుకర్‌బర్గ్‌, ఫేస్‌బుక్‌ సీఈవో
సామాజిక మాధ్యమాల్లో ఫేస్‌బుక్‌ ఓ సంచలనం. ఓ వూపు వూపేసింది… ఇంకా వూపుతోంది. అలాంటి సంస్థను ముందుకు నడిపే నాయకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ సూరీడు రాక ముందే నిద్ర లేస్తారు. రాత్రి ఎంత ఆలస్యమైనా సరే వేకువనే లేవాల్సిందే. వీలైనంత తొందరగా కార్యాలయానికి వెళ్లిపోతారు.
**వారెన్‌ బఫెట్‌, బెర్క్‌షైర్‌ హాత్‌వే ఛైర్మన్‌, సీఈవో
ఈ ఏడాది ఫోర్బ్స్‌ ప్రకటించిన జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 400 మంది ధనవంతుల్లో మూడో స్థానం వారెన్‌ బఫెట్‌ది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన ఉదయం 6.45 గంటలు అయిందంటే చాలు.. పడక దిగేస్తారు. కనీసం ఆరు దిన పత్రికలను తిరగేస్తారు. తీరిక ఉన్న రోజుల్లో 80 శాతం సమయాన్ని పుస్తకాలు చదివేందుకే కేటాయిస్తారు.
**క్రికెట్‌ ప్రపంచంలో ఓ సంచలనం విరాట్‌ కోహ్లీ..
యువతకు ఐకాన్‌. పరుగుల రారాజు.. ఆరింటికే నిద్ర లేస్తాడు. జిమ్‌లో రకరకాల వ్యాయామాలు చేస్తాడు. ముఖ్యంగా కండలు పెరిగేందుకు ఎక్కువగా బరువులు ఎత్తుతాడు.
**మరెందుకాలస్యం
ఓ వ్యక్తి విజయానికి నిరంతరం కష్టపడటం ఒకెత్తయితే.. పొద్దునే నిద్ర లేవడం మరోఎత్తు. ఆరోగ్యం, వృత్తిపరమైన అంశాల్లో వేకువనే నిద్రలేచే దాన్ని బట్టి విజయాలు ఆధారపడి ఉంటాయి. ఇందుకు నిదర్శనం ఎంతో మంది ప్రముఖుల జీవితాలు. ఎంత పొద్దున లేస్తే అన్ని గంటలు మన కోసం ఎదురు చూస్తాయన్న మాట. ఉదయిస్తున్న భానుడు.. పక్షుల కిలకిలలు.. అందమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చు. పొద్దునే లేవాలంటే రాత్రి తొందరగా నిద్రపోవాలి కదా మాకంత సమయం లేదంటారా.. మనసుంటే మార్గముంటుంది. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే రాత్రి 10 గంటలకే పడక మీదకు చేరుకోవచ్చు. మరెందుకు ఆలస్యం.. ముందుకు కదలండి.. ఉదయిస్తున్న సూరీడుకు శుభోదయం చెప్పేయండి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com