“నీట్” సీనియర్ల ఘాతుకం. అందరికి సస్పెన్షన్.

తాడేపల్లిగూడెంలోని ప్రతిష్ఠాత్మక ఏపీ నిట్‌లో ర్యాగింగ్‌ భూతం పురివిప్పింది. పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాలలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న నిట్‌ ప్రాంగణంలోనే శుక్రవారం సాయంత్రం ప్రథమ సంవత్సరం చదువుతున్న బిహార్‌కు చెందిన ముకుల్‌ కుమార్‌ను ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరానికి చెందిన మొత్తం 15 మంది విద్యార్థులు ర్యాగింగ్‌ చేశారు. అయితే సీనియర్‌ విద్యార్థులకు ఘాటుగా సమాధానమిచ్చిన ముకుల్‌ ప్రయోగశాలకు వెళ్లిపోయాడు. అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ప్రయోగశాలలో ఉన్న ముకుల్‌ను సీనియర్‌ విద్యార్థులు బయటకు పిలిచి నిట్‌ ప్రాంగణంలోనే అతనిపై దాడి చేశారు. దీన్ని అడ్డుకునేందుకు యత్నించిన సెక్యూరిటీ గార్డును కూడా సీనియర్‌ విద్యార్థులు గాయపరిచారు. ఈ విషయం తెలుసుకున్న ప్రథమ సంవత్సరం విద్యార్థులు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాత్రి కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న గ్రామీణ సీఐ ఎన్‌.రాజశేఖర్‌, గ్రామీణ ఎస్సై బాదం శ్రీనివాసరావు సంఘటన ప్రాంతానికి చేరుకుని ఏపీ నిట్‌ రెసిడెంట్‌ కో ఆర్డినేటర్‌ ఎస్‌.శ్రీనివాసరావుతో కలిసి విద్యార్థులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకునే వరకూ తమ ఆందోళన విరమించేదిలేదని విద్యార్థులు తెగేసి చెప్పారు. తెల్లవారుజామున 3 గంటల వరకూ వీరి ఆందోళన కొనసాగింది. రెండోరోజైనా శనివారం ఉదయం ప్రథమ సంవత్సరం విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. సీనియర్‌ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకునే వరకూ తాము తరగతులకు వచ్చేదిలేదని తెగేసి చెప్పారు. దాడికి పాల్పడిన 15 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పడంతో నిరసన విరమించారు. నిట్‌ తాత్కాలిక ప్రాంగణంలోనే సీనియర్‌ విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థిపై దాడికి పాల్పడటంతో ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. పోలీసులు సీసీ టీవీ పుటేజీని పరిశీలించి.. దాన్ని తీసుకెళ్లారు. ముందుగా పోలీసులు బాధితుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. నిట్‌లో ర్యాగింగ్‌ జరగడం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ చోటుచేసుకోవటంతో ఓ విద్యార్థి వారం రోజులు సస్పెన్షన్‌కు గురైన సంఘటనలున్నాయని విద్యార్థులు చెబుతుండటం గమనార్హం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com