నీకేమైంది బెంగుళూరు? మరో దారుణం!

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఇది. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా రోడ్డుపై నడిచి వెళ్లినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లన్న జాతిపిత గాంధీ మాటలు తర్వాత.. వీధుల్లో నలుగురు తిరిగే వేళలోనూ మహిళలకు రక్షణ లేదన్న దారుణ నిజం వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేళ.. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరు మహానగరంలోని మహిళల పట్ల కొందరు మగాళ్ల అనుచిత వైఖరి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏంజీ రోడ్‌లో చోటు చేసుకున్న ఘటనే కాదు.. వెలుగులోకి రాని రీతిలో చాలానే చోట్ల ఇదే తరహాలో దారుణాలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో తాజాగా బయటకు వచ్చింది. సోషల్‌ మీడియాలో సంచలనంగా మారిన ఈ వీడియో చూస్తున్న వారంతా షాక్‌కు గురి అవుతున్నారు. బెంగళూరు నగరంలోని కమ్మాన్‌హళ్లీ రోడ్డు నెంబరు 5లో చోటు చేసుకున్న ఒక దారుణం సీసీ కెమేరా ఫుటేజ్‌ పుణ్యమాని బయటకు వచ్చింది. ఓ యువతి నూతన సంవత్సరం వేళలో.. కమ్మన్‌హళ్లీ 5వ నెంబర్‌ రహదారిలో ఆటో దిగి ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. ఇంటికి కూతవేటు దూరంలో ఉండగా.. ఇద్దరు ఆకతాయిలు ద్విచక్ర వాహనంపై ఆమెను టీజ్‌ చేసుకుంటూ వెళ్లి దూరంగా ఆగారు. ఆ మహిళ నడుచుకుంటూ వస్తుండగా ఆకతాయిల్లో ఒకడు వాహనం దిగి ఆమెను బలవంతంగా పట్టుకున్న వైనం సీసీ కెమేరాల్లో నిక్షిప్తమైంది. అతడి కబంధ హస్తాల నుంచి విడిపించుకోవడానికి ఆమె విశ్వప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆ మృగాడు ఆమెను వదల్లేదు. రోడ్డు మధ్యన బాధితురాలిని పట్టుకున్న అతడు.. తనతో వాహనం పై వచ్చిన వాడి వైపునకు ఆమెను బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ రెండో వ్యక్తి కూడా ఆమెను పట్టుకొని భౌతికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను రోడ్డుపై పడేసి తమ దారిన తాము వెళ్లిపోయారు. దారుణమైన విషయం ఏమిటంటే.. రోడ్డు మీద ఇంత దారుణం జరుగుతున్నా.. ఆ మార్గంలో ప్రయాణించే పలువురు ఆగి మరీ చూశారే కానీ ఒక్కరు కూడా ఆ నిస్సహాయురాలిని రక్షించేందుకు ముందుకు రాలేదు. ఇదంతా అక్కడ ఓ ఇంటికి అమర్చిన సీసీ కెమేరాలో నమోదైంది. దీనిని ఆ ఇంటివారు మీడియాకు అందజేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ వీడియో ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో షాకింగ్‌ సంచలనంగా మారింది

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com