నాకు అది ఇష్టం లేదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ సాధారణంగా రాజకీయ అంశాలపై ఎలాంటి కామెంట్లు చేయరు. కానీ ఆమె వలసదారుల విషయంపై స్పందించారు. అమెరికా సరిహద్దుల వద్ద వలసదారుల పిల్లల్ని వారి కుటుంబాల నుంచి వేరు చేయడం చాలా దారుణమని, ఈ విధానాన్ని నిలిపేయాలని ఆమె కోరారు. ట్రంప్‌ యంత్రాంగం సరిహద్దుల వద్ద అవలంబిస్తోన్న ‘జీరో-టాలరెన్స్’ భద్రతా పాలసీపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలువురు అమెరికా శాసనకర్తలు కూడా ఈ విధానాన్ని వ్యతిరేకించడంతో వివాదాస్పదంగా మారింది. సాధారణంగా మెలానియా ట్రంప్‌ ఎక్కువగా మాట్లాడరు. ట్రంప్‌ పాలనా పరమైన నిర్ణయాలపైనా స్పందించరు. కానీ నిన్న పితృదినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు. చిన్నారులను వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేసే వలస విధానాలను అంతం చేయాలని ఆమె అన్నారని ఆమె అధికార ప్రతినిధి సీఎన్‌ఎన్‌కు వెల్లడించారు. ‘చిన్నారులు వారి కుటుంబాల నుంచి విడపోవడం చూస్తుండడం మిసెస్‌ ట్రంప్‌కు నచ్చడం లేదు. విజయవంతమైన ఇమ్మిగ్రేషన్‌ పాలసీని రూపొందించడానికి ఇరు పక్షాలు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. ఒక దేశం అన్ని చట్టాలను పాటించాల్సిన అవసరం ఉందని, అంతేకాకుండా హృదయాలతో కూడా పాలన కొనసాగించాలని ఆమె నమ్ముతున్నారు’ అని మెలానియా అధికార ప్రతినిధి స్టీఫెన్‌ గ్రిషామ్‌ తెలిపారు. ఇటీవల కాలంలో ఆరు వారాల సమయంలో ప్రభుత్వం దాదాపు 2వేల మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిబిరాలకు పంపించింది. దీని పట్ల అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికాలోకి మెక్సికో నుంచి అక్రమంగా వచ్చిన వలదారులు వెంటనే వెళ్లిపోవాలని లేదంటే అరెస్ట్‌ చేస్తామని ఇటీవల ట్రంప్‌ యంత్రాంగం ఆదేశించింది. అయితే వారి పిల్లలకు ఇక్కడే ఆశ్రయం కల్పిస్తామంటున్నారు. పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిబిరాలకు పంపుతున్నారు. అమాయక చిన్నారులపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతుందని, నిబంధనలకు చిన్నారులు బలవుతున్నారని పలువురు రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ట్రంప్‌ తీరును వ్యతిరేకిస్తున్నారు. ఈ జాబితాలో మెలానియా కూడా చేరడం గమనార్హం. ఆ పిల్లల కళ్లలో భయం కనిపిస్తోంది.. ఇక తమ తల్లిదండ్రలను ఎప్పడూ చూస్తామోనని బాధ కనిపిస్తోందని, ఇది చాలా దారుణమని ఓ శాసనకర్త పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com