దశ తిరిగింది

మెహరీన్‌ దండయాత్ర కొనసాగుతోంది. ఈమధ్య కాలంలోనే ‘మహానుభావుడు’తో మొదలుపెట్టి ‘రాజా ది గ్రేట్‌’, ‘కేరాఫ్‌ సూర్య’ చిత్రాలతో వరుసగా తెలుగు తెరపై సందడి చేసింది. త్వరలోనే ‘జవాన్‌’తోనూ మురిపించబోతోంది. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా బి.వి.ఎస్‌.రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మెహరీన్‌ ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ…‘‘నటులు అప్పుడప్పుడు వాళ్లలోని కొత్త కోణాన్నీ ఆవిష్కరించాలి. ‘జవాన్‌’తో నేనదే చేశా. ఇదివరకు నేను చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా ఇందులో కనిపిస్తా. నా పాత్ర పేరు భార్గవి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న ఓ నవతరం అమ్మాయి. వృత్తిపరంగా ఓ చిత్రకారిణి. జీవితంలో తనకేం కావాలో, తను ఏం చేయాలో బాగా తెలిసిన అమ్మాయి. ఇదివరకు చేసిన పాత్రలేవీ ఇవ్వని ఓ కొత్త అనుభవాన్ని భార్గవి ఇచ్చింది. తెరపై నన్ను నేను చూసుకొని ‘ఇక్కడ నిజంగా నేనేనా?’ అని ఆశ్చర్యపోయా. నా కాస్ట్యూమ్స్‌ చాలా ఫ్యాషన్‌తో ఉంటాయి’’.

* ‘‘ఆచితూచి కథల్ని ఎంచుకోవడం నాకు అలవాటు. అయితే తొలిసారి అసలు కథే వినకుండా ఒప్పుకొన్న సినిమా ఇది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ విడుదలైన తర్వాత రెండో రోజే ఈ సినిమాకి సంతకం చేశా. దర్శకుడు బి.వి.ఎస్‌.రవిపై నాకున్న నమ్మకం అది. ఆయన తొలి సినిమాతోనే పరాజయాన్ని చవిచూశారు, ఆ సినిమాకి సంతకం చేయడం సరైనదేనా? అన్నవాళ్లూ ఉన్నారు. కానీ ఆయన ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డారు. ఆ విషయం నాకు తెలుసు. కచ్చితంగా ‘జవాన్‌’ ఓ మంచి సినిమా అవుతుంది’’.
* ‘‘పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపించా. నిజ జీవితంలోనూ నేను ఇంచుమించుగా అలానే ఉంటా. కానీ నన్ను నాకే కొత్తగా పరిచయం చేసినట్టుగా అనిపించింది ఈ సినిమాలోని పాత్ర. చాలా గ్లామరస్‌గా కనిపిస్తా. ఆ తరహాలో నన్ను నేను ఎప్పుడూ చూసుకొన్నది లేదు. అందుకే తెరపై సినిమాని చూసుకొన్నాక నాకే కొత్తగా అనిపించింది. ప్రేక్షకులూ అదే అనుభూతికి గురవుతారు. గ్లామర్‌ కోణంలోనే కాదు… డ్యాన్స్‌ పరంగానూ ఈ సినిమాతో చాలా పరిణతి సాధించా. ఇంతకుముందు డ్యాన్స్‌ చేసే అవసరం పెద్దగా రాలేదు. కానీ ఈ సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి డ్యాన్స్‌కి ప్రాధాన్యమున్న పలు పాటల్లో ఆడిపాడాల్సి వచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నా. సాయిధరమ్‌ తేజ్‌ ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తుంటారు. అంతా కలిసి స్నేహితుల్లాగా ఈ సినిమా చేశాం’’.
* ‘‘వరుసగా నా సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తుండడం మంచి కిక్‌నిస్తోంది. నా టైమ్‌ మొదలైందనే భావన కలుగుతోంది. దాంతోపాటు చేసిన ప్రతి పాత్రా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే ఎంతో ప్రేమించి చేశాను కాబట్టి! ఇక్కడ సినిమాలు చేస్తున్నప్పుడు నా హిందీ చిత్రం ‘ఫిలౌరీ’ విడుదలైంది. కానీ ఆ సినిమా విజయాన్నీ ఆస్వాదించకుండా ఇక్కడ చేస్తున్న పాత్రలపై ప్రేమలో పడిపోయా. తెలుగు సినిమాల్లో నటిస్తున్నందుకు గర్వంగా ఉంది. హిందీ, తెలుగు అని వేర్వేరుగా చూడలేను. హిందీ చిత్రాలతో బిజీ అయిపోవాలనే ఆశ కూడా లేదు. గోపీచంద్‌తో కలిసి నటించబోతున్న కొత్త చిత్రంలోనూ నా పాత్ర బాగుంటుంది’’.
* ‘‘నాకు స్ఫూర్తిగా నిలుస్తున్న కథానాయిక అంటే అనుష్కనే. నా అభిమాన కథానాయిక ఆమె. సినిమా కోసం అనుష్క పడే తపన ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. అగ్ర కథానాయికగా కొనసాగుతుండటానికి కారణం అదే అని నమ్ముతా. ఆమెతో కలిసి ‘మహానుభావుడు’ సినిమా చూశా. అనుష్క సినిమాని చూస్తుంటే, నేను ఆమెనే చూస్తూండిపోయా. సినిమాల్లోని కొన్ని ఫ్రేమ్స్‌ల్లో కాజల్‌లా కనిపిస్తానని చెబుతుంటారు. కాజల్‌ కూడా అదే చెబుతూ ఓ సందేశం పంపారు. చాలా ఆనందమేసింది. అది నాకు దక్కిన ఓ మంచి ప్రశంసగా భావిస్తా’’.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com