‘ధర్మపురి’ నీ కుటుంబంలో ఇదేమి.. అధర్మం?

తండ్రిది టీఆర్ఎస్. ఓ తనయుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో కొడుకు కాంగ్రెస్‌లో చేరిపోతాడా? ఒకే ఇంటిపై మూడు జెండాలు ఎగరబోతున్నాయా? ఇది సైద్ధాంతిక వైరుధ్యమా? పదవుల కోసం జరుగుతున్న ఆరాటమా? ఈ కుటుంబ కథా రాజకీయం తెలంగాణలో నడుస్తోంది.ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన నాయకుడు ధర్మపురి శ్రీనివాస్. కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన పీసీసీ అధ్యక్షుడిగా హైకమాండ్‌ దగ్గరా మంచి వెయిట్ ఉండేది. కానీ.. రెండు ఓటములతో ఫేట్ మారిపోయింది. ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయకపోవడంతో కాంగ్రెస్‌ను వీడిన శీనన్న టీఆరెస్‌లో చేరారు. ఏకంగా పెద్దల సభ రాజ్యసభ ఎంపీ అయ్యారు.గులాబీ గూటిలోను డీఎస్ కు ప్రాధాన్యం తగ్గిందా? ఆయన అభిమానుల్లో ఇదే అనుమానం. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఏదో ఒక అంశంపై రోజూ మీడియాలో క‌నిపించిన శీనన్న.. ఇప్పుడు సైడైపోయారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా త‌న సేవ‌లు వినియోగించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లోను ప్రాధాన్యత క‌రువైంది.తన అనుభవంలో చాలామందిని చ‌ట్టస‌భ‌కు పంపిన డిఎస్.. త‌న‌ వారసులకు రాజకీయ పాఠాలు నేర్పడంలో విఫలమయ్యారనే విమర్శ ఉంది. ఇప్పటికే డీఎస్ తో విభేదించిన ఆయన చిన్న కొడుకు అర‌వింద్ త‌న దారి తానూ వెతుక్కున్నారు. బీజేపీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. తండ్రితో క‌లిసి కారెక్కిన సంజ‌య్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మేల్యేల‌కు మళ్లీ టికెట్‌ ఇస్తామని ఇప్పటికే సీఎం పలుమార్లు స్పష్టంగా చెప్పడం.. టీఆరెస్‌ నుంచి సంజ‌య్‌కు ఎలాంటి క్లారిటి లేక‌పోవ‌డంతో ఆయన సందిగ్ధంలో ప‌డిపోయారు. ఇప్పటికే ఓ దఫా మేయ‌ర్‌గా చేసిన సంజ‌య్.. 2019లో ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. టీఆర్ఎస్‌ నుంచి టికెట్ రాకుంటే కాంగ్రెస్ నుంచైనా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిస్తోంది. కాంగ్రెస్‌ నేత‌ల‌తో సంప్రదింపులు కూడా జ‌రుపుతున్న‌ట్లు ఇందూరులో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తే.. డీఎస్ టీఆర్ఎస్‌లో ఉండ‌గా, చిన్న కొడుకు అర‌వింద్ బిజెపి బాట ప‌ట్టారు. పెద్ద కొడుకు సంజ‌య్ కూడా కారు దిగితే.. ఒకే ఇంట్లో మూడు జెండాలు రెపరెపలాడనున్నాయి. డీఎస్ ఫ్యామీలి పాలిటిక్స్‌ జిల్లాలో హ‌ట్ టాపిక్‌ అయ్యాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో డీఎస్ పోటికి దూరంగా ఉండే అవ‌కాశాలే ఎక్కువ‌. ఇద్దరు తనయుల రాజ‌కీయ భ‌విష్యత్తు కోసం ఎలాంటి వ్యూహంయ అవ‌లంభిస్తారో చూడాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com