నీళ్ల కోసం కన్నీళ్లు

దశాబ్దాల పాటు సాగుతున్న కావేరీ నదీ జలాల వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించింది. తమిళనాడుకు 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2007లో కావేరీ జల వివాద పరిష్కార ట్రైబ్యూనల్‌ ఆదేశాల ప్రకారం..తమిళనాడుకు 192 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు ఆదేశాలున్నాయి. కానీ సుప్రీం తాజాగా ఇచ్చిన తీర్పులో తమిళనాడుకు రావాల్సిన వాటాను తగ్గించింది. కావేరీ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌తో పాటు పలువురు తమిళనాడు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘కావేరీ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు విని నేనూ షాకయ్యాను. ఈ తీర్పు విషయంలో పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నాను. అయితే నీరు ఏ రాష్ట్రం సొంతం కాదని సుప్రీం గట్టిగా చెప్పింది. ఇది బాధాకర విషయం.’ అని కమల్‌ అన్నారు. మరోపక్క తమిళనాడు ప్రభుత్వం రాజకీయ లాభాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని డీఎంకే ఆరోపించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు షాక్‌కు గురిచేసిందని డీఎంకే సీనియర్‌ నేత దురయ్‌ మురుగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పులో అన్నాడీఎంకే హస్తం ఉందని డీఎంకే పార్టీ సెక్రటరీ టీకేఎస్‌ ఎలన్‌గోవన్‌ అన్నారు. తమిళనాడు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇతర రాష్ట్రాల ప్రజలందరూ చూస్తున్నారని కావేరీ విషయంలో మున్ముందు ఏం జరుగుతుందో చూసి ఆ తరువాత ఏం చేయాలో అది చేస్తామని డీఎంకే హెచ్చరించింది. సుప్రీం తీర్పు ప్రకారం తమిళనాడుకు 177.25 టీఎంసీల నీరు సరిగ్గా అందుతోందో లేదో పర్యవేక్షించేందుకు తమిళనాడులో కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరారు. తమిళనాడులో 24 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు ఉందని ఇవన్నీ తెలిసి సుప్రీం ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుందో అర్థం కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పుపై ప్రముఖ నటి గౌతమి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘కావేరీ విషయంలో కర్ణాటకకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ కావేరీ నది యావత్ తమిళనాడు రాష్ట్రానికి అన్నంపెడుతోంది. సుప్రీం తీర్పులో న్యాయం లేదు. మన రైతులే మన జీవనోపాధి. వ్యాపారం కన్నా జీవితం ముఖ్యం’ అని గౌతమి ఆవేదన వ్యక్తం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com