దారి తప్పుతున్న ‘దానం’ నాగేందర్

పార్టీ మారుతున్నారంటూ ఒక రోజు.. లేదు లేదు ఆయ‌న పార్టీలోనే ఉంటారంటూ మరోరోజు.. ఇలా గ్రేట‌ర్ కాంగ్రెస్ లో ఎవ‌రి నోట విన్నా ఆయ‌న చ‌ర్చే. ఆయ‌నే మాజీ మంత్రి దానం నాగేంద‌ర్. పార్టీలో ఒక రోజు హ‌డావిడి చేస్తారు.. అంత‌లోనే సైలెంట్ అవుతుంటారు. తాజాగా దానం ఇచ్చిన విందు పాలిటిక్స్ పార్టీలో హీట్ పుట్టిస్తోంది. ఇంత‌కీ దానం విందు రాజ‌కీయాల వెనుక వ్యూహమేంటి.?కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొంతకాలంగా అర్ధంకాకుండా ఉంది దానం నాగేందర్ తీరు. ఆయన పార్టీలో ఉన్నట్టే కనిపిస్తారు.. కానీ కార్యక్రమాల్లో పాల్గొనరు. 24 నియోజకవర్గాలున్న గ్రేటర్ కు పార్టీ అధ్యక్షుడే అయినా కాంగ్రెస్ పిలుపిచ్చిన వేదికలపై కనుచూపుమేరలో ఉండరు. బలమైన బీసీ నాయకుడు కూడా అయిన దానం.. ఇటీవల కాలంలో పార్టీ మారతారంటూ వచ్చిన వార్తలతో క్యాడర్‌ నైరాశ్యానికి గురైంది. దీనికి తోడు దానం పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టన‌ట్లు వ్యవ‌హ‌రిస్తుండ‌టం ఊహాగానాలకు బ‌లం చేకూర్చేలా ఉన్నాయి.ఇటీవల దానం నాగేంద‌ర్ ఉన్నట్టుండి నాయకులకు, కార్యకర్తల‌కు విందు ఇచ్చారు. అయితే గ్రేట‌ర్ కాంగ్రెస్ లీడ‌ర్లు అందులోనూ ప్రత్యేకించి దానం తీరు పలు సందేహాలకు తావిస్తోంది. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని.. అందుకే మద్దతు కోసం ఈ పార్టీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే మద్దతు కోసమే అయితే.. నాయకులను ఎందుకు పిలుస్తారని.. కేవలం కార్యకర్తలకే ఆహ్వానం అందేదంటున్నారు నాయకులు. అయితే అవేమీ కారణం కాదు.. ఓ కరపత్రమే ఆయన విందు రాజకీయానికి కారణమంటున్నారు విశ్లేషకులు. ఇటీవల వాట్సాప్‌లో పార్టీ కార్యకర్తల పేరుతో ఓ కరపత్రం విసృతంగా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క‌ర‌ప‌త్రంలో సిటీ కాంగ్రెస్‌ నాయకులపై తీవ్ర ప‌ద‌జాలంతో విమర్శలు చేశారు. అధికారంలో ఉండగా బాగా సంపాదించుకొని.. ఇప్పుడు హాయిగా పేకాట ఆడుతూ కూర్చున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా పనిచేయండి.. లేకుంటే రాజకీయాలు వదిలి వెళ్లిపోండి అంటూ వెలువ‌డిన ఈ క‌ర‌ప‌త్రం రాష్ట్ర కాంగ్రెస్‌ లో కాకపుట్టిస్తుంది. గ‌త‌ నాలుగు రోజులుగా ఈ కరపత్రాలు పార్టీ వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. గ్రేటర్‌కు చెందిన ఏడుగురు నేతలే టార్గెట్‌గా ఈ క‌ర‌ప‌త్రాలు వెలువ‌డ్డాయి. కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకుందాం.. ఇట్లు రగిలిపోతున్న జంట నగరాల కాంగ్రెస్‌ కార్యకర్తలు అంటూ కరపత్రాల్లో ప్రచురించారు. ఇదే దానంలో మార్పునకు కారణమంటున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com