నగలు కొనే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి

‘అక్షయ తృతీయ’ (ఏప్రిల్‌ 18) కోసం బంగారం మార్కెట్‌ సిద్ధమైంది. సరికొత్త ఆఫర్లతో మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. అక్షయ తృతీయకు బంగారం కొంటే అంతా శుభమే జరుగుతుందనే సెంటిమెంట్‌ మహిళల్లో చాలాకాలంగా ఉంది. అయితే ‘బంగారం కొనేముందు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే’ అంటున్నారు ‘ప్రాక్షీ ఫైన్‌ జ్యువెలరీ’ క్రియేటివ్‌ హెడ్‌ ప్రాక్షీ శర్మ, ప్రముఖ నగల డిజైనర్‌ చిత్వన్‌ డి. మల్హోత్రాలు. బంగారం కొనుగోలులో వీరిద్దరు కొన్ని ‘స్మార్ట్‌ వే’ సూచనలు చేస్తున్నారు. అవేమిటంటే..బంగారు నగలు కొనేముందు తప్పకుండా వాటి ప్యూరిటీ చెక్‌ చేయాలి. ధరకు తగ్గ విలువ ఉందో లేదో దానివల్ల బయటపడుతుంది. బంగారం, ఆభరణాల స్వచ్ఛత (ప్యూరిటీ)కి సంబంధించి ‘బిస్‌’ (ది బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) ఆథరైజ్డ్‌ ఏజెన్సీ. అది సర్టిఫై చేసిన ‘హాల్‌మార్క్‌’ ఆభరణాలను మాత్రమే కొనాలి. దుకాణాల్లో కొనే ఆభరణాలకు హాల్‌మార్క్‌ నెంబర్‌ ఉంటుంది. ‘బిస్‌’ స్టాంప్‌, ఎన్ని క్యారెట్లు, హాల్‌మార్క్‌ చేసిన ఏడాది… వంటివి ఉంటాయి. కావున బంగారు ఆభరణాలు కొనేముందు ‘హాల్‌మార్క్‌’ చెక్‌ తప్పనిసరి.అక్షయ తృతీయకు భారీ కొనుగోళ్లు జరుగుతాయి కాబట్టి బంగారం దుకాణాలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. మేకింగ్‌ ఛార్జీలను కూడా తగ్గిస్తాయి. సాధారణ సమయాల్లో కన్నా ఈ ప్రత్యేక రోజుల్లో ఏ మేరకు డిస్కౌంట్లు, మేకింగ్‌ ఛార్జీలు తగ్గాయో గమనించాలి.నగలకు సంబంధించి ఒక దుకాణానికి మరో దుకాణానికి ధరల్లో తేడాలుంటాయి. ఆభరణాలు కొనేముందు మార్కెట్లో ఈ ధరల తేడాకు సంబంధించి చిన్న సర్వేలాంటిది చేస్తే మంచిది. రెండు మూడు దుకాణాల్లో తరుగు, మేకింగ్‌ ఛార్జీల్లాంటివి ఆరా తీసి ఆ తర్వాతే కొనాలి బంగారు నగలను చాలామంది సురక్షిత పెట్టుబడి (సేఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) కిందే చూస్తారు. అలాగని కనిపించినవి కొనేయడం కూడా తెలివైన పని కాదు. ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసుకుని మరీ కొనాలి. బంగారం కొనుగోలులో ఆ సంయమనం ఎవరైనా పాటించాల్సిందే. బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తే, కాయిన్స్‌, బిస్కెట్లు కొనడం బెటర్‌.రెగ్యులర్‌ బంగారు ఆభరణాలతో పోల్చితే, విలువైన రాళ్లు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఖరీదు ఎక్కువగా ఉంటాయి. వాటికి మేకింగ్‌ ఛార్జీలు కూడా ఎక్కువే. ఒకవేళ వాటిని మార్చడం, అమ్మడం కానీ చేస్తే రాళ్లను తీసి ఆ నగ ఎన్ని గ్రాములుందో లెక్కిస్తారు. దాని వల్ల అసలు బంగారం విలువ తగ్గుతుంది. రాళ్లు ఎంత ఖరీదువైనా వాటి విలువ లెక్కలోకి రాదనే విషయాన్ని గుర్తెరిగి ఆభరణాలను ఎంపిక చేసుకోవాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com