నీలినీడల మాటున దేవదేవుని బడ్జెట్

తిరుమల తిరుపతి దేవస్థానంలోని 38 విభాగాల పరిపాలన నిమిత్తం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్‌పై నీలినీడలు వీడటం లేదు. స్వామి వారి కైంకర్యాలు, ఆలయ పరిపాలన సాఫీగా సాగడంతో పాటు.. 15 వేల మంది శాశ్వత, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగు ఉద్యోగుల సంక్షేమంతో ముడిపడి ఉన్న అంశం. అయితే.. ఈ బడ్జెట్‌ ఆమోదం ఎలా అన్నది ధర్మ సందేహంగా మారింది. ఉద్యోగుల కోసం బడ్జెట్‌లో కొత్తగా ఏమైనా చేయాల్సినవి ఉంటే… దానికి కేటాయింపులు బడ్జెట్‌లోనే నిర్ణయమవుతాయి. దీంతో తితిదే బడ్జెట్‌పై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఈ సారి అసలు బడ్జెట్‌ను ఎవరు ఆమోదిస్తారన్నదే పెద్ద చిక్కుముడిగా మారిపోయింది. తితిదే పాలకమండలి పదవీకాలం పూర్తయి సుమారు 11 నెలలు పూర్తయినా కొత్త పాలకమండలిని ప్రభుత్వం నియమించలేదు. కొత్త మండలి వచ్చే వరకు ఆధీకృత సంస్థ (స్పెసిఫైడ్‌ అథారిటీ)ను నియమిస్తారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో పనిచేసే ఆధీకృత సంస్థ తితిదే పాలనపై నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ సంస్థ కూడా ప్రస్తుతం లేదు. బ్రహ్మోత్సవాలతో పాటు… కీలకమైన ఎన్నో ఉత్సవాలు ఈవో, జేఈవోల నిర్ణయాల మేరకు జరిగిపోతున్నాయి. కీలకమైన తితిదే బడ్జెట్‌ను మాత్రం కేవలం అధికారుల ఆమోదం మేరకు అమలు చేసేందుకు వీల్లేదు. కచ్చితంగా పాలకమండలి లేదా స్పెసిఫైడ్‌ అథారిటీ ముద్ర పడాల్సిందేనన్నది తితిదే చట్టం చెబుతోంది. పాలకమండలి నియామకం ఆలస్యమైన కొద్దీ.. బడ్జెట్‌పై ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. తితిదే అధికారులు ఏటా జనవరి 15 నాటికే బడ్జెట్‌ కసరత్తు పూర్తి చేస్తారు. ఆ సమాచారాన్ని పాలకమండలి ఛైర్మన్‌కు చేరవేస్తారు. జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి మొదట్లో పాలకమండలి సమావేశమై బడ్జెట్‌ను ఆమోదిస్తుంది. ఇది గతం వరకు కొనసాగిన సంప్రదాయం. గత ఏడాది బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆమోదించారు. అయితే ఈసారి బడ్జెట్‌ తయారీ, నిధులు, వినియోగం తదితర విషయాలను పూర్తిగా అధ్యయనం చేసి బడ్జెట్‌ను రూపొందించారు. విషయాన్ని దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు తెలిపారు. వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు. మారి మొదటి వారం ముగుస్తున్నా.. నేటికీ తేలలేదు. ఈ నెలాఖరుకు ఈ ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది. చివర్లో తితిదేకు కొన్ని చెల్లింపులు, ఆడిటింగ్‌ ప్రక్రియ ఉంటుంది. అందుకే ఏటా ఫిబ్రవరిలోనే బడ్జెట్‌ తతంగం పూర్తవుతుంది. ఈసారీ అలా జరగలేదు. ఏటా తితిదే బడ్జెట్‌ పెరుగుతోంది. హుండీ ఆదాయంతో పాటు… ఇతర సేవల టిక్కెట్లు ధరలు పెరుగుతున్నాయి. తాజాగా లడ్డూల ధరలనూ పెంచారు. అదే తీరును తితిదే ఖర్చులూ పెరిగాయి. పాలకమండలి లేనందున భారీ పద్దులకు అధికారులే ఆమోదముద్ర వేస్తున్నారు. ఏటా రూ.100 కోట్ల మేర ప్రణాళిక పెరుగుతున్నా.. ఉద్యోగుల సంక్షేమానికి, అభివృద్ధికి కేటాయిస్తోంది చాలా తక్కువ అన్న అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. తాత్కాలిక నిర్మాణాలు, కట్టడాలు, వాహనాల ఖర్చులు, ప్రొటోకాల్‌ వ్యవహారాలకే తడిసి మోపెడవుతున్నాయి. జనరల్‌ ఆడిట్‌తో సరిపెడుతున్న తితిదే.. లెక్కల వివరాలను బయటపెట్టడం లేదు. ఈసారి రూపొందించిన ప్రణాళికలో తమ సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారోనన్న ఆశ ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. అది చూడాలంటే.. ముందు పాలకవర్గం లేదా స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు కావాల్సి ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com