దొంగ…బ్రస్సెల్స్ పారిపోయాడు

దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలోనే సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీ ఆచూకీపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. నీరవ్‌ లండన్‌లో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతడిని దేశానికి రప్పించేందుకు బ్రిటన్‌ అధికారులతో భారత్‌ చర్చలు జరుపుతోంది. అయితే తాజాగా అతడు బ్రసెల్స్‌ పారిపోయినట్లు తెలుస్తోంది. కుంభకోణం వెలుగులోకి రావడానికి చాలా రోజుల ముందే భారత్‌ నుంచి పారిపోయిన నీరవ్‌ మోదీ ఆ తర్వాత అనేక దేశాలు తిరిగాడు. అయితే అతడు లండన్‌ చేరుకున్నాడని, యూకే ప్రభుత్వం నుంచి రాజకీయ ఆశ్రయం కోరేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయమై భారత అధికారులు యూకే ప్రభుత్వాన్ని సంప్రదించారు. అయితే ఈ వార్తలు రావడంతో నీరవ్‌ లండన్‌ నుంచి బ్రసెల్స్‌కు పారిపోయినట్లు తాజాగా మీడియా వర్గాల సమాచారం. సింగపూర్‌ పాస్‌పోర్ట్‌పై ప్రయాణిస్తున్న నీరవ్‌.. ప్రస్తుతం బ్రసెల్స్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు నీరవ్‌ మోదీ ఆచూకీపై భారత్‌ ఇచ్చిన ‘డిఫ్యూసన్‌ నోటీసు’కు బ్రిటన్‌ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. నీరవ్‌ మోదీ కేసును విచారిస్తున్న సీబీఐకు ఈమెయిల్‌ ద్వారా యూకే ప్రభుత్వం సమాధానం పంపినట్లు సంబంధిత వర్గాల సమాచారం. అయితే కచ్చితంగా నీరవ్‌ మోదీ ఎక్కడ ఉన్నాడనే వివరాలను బ్రిటన్‌ చెప్పిందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏ దేశంలో ఉన్నాడో ఆచూకీ తెలియని పక్షంలో అంతర్జాతీయ సంస్థ ద్వారా డిఫ్యూసన్‌ నోటీసును జారీ చేసే అవకాశం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. దీంతో నీరవ్‌ ఆచూకీ కోసం ఇంటర్‌పోల్‌ ఛానల్‌ ద్వారా సీబీఐ బ్రిటన్‌ ప్రభుత్వానికి ఈ నోటీసులిచ్చింది. దీనిపై యూకే స్పందించి.. సమాధానమిచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘బ్రిటన్‌ అధికారులు చెప్పిన వివరాలను విదేశాల్లోని దర్యాప్తు సంస్థలకు అందజేశాం. దీనిపై తదుపరి విచారణ జరుగుతోంది’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే నీరవ్‌ ఎక్కడ ఉన్నాడన్న దానిపై బ్రిటన్‌ స్పష్టతనిచ్చిందా లేదా అనే వివరాలను మాత్రం సదరు వర్గాలు వెల్లడించలేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com