దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పేరుతో భక్తులను మరింత అగచాట్లకు గురి చేసే పర్వం శరవేగంతో సాగుతోంది. భక్తుల భద్రతకు ప్రాధన్యమివ్వాల్సిన అధికారులు..ప్రధాన దేవాలయాల్లో జరుగుతున్న దుర్ఘటనలను చూసి కూడా గుణపాఠం నేర్వలేదనడానికి మల్లికార్జున మహామండపంలో అన్నప్రసాదం పంపిణీ చేయాలని నిర్ణయించడమే నిదర్శనం. తిరుమలలో వారం రోజుల క్రితం ప్రసాదాల పోటులో సంభవించిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం చోటుచేసుకుంది. పటిష్టమైన యంత్రాంగం, భద్రతా ఏర్పాటు ఉన్న చోటే ప్రమాదం సంభవించింది. అలాంటిది దుర్గగుడిలోని మల్లికార్జున మహామండపంలో కనీస భద్రతా ఏర్పాట్లు లేవని గతంలోనే పోలీసు, అగ్నిమాపక అధికారులు సూచించారు. ఇక్కడ పూర్తిస్థాయి అన్నదానం ఏర్పాటు చేయాలని అనుకోవడమే సరైన నిర్ణయం కాదు. మొదటి రోజు ఆదివారం జరిగిన సంఘటనలే ఈ విషయాన్ని రుడీ చేశాయి. అయినా అధికారుల తీరు మారడం లేదు. ఇక్కడే ఎలాగైనా అన్నదానం ఏర్పాటు చేస్తామని, అవసరమైతే మార్పులు, చేర్పులు చేస్తామంటూ సోమవారం ప్రకటించడం గమనార్హం. వేలమంది ఒకేసారి అన్నదానానికి మెట్ల మార్గంలో రావడం, మూడో అంతస్తులో వేచి ఉండటం అనేది ఎట్టిపరిస్థితుల్లోనే శ్రేయష్కరం కాదు. ఆదివారం భక్తులు ఒకేసారి రావడంతో ఏర్పడిన గందరగోళం చూసిన వారెవరైనా ఇదే చెబుతారు. అధికారులు మాత్రం మంచినీటి వసతి, డ్రైనేజీ కోసం ఏర్పాట్లు, ఫ్యాన్లు, లైట్లు వేసేసి..భక్తులకు మహామండపంలోనే అన్నదానం ఏర్పాటు చేస్తామని అంటున్నారు. పోలీసు, అగ్నిమాపకశాఖ అధికారులను తీసుకొచ్చి..ఇక్కడి పరిస్థితులను వారికి చూపించి..ఏం ఇబ్బంది లేదని స్పష్టం చేశాకే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. భద్రత సమస్య గురించి ఆలోచించకుండా పాలకమండలి సభ్యులు, ఏఈవోలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం ఏముందనేది అధికారులకే తెలియాలి. ఇప్పటికే కొండపై ఉన్న పక్కా అన్నప్రసాదం తయారీ భవనాన్ని రూ.25 లక్షలు వెచ్చించి మరీ కూల్చేశారు. అనంతరం అర్జునవీధిలో రూ.30 లక్షలు వెచ్చించి తాత్కాలిక షెడ్డును ఏడాదిన్నర కిందట నిర్మించారు. ఇప్పుడు మళ్లీ మల్లికార్జున మహామండపంలో ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదీ తాత్కాలికమే తప్ప..సుదీర్ఘకాలం ఉండే పరిస్థితి లేదు. అసలు గతంలో తీసుకున్న నిర్ణయాలను ఎందుకు ఆచరించడం లేదనేది ప్రశ్నార్థకం. కేవలం అన్నదాన కేంద్రం కోసమనే మహామండపం పక్కనే ఆగ్నేయంలో రూ.10 కోట్లు వెచ్చించి శృంగేరి పీఠం నుంచి భూమిని కొన్నారు. ఈ స్థలంలో శాశ్వత ప్రాతిపదికన అన్నదాన కేంద్రం నిర్మిస్తే భక్తుల భద్రత, సౌకర్యానికి ఢోకా ఉండదు. కానీ..గతంలో ప్రణాళికలు రూపొందించిన అధికారులు ఇప్పుడు లేరు. ఆ ప్రణాళిక అటకెక్కింది. ఆ స్థలం ఖాళీగా పడి ఉంది. అన్నదాన పథకానికి భక్తులు ఇప్పటికే రూ.60 కోట్లకు పైగా మూలధనాన్ని ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో అందించారు. అన్నదాన కేంద్రం శాశ్వత ప్రాతిపదికన కట్టేందుకు విరాళాలు ఇచ్చే దాతలూ ఉన్నారు. ఇవన్నీ వదిలేసి.. భక్తులకు ప్రమాదకరమని ఇతర శాఖలు చెబుతున్న చోటే.. కొందరి స్వార్థం కోసం ఎందుకు నిష్పల ప్రయోగాలు చేయడం అనేది అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మహామండపంలో అన్నదానం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు సరే. మరి వంట ఎక్కడనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం. ఒకవేళ ఇప్పుడు వండినట్టుగానే కిందనున్న శృంగేరీ సత్రం వద్ద నుంచే నిత్యం కొండపైకి తేవడమంటే తలకుమించిన భారం. తాజాగా మరో ప్రతిపాదన సైతం అధికారులు తెచ్చినట్టు తెలిసింది. పాత మెట్లమార్గంలో డ్రెయినేజీ పక్కన బాయిలర్స్ పెట్టి వంట చేసి.. మహా మండపంలోని రెండు హాళ్లను ఇతర వంట అవసరాలు, స్టోరు రూమ్‌కు వినియోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రాత్రివేళ ఆలయ ప్రాంగణంలో నిద్ర చేసే భక్తులు రోడ్డు మీదకు చేరాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. వారికి ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా ఇక ఉండని పరిస్థితి వస్తుంది. భక్తుల క్యూలైన్లు, విశ్రాంతి కోసం వినియోగించే మహామండపంలో వంటశాలను ఏర్పాటు చేయడం నిప్పుతో చెలగాటం ఆడినట్టే. అగ్నిమాపక శాఖ అధికారులు సైతం ఈ విషయం స్పష్టంగా చెప్పినప్పటికీ దేవస్థానం అధికారులు మాత్రం పట్టుదలగా ఇక్కడే ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. సరైన వెంటిలేషన్, భక్తులో రెండు, మూడు అంతస్తుల నుంచి బయటకు వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా వంటశాలను ఏర్పాటు చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నలకు సమాధానం లేదు.