నన్ను క్షమించండి

ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ తనదైన శైలిలో ట్వీట్లు చేస్తారు భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. ఏదైనా సంఘటన జరిగితే దాని మీద సెహ్వాగ్‌ ఏ విధంగా ట్వీట్‌ చేస్తారా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే.. శనివారం ఆయన చేసిన ట్వీట్‌ వివాదాస్పదమైంది. దీంతో ఆయన ఆ ట్వీట్‌ను తొలగించడంతో పాటు నెటిజన్లకు క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చారు. కేరళలోని పాలక్కడ్‌ జిల్లాలో 27ఏళ్ల మధు అనే వ్యక్తి ఓ దుకాణంలో దొంగతనం చేశాడని అతడిని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే. కళ్లెదుట ఓ వ్యక్తిని దారుణంగా కొడుతుంటే.. అడ్డుకోవాల్సిన కొంతమంది అమానవీయంగా ప్రవర్తించారు. అతడిని కొడుతుంటే పక్కన నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు. అటువైపుగా వెళ్లే కొందరు విషయం పోలీసులకు తెలియజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కానీ అతడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై సెహ్వాగ్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. చెట్టుకు కట్టేసి ఓ మనిషిని దారుణంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు పేర్లను సెహ్వాగ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే.. ఆ మూడు పేర్లు ముస్లింలవే కావడంతో వివాదం చెలరేగింది. ఈ గొడవలోకి మతాలను ఎందుకు తీసుకొస్తున్నారంటూ పలువురు నెటిజన్లు విమర్శించారు. దీంతో వెంటనే స్పందించిన సెహ్వాగ్‌ తనకు పూర్తి సమాచారం రాకపోవడం వల్ల ముగ్గురు పేర్లు మాత్రమే పెట్టానని, ఇందులో ఎటువంటి మతకోణం లేదని ఆయన వివరణ ఇస్తూ నెటిజన్లకు క్షమాపణలు చెప్పారు. ఈ దాడి కేసులో ఇప్పటి వరకు 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com