నెలవంక కనిపిస్తోంది. నేడే రంజాన్.

నెలవంక తొంగి చూస్తోంది…-నేడు రమజాన్ – రంజాన్ ప్రత్యేకం
శుభాల సరోవరమైన అతి పవిత్ర రంజాన్‌ మాసం ముగిసింది. అల్లాహ్ తో మన సంబంధాలు మరింత దృఢం చేసుకొనే అవకాశాన్ని రంజాన్‌ అందించింది. అల్లాహ్ను మన్నింపు కోరుకోవడానికీ, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో విశ్లేషించుకోవడానికీ, మన జీవిత లక్ష్యం, మన జీవిత గమ్యం గురించి ఆలోచించడానికీ, దైవాదేశాల ప్రకారం మన జీవితాల్ని చక్కదిద్దుకోవడానికీ అవసరమైన అవకాశాన్ని రంజాన్‌ మాసం కల్పించింది. ఆ అవకాశాన్ని మనం ఎంతవరకూ ఉపయోగించుకున్నామన్నది మనం ఆలోచించుకోవాలి.
**ఈద్‌ రోజు ఎలా గడపాలి?
పండుగ రోజున తలస్నానం చేయడం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవడం, కొత్త దుస్తులు ధరించడం ఉత్తమం. ఇది మహా ప్రవక్త వారి ఆచరణ విధానం. పట్టణంలో లేక గ్రామం వెలుపల ఒక బహిరంగ ప్రదేశంలో ఈద్‌ నమాజ్‌ చెయ్యడం ఉత్తమం. ఈదుల్‌ ఫిత్ర్‌ నమాజ్‌కు ముందు కొన్ని ఖర్జూర పండ్లు తిని వెళ్ళాలి. ఖర్జూరాలు బేసి సంఖ్యలో (1, 3, 5, 7) తినాలి. పండ్లు లేకపోతే తీపి పదార్థాన్ని తీసుకోవాలి. వెళ్ళేటప్పుడు ఒక దారిలో వెళ్ళి, మరో మార్గంలో తిరిగి రావడం దైవ ప్రవక్త వారి సంప్రదాయం. నమాజ్‌కు వెళ్ళే సమయంలో ఈ తక్బీర్‌ చదువుతూ ‘‘అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌ – లాయిలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వలిల్లా హిల్‌ హమ్ద్‌’’ అంటూ నెమ్మదిగా పఠిస్తూ, ఈద్గా్‌హకు చేరుకోవాలి. నమాజ్‌ చదివిన తరువాత సలాములు చేస్తూ, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్సాహంగా, ఉల్లాసంగా బంధు, మిత్రులతో గడపాలి.
**ఈద్‌ నెలవంక
ఎలాగైతే రంజాన్‌ నెలవంకను చూసి మనం ఉపవాసాలు ఉండడం మొదలుపెడతామో, అలాగే షవ్వాల్‌ నెలకు చెందిన నెలవంకను చూడగానే ఉపవాసాలను ఆపేసి, మరుసటి రోజు ఈదుల్‌ ఫిత్ర్‌ పండుగను జరుపుకోవాలి.
*దైవ ప్రవక్త ఇలా సెలవిచ్చారు
‘‘నెలవంకను చూసి ‘రోజా’ (ఉపవాసం) ప్రారంభించండి. నెలవంకను చూసి ‘రోజా’ చాలించండి. అవి ఇరవై తొమ్మిది రోజాలు అయినా, ముప్ఫై రోజాలు అయినా సరే.’’
పండుగ రోజు రాత్రి ఆరాధనఈదుల్‌ ఫిత్ర్‌ (ఈద్‌), ఈదుల్‌ జుహా (బక్రీద్‌) రాత్రులు ఎంతో ఔన్నత్యం, శుభాలు కలిగిన రాత్రులు! ఈ రాత్రుల్లో కూడా మేల్కొని ఆరాధనలూ, ‘దుఆ’ (ప్రార్థన)లూ చెయ్యాలి. ఎవరైతే పుణ్య ఫలాపేక్షతో ఈ రెండు పండుగుల రాత్రులూ దైవారాధనలో గడుపుతారో- వారి హృదయాలూ, ఇతరుల హృదయాలూ నిర్జీవమైపోయినప్పుడు కూడా సజీవంగా ఉంటాయని దైవప్రవక్త సెలవిచ్చారు. *ఈద్‌ నమాజ్‌కు ముందే ఫిత్రా
దాసులు అల్లాహ్‌ మెప్పు కోసం పాటించిన ఉపవాస వ్రతాల్లో మానవ సహజమైన దౌర్బల్యాల వల్ల జరిగే పొరపాట్లు, లోటుపాట్లను ‘ఫిత్రా’ దానం చేయడం ద్వారా ప్రక్షాళన చేసుకోవాలి.
*మహా ప్రవక్త ఇలా తెలిపారు
అనవసరమైన, అపసవ్యమైన మాటల నుంచి ఉపవాసి పరిశుద్ధుడు అవడానికీ, నిరాధారులకు ఆహారం ప్రాప్తమవడానికీ ‘ఫిత్రా’ తప్పనిసరి. ఎవరైతే దీన్ని (ఈ దానాన్ని) పండుగ నమాజ్‌ కన్నా ముందు ఇచ్చారో అది దైవ సమక్షంలో సమ్మతించిన దానం అవుతుంది. ఇంకా, ఎవరైతే నమాజ్‌ అనంతరం ఇచ్చారో, అది దానాల్లో ఒక దానంగా పరిగణించబడుతుంది.’’అందువల్ల ఈద్‌కు ఒక రోజు ముందే ఫిత్రా చెల్లించి, బీదవారు ‘ఈద్‌’ రోజున కడుపు నిండా రుచికరమైన ఆహారం భుజించేందుకు కృషి చేయాలి.
*అల్లాహ్‌ తరఫున ఈదీ
పండుగ రోజున పిల్లలకు పెద్దలు ‘ఈదీ’లు ఇస్తూ ఉంటారు. అల్లాహ్‌ కూడా నెల రోజులు భక్తులు కనబరచిన భక్తీ, నిష్ఠలకు ప్రతిగా అపార ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
పండుగ రోజు అల్లాహ్‌ దైవ దూతల సమక్షంలో తన దాసుల పట్ల గర్విస్తూ- ‘‘నా దూతలారా! తనకు అప్పగించిన పని పూర్తి చేసినవారి శ్రమకు ప్రతిఫలం ఏమిటి?’’ అని ప్రశ్నిస్తాడు. దానికి వారు ‘‘ఓ అల్లాహ్‌! అతనికి ప్రతిఫలం ఇవ్వాల్సిందే’’ అంటారు. అప్పుడు అల్లాహ్‌ ‘‘నా దూతలారా! నా దాసులూ, నా దాసీలూ నేను వారిపై విధించిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చి, దీనంగా నన్ను వేడుకోవడానికి (ఈద్‌ నమాజ్‌ కోసం) తమ ఇళ్ళ నుండి బయలురేదారు. దూతలారా! వినండి. నా మహిమ సాక్షిగా, నా గౌరవోన్నతుల సాక్షిగా, నా కార్యం సాక్షిగా నేను మొరలన్నిటినీ ఆలకించాను. వారి ప్రార్థనలు స్వీకరించాను’’ అని అంటాడు. తరువాత తన దాసులను ఉద్దేశించి, ‘‘పొండి! నేను మిమ్మల్ని క్షమించాను. మీ దుష్కార్యాలను సత్కార్యాలుగా మార్చేశాను’’ అంటాడు (బైహఖీ).
**దేవుడు చెప్పిన దానం, ధర్మం
‘జకాత్‌’ను రంజాన్‌ మాసంలోనే చేయాలన్న భావన కొందరిలో ఉంది. కానీ అది నిజం కాదు. రంజాన్‌ నెలలో జకాత్‌ చేయడం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుందన్నది విశ్వాసం. అందుకని ముస్లింలలో ఎక్కువమంది ఈ మాసాన్ని ‘జకాత్‌’ కోసం ఎంచుకుంటూ ఉంటారు. ఇది సంపన్నులైన, స్థోమత కలిగిన ముస్లింలు అందరూ తప్పనిసరిగా పాటించవలసిన కర్తవ్యం. పేదలకు ధనవంతులు సహాయపడడం, ఆర్తులూ, నిస్సహాయుల అవసరాలను తీర్చడం, తద్వారా పేదరిక నిర్మూలన దీని లక్ష్యం.
**జకాత్‌ దానం కాదు
స్థితిపరులైన ముస్లింలలో ప్రతి ఒక్కరూ తమ కనీస అవసరాలకు పోగా మిగిలిన సంపదలో నుంచి కనీసం రెండున్నర శాతం తప్పనిసరిగా ‘జకాత్‌’ కింద చెల్లించాలి. ‘జకాత్‌’ను దానంగా భావించకూడదు. దానధర్మాలకు ఇస్లాంలో ‘సదఖా’, ‘ఖయారత్‌’ వంటి పదాలు ఉపయోగిస్తారు. ‘ఫిత్రా’ కూడా ఒక విధమైన దానమే.
**‘ఫిత్రా’ అంటే…
రంజాన్‌ పండుగను ‘ఈదుల్‌ఫిత్ర్‌’ అని అంటారు. ఆ రోజు ప్రార్థన నిమిత్తం ఈద్‌గాకు వెళ్లటానికి ముందు ముస్లిమ్‌లు ‘ఫిత్రా’ చెల్లించాలి. మనిషి ఒక్కరికి- రెండున్నర కిలోల గోధుమల విలువకు సమాన మొత్తాన్ని- ఒక ఇంట్లో ఎంత మంది సభ్యులుంటే అన్ని రెట్లను- ‘ఫిత్రా’గా ఇవ్వాలి. ఉపవాస దీక్ష సందర్భంగా జరిగే చిన్నా చితకా లోపాలకు పరిహారంగా ‘ఫిత్రా’ చెల్లిస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com