నీ ఖ్యాతి మా సొమ్ములతోనే వచ్చింది

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)లో వెలుగుచూసిన రూ.12,600కోట్ల కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ విదేశాల్లో ఉంటున్నారు. అయితే ఈ కేసులో రాజీ చేసుకునేందుకు ప్రయత్నించిన నీరవ్‌మోదీకి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఇందులో ఎలాంటి రాజీలు కుదరవని.. వెంటనే తమ దగ్గర తీసుకున్న డబ్బు మొత్తం కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. పీఎన్‌బీ నుంచి తీసుకున్న మోసపూరిత లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌(ఎల్‌వోయూ)లతో నీరవ్‌మోదీ తదితరులు విదేశాల్లోని భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రుణాల మొత్తం విలువ రూ. 12వేల కోట్ల పైనే. దీంతో నీరవ్‌మోదీ, ఆయన బంధువైన మెహుల్‌ ఛౌక్సీ తదితరులపై సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో రాజీకొచ్చేందుకు నీరవ్‌ గత నెలలో పీఎన్‌బీకి ఒక ఈమెయిల్‌ పంపినట్లు తెలుస్తోంది. అప్పుల కింద రూ. 2000కోట్ల విలువైన నగలు, రూ. 200కోట్ల డిపాజిట్లు, రూ. 50కోట్ల విలువైన స్థిరాస్తులు తీసుకుని రాజీకి రావాలని కోరినట్లు ఈ మెయిల్‌ సారాంశం. అయితే ఇందుకు పీఎన్‌బీ ససేమిరా అన్నట్లు సమాచారం. ఈ మేరకు గతవారం బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ అశ్విని వాట్స్‌ నీరవ్‌మోదీకి ఈ మెయిల్‌కు సమాధానమిచ్చారు. ‘మీరు ఎంత మొత్తంలో బ్యాంకును మోసం చేశారో మీకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు అందులో కొంత మాత్రమే కడతానంటున్నారు. అంతేగాక మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లేదు. రాజీ కోసం మీరు చెప్పిన ఆస్తుల వివరాల్లో ఎలాంటి విశ్వసనీయత లేదు. మీరు మొత్తం డబ్బు కట్టాల్సిందే. కొన్నేళ్లుగా బ్యాంకును మోసం చేస్తూ మా డబ్బును దుర్వినియోగం చేశారు. అయినప్పటికీ బ్యాంకు ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోదు అని మీరు ఎలా అనుకుంటున్నారు. పైగా పీఎన్‌బీ కేసు పెట్టడం వల్ల, సీబీఐ కేసుల వల్ల మీ బ్రాండ్‌ పేరు చెడిపోతుంది అని మమ్మల్ని ఆరోపిస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే.. నీరవ్‌మోదీ అనే బ్రాండ్‌ను నిర్మించుకుందే మా బ్యాంకు డబ్బులతో కదా’అని పీఎన్‌బీ తన ఈ మెయిల్‌లో స్పష్టం చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com