నాకే రాజకీయాలు నేర్పుతున్నారు

సెంటిమెంటుతో డబ్బులు రావని చెబుతున్న కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీకి.. సెంటిమెంటుతోనే రాష్ట్రాన్ని విభజించిన సంగతి గుర్తులేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ప్రత్యేక హోదాకు వచ్చే ప్రయోజనాలన్నీ ఇస్తామని హామీ ఇస్తేనే ఆనాడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాం. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను. నాకు భాజపా నేతలు రాజకీయాలు నేర్పుతున్నారు. నేను 1995లోనే ముఖ్యమంత్రిని అయ్యాను. తొమ్మిదేళ్లు ఆ పదవిలో ఉన్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. మళ్లీ నాలుగేళ్ల నుంచి సీఎంగా ఉన్నాను. రాష్ట్రానికి సంబంధించి నా కంటే ఎక్కవగా ఎవరికీ తెలియదు. దేశంలోనే సీనియర్‌ రాజకీయ నేతల్లో నేనూ ఒకడిని. ఆర్థిక సంస్కరణల వల్ల లాభాలు వస్తాయని మొదటిసారిగా చెప్పింది నేనే. అలాంటి నాకు రాష్ట్ర ప్రయోజనాల గురించి తెలియదా?. విభజన హామీలపై భాజపా నేతలు అన్యాయంగా మాట్లాడుతున్నారు. 60ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తి వేరెవరికో వెళ్తే భాజపా నేతలకు బాధ కలగదా?. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ది అదే పరిస్థితి. ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వారు చెప్పడం సరికాదు. హోదా ఉన్న రాష్ట్రాలకు ఏటా రాయితీలు, నిధులు ఇస్తున్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి అవి అవసరం లేదని భాజపా నేతలు అనుకుంటున్నారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ పక్క రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించేవరకు ఆదుకోమని కేంద్రాన్ని కోరుతున్నా. కేంద్రం సాయం వల్లే రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు సాధించిందని భాజపా నేతలు అంటున్నారు. మరి భాజపా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ వృద్ధి ఎందుకు జరగడం లేదు? మేము కష్టపడుతున్నాము కాబట్టే అభివృద్ధి సాధించగలుగుతున్నాం. రాష్ట్రం విభజన జరిగినప్పుడు మోదీ స్పందిస్తూ.. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం బిడ్డకు జన్మనిచ్చి తల్లిని పురిట్లోనే చంపేసింది. మేం అధికారంలో ఉంటే రెండు రాష్ట్రాలకు సమాన న్యాయం చేసేవాళ్లం’ అని వ్యాఖ్యానించారు. మరి మీరు అధికారంలోకి వచ్చాక ఏం చేశారు?. విభజన తర్వాత రెవెన్యూ లోటు 16వేల కోట్లుగా కాగ్‌, ఆర్థిక సంఘం నిర్ధరించాయి. 2014-15 బడ్జెట్‌లోనే ఆ నిధులు కేటాయించాలని ఆర్థిక సంఘం సూచించింది. మరి ఆ ఏడాది బడ్జెట్‌లోనే నిధులు ఎందుకు మంజూరు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో భాజపా మంత్రులు, కేంద్రంలో మా మంత్రులు రాజీనామా చేసిన సందర్భంలోనే విశాఖకు రైల్వేజోన్‌ ఇవ్వలేమని ఓ రైల్వే అధికారి ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?. కేంద్రానికి ఒక నిర్దిష్టమైన రాజకీయ విధానం ఉందా?. అధికారుల నిర్ణయాలే కాదు.. రాజకీయంగా విధాన నిర్ణయాలు కూడా పాలనలో ప్రధానం. అసంబద్ధంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను ప్రజలు తుడిచిపెట్టేశారు. ఆ పరిస్థితి మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నా. అప్పటి ప్రధానమంత్రి ఏం చెప్పారో.. తర్వాత ప్రధాని అయిన మోదీ ఏం హామీలు ఇచ్చారో అవన్నీ పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నా.’ విభజన చట్టం, ప్రత్యేక హోదా ఐదుకోట్ల ఆంధ్రుల హక్కు. ఎన్టీఆర్‌ ఆంధ్రులకు ఆత్మగౌరవం ఇస్తే.. నేను ఆత్మవిశ్వాసం ఇచ్చా. నాకు భయం లేదు. ఎలాంటి లాబీయింగ్‌కు పాల్పడలేదు. కేంద్రాన్ని గవర్నర్‌ పదవి అడిగానా?మంత్రి పదవి, కార్పోరేషన్‌ పదవి అడిగానా?. రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని అడగడానికి రాష్ట్ర భాజపా నేతలకు మొహమాటం ఉందేమో? నాకు లేదు. సీమాంధ్ర రెవెన్యూ లోటును తప్పకుండా భర్తీ చేయాలని రాజ్యసభలో ఆనాడు ప్రతిపక్ష నేతగా జైట్లీ ప్రకటన చేశారు. ఇప్పడు ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com