నరికేస్తా

ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితలుగా పనిచేయడమే కాదు, నటులుగానూ వెండితెరపై మెరిశారు పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ. ‘పరుచూరి బ్రదర్స్‌’గా ప్రసిద్ధికెక్కిన వీరిలో ఒకరు కథ రాస్తే, మరొకరు సంభాషణలు రాస్తారు. నాటి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల నుంచి నేటి యువ కథానాయకుల వరకూ చాలా మంది చిత్రాలకు చక్కని కథలను, సంభాషణలను అందించారు. అంతేకాదు, ఒక సినిమా, అందులోని సన్నివేశాలను ఎలా డీల్‌ చేయాలో నేటి యువ దర్శకులకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే అలనాటి అందాల నటుడు శోభన్‌బాబుకీ, పరుచూరి బ్రదర్స్‌కీ ‘మహాసంగ్రామం’ సినిమా కారణంగా పెద్ద అగాధం ఏర్పడింది. ‘‘మహా సంగ్రామం’ ఎన్టీఆర్‌ కోసం సిద్ధం చేసిన కథ. దాన్ని ఆయనకు వినిపిస్తే ‘చూద్దాం బ్రదర్‌’ అన్నారు. అదేంటి బాగున్న కథను చూద్దాం అన్నారేంటి అనిపించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆ కథను తిరుపతి రెడ్డిగారు విని, ‘ఇద్దరు హీరోలకు మార్చగలరా?’ అని అడిగారు. అప్పుడు కృష్ణ, శోభన్‌బాబులకు అనుగుణంగా కథను మార్చాం. సినిమా బాగా వచ్చింది. అయితే శోభన్‌బాబుగారి పార్ట్‌కు సంబంధించి మూడు వేల అడుగుల నిడివి పోయింది. శోభన్‌బాబుగారు ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర చేయడంతో వివాదంగా ఉన్న సన్నివేశాలను సెన్సార్‌లో తొలగించారు. దీంతో కృష్ణగారి పాత్ర బాగా ఎలివేట్‌ అవ్వడం.. శోభన్‌బాబుగారి పాత్ర చిన్నది కావడంతో ఆయనకు కోపం వచ్చి ‘ఐ విల్‌ మ్యాసికర్‌ పరుచూరి బ్రదర్స్‌’ అన్నారని మాకు ఎవరో చెప్పారు. ఆ తర్వాత 1986 వరకూ శోభన్‌బాబు మాతో పనిచేయలేదు. చివరకు ‘జైలుపక్షి’కి మళ్లీ సాధ్యమైంది. అప్పట్లో ఏది జరిగినా మాపైనే ఉండేది. రెండేళ్ల పాటు చాలా బాధపడ్డాం. చివరకు ఆయనే ఫోన్‌ చేసి మాట్లాడారు. కానీ, 1990లో ‘దోషి నిర్దోషి’ కథను రాశాం. డీవీఎస్‌ రాజుగారు నాగేశ్వరరావుగారితో తీద్దామని అన్నారు. కానీ, శోభన్‌బాబుగారు అయితే బాగుంటుందని అన్నయ్య చెప్పారు. అప్పటికే ఆయన సినిమాలు చేయటం తగ్గించేశారు. అయితే, కథ నచ్చడంతో సినిమా ఒప్పుకొన్నారు. ‘లారీ డ్రైవర్‌’తో పాటు 100రోజులు ఆడింది. ఆ తర్వాత ‘సర్పయాగం’ చిత్రానికి దర్శకత్వం వహించాం. అప్పుడు విలేకరుల సమావేశంలో మమ్మల్ని మెచ్చుకుంటూ ‘రాఘవేంద్రరావుతో పనిచేస్తున్నానో, పరుచూరి గోపాలకృష్ణతో పనిచేస్తున్నానో తెలియటం లేదు’ అన్నారు’’ అంటూ శోభన్‌బాబుతో తమకున్న అనుబంధాన్ని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు పరుచూరి గోపాలకృష్ణ.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com