నాడు జల్లికట్టుకు ఏపీ సహకరించలేదు. నేడు తమిళులు అడ్డం పడ్డారు.

దేశరాజధానిలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎండలు మొదలవకముందే రాజకీయ వేడితో ఢిల్లీ హీటెక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని తుంగలో తొక్కేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు వేదికగా ఏపీ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని అడ్డుకొనేందుకు బీజేపీ భారీ ప్లాన్ వేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ చర్చకు స్వీకరిస్తుండగా ఆ అంశంతో ఎటువంటి సంబంధం లేని అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి సభ జరగకుండా అడ్డుకోవడం అనుమానాలకు తావిస్తోందని విశ్లేషిస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్‌సభ.. మొదలైన 30 సెకెన్లకే వాయిదా పడడం.. మళ్లీ 12 గంటలకు తిరిగా ప్రారంభమైనా.. అవిశ్వాసంపై చర్చించేందుకు అవకాశం రాకుండా అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేయడం చూస్తుంటే.. అంతా అనుకున్నట్టే జరిగిందంటున్నారు ఇతర పార్టీల ఎంపీలు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీల నినాదాలు ఒకవైపు.. రిజర్వేషన్ల అంశంపై టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన మరోవైపు.. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు వాయిదా పడడం ఎవరికి లాభం? అనే ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీ, వైసీపీ అవిశ్వాస నోటీసులు అందాయని, సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించేందుకు వీలు కల్పించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ విజ్ఞప్తి చేసినా.. ఆందోళన చేస్తున్న సభ్యులు పట్టించుకోలేదు. దీంతో సభ సజావుగా లేనందున అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరపలేమంటూ.. నిరసనల మధ్య కౌంటింగ్‌ సాధ్యం కాదంటూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్ లోక్‌సభను వాయిదా వేశారు. అయితే అవిశ్వాస తీర్మానం ప్రస్తావన రాగానే మద్దతుగా వందమందిదాకా విపక్ష సభ్యులు లేచినిలబడ్డారు. అయినా ఏం ప్రయోజనం? టీడీపీ, వైసీపీ ఎంపీలు వెళ్లి వెల్‌లో ఉన్న అన్నాడీఎంకే ఎంపీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాళ్లు వినకపోగా.. కావేరీ జలాలు, జల్లికట్టు లాంటి వివాదాలు వచ్చినప్పుడు మీరీమైనా మాకు సహకరించారా అంటూ ప్రశ్నించినట్లు చెబుతున్నారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పూర్తిగా బీజేపీ గుప్పిట్లో చిక్కుకుందని, కేంద్ర ప్రభుత్వమే అన్నాడీఎంకేను అస్త్రంగా మార్చుకుని అవిశ్వాసం చర్చకు రాకుండా చేస్తోందని విపక్ష ఎంపీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ధోరణి కొనసాగితే అవిశ్వాసం చర్చకు రాకుండానే.. బీజేపీ అనుకున్నట్లుగానే పార్లమెంట్ నిరవధిక వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. అంతా అనుకున్నట్లే జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటేనే అవిశ్వాసం చర్చకు వచ్చే అవకాశం ఉందని ఏపీకి చెందిన ఓ ఎంపీ అభిప్రాయపడ్డారు. సభ సజావుగా లేదనుకుంటే ఆందోళన చేస్తున్న వారిని సస్పెండ్ చేసి అవిశ్వాసంపై చర్చ చేపట్టొచ్చని.. కానీ, బీజేపీ అంత సాహసం చేస్తుందని అనుకోలేదన్నారు. కేంద్రంపై గెలుస్తామనే ధీమాతో అవిశ్వాసం పెట్టలేదని, మన రాష్ట్ర సమస్య దేశవ్యాప్తంగా తెలియాలనే పెడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com