నీకన్నా నయమే కదా?

ఏపీకి ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెదేపా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. పవన్‌కు వయసు, అనుభవం రెండూ తక్కువేనని విమర్శించారు. తిరుపతిలో శనివారం నిర్వహించిన సభలో పవన్‌ పార్లమెంట్‌ విధానాలు తెలిసి మాట్లాడారా? లేదా? అనేది తనకు అర్థంకావడం లేదన్నారు. సీఎం చంద్రబాబు తెలివైన వ్యక్తికాబట్టే సంయమనంతో ఉన్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం అవమానాలు భరిస్తున్నారని జేసీ అన్నారు. వపన్‌ కల్యాణ్‌ వూహాలోకంలో విహరించవద్దని జేసీ సూచించారు. బస్సులు, హోటళ్లు, వ్యాపార సంస్థలను మూయిస్తే లాభమేంటని ప్రశ్నించారు. రహదారులపైకి వచ్చి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కల్గించవద్దని కోరారు. రాజీనామాలతో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందంటే ఇప్పుడే చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులపై అనవసర నిందలు వేయవద్దన్నారు. తాను పుట్టకముందు నుంచే తమకు వ్యాపారాలు ఉన్నాయని చెప్పారు. వ్యాపారాలు ఉన్నంత మాత్రాన కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. ప్రత్యేక హోదా తెస్తానంటే ఎంపీలంతా పవన్‌తో కలిసి నడుస్తామన్నారు. ఎంపీలు రాజీనామాలు ఇచ్చినా కేంద్రానికిఏమీ కాదన్నారు. పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్ధతిలో హోదా కోసం నిరసన తెలిపినట్లు చెప్పారు. అయినా కేంద్ర ప్రభుత్వం మాట వినడంలేదని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తలచుకుంటే రెండు నిమిషాల్లో హోదా వస్తుందని జేసీ అన్నారు. ప్రత్యేక హోదా అంశం సెంటిమెంట్‌తో కూడుకున్నదని.. ప్రధానిని కలిసినప్పుడు రాష్ట్రానికి న్యాయం చేస్తామని ఆయన చెప్పారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే భాజపాకు కూడా పడుతుందని హెచ్చరించారు. భాజపాతో పొత్తు ఉంటే తెదేపాకు నష్టమని చంద్రబాబుకు తాను చెప్పినట్లు గుర్తుచేశారు. కేంద్రంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఎన్నికల తర్వాత మిత్రపక్షాలను కరివేపాకులా తీసిపడేశారన్నారు. హోదా కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో తాము పోరాడుతున్నట్లు చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com