నేటి ఆధ్యాత్మిక వార్తలు-౦౪/౦౧

ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకుంటారు. కాశీ విశే్వశ్వరుణ్ణి దర్శించుకోవాలనుకుంటారు. కాశీ విశే్వశ్వర దర్శనం సర్వపాప హరణం అని నమ్ముతారు. మోక్షకారకం అని భావిస్తారు. కాశీ విశే్వశ్వర దర్శనం పునర్జన్మ రాహిత్యమని, కైలాస ప్రాప్తి కలిగిస్తుందని, మోక్షాన్నిస్తుందని విశ్వసిస్తారు.అయితే కాశీ వెళ్లినంత మాత్రాన సకల పాపాలు పోతాయా?కాశీ విశే్వశ్వరుణ్ణి దర్శించుకున్నంత మాత్రాన పునర్జన్మ లేకుండా పోతుందా?కైలాసప్రాప్తి వచ్చేస్తుందా? మోక్షం దొరుకుతుందా?అయితే లక్షలాదిమంది కాశీకి వెళ్తున్నవారే. లక్షల్లో కాశీ విశే్వశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారే! వీరందరికీ కైలాసం ప్రాప్తి దొరుకుతుందా?దొరికిందా? అంటూ తార్కికంగా ఆలోచన చేసేవారున్నారు. సందేహించినవారూ ఉన్నారు.ఏం లేదు, అదంతా ఒఠ్ఠిదే అని తీసిపారేసేవారున్నారు. చేసినవి అన్నీ చేసేసి కాశీ విశే్వశ్వరుణ్ణి దర్శనం చేసకున్నంత మాత్రాన కైలాసం ఎలా ప్రాప్తిస్తుంది? అని వాదులాడే వారు, వాదన చేసేవారూ కూడా ఉన్నారు.ఓ శివరాత్రి పర్వదినం కాశీవిశే్వశ్వరుణ్ణి సందర్శించాలని, దర్శనం చేసుకోవాలని భక్తులు తండోపతండాలుగా కాశీ చేరేరు. దర్శనం కోసం తంటాలు పడుతున్నారు. ఈ సందడంతా చూసిన శివపార్వతులు వీరి చిత్తశుద్ధిని పరీక్షిద్దామనుకున్నారు. ఇద్దరూ పండు ముదుసలులులా మారిపోయేరు. కాశీ విశే్వశ్వరాలయం ముఖద్వారం చేరుకున్నారు. తన భర్త తలని తన ఒళ్ళో పెట్టుకుని కూచుంది ముసలమ్మ. ఒళ్ళో తల వున్న భర్త దాహంతో విలవిలలాడిపోతున్నాడు. గిలగిల కొట్టుకుంటున్నాడు. ‘‘అయ్యా! నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇపుడు నేను వెళ్లి గంగాజలం తీసుకురావటం కుదరదు. ఏ క్షణంలో ప్రాణంపోతుందో తెలీదు. మీలో ఎవరైనా దయతలచి నా భర్త దాహం తీర్చడానికి కొంచెం గంగాజలం పోయండి’’ అని దేవాలయంలోకి వెళ్తున్న భక్తులందరినీ పేరు పేరునా ప్రాధేయపడింది. చేతులెత్తి ప్రార్థిస్తోంది ముసలమ్మ.భక్తులందరి చేతుల్లో వున్న పాత్రలనిండా గంగాజలం ఉంది. ఆలయంలోకి వెళ్తున్నారు. కొందరు విసుక్కుంటూ, ఇంకొందరు ఈసడించుకుంటూ తప్పించుకొని వెళ్లిపోతున్నారు. మరికొందరు విశే్వశ్వరుణ్ణి దర్శనం చేసుకువచ్చేక, నీ భర్త నోటిలో నీరు పోస్తాం’’ అంటూ వెళ్లిపోతున్నారు. ఒక్కరూ ముసలమ్మ మొర వినలేదు.జనం బాగా క్రిక్కిరిసి ఉన్నారని మంచి బేరం తగులుతుందనే ఆశతో ఓ దొంగ అక్కడకి వచ్చేడు. ముసలివాళ్ళిద్దరినీ చూసేడు. ‘‘ఎవరమ్మా మీరు, ఇక్కడ ఎందుకు ఉన్నారు?’’ అని ముసలమ్మని అడిగేడు.‘‘మేమూ దర్శనానికే వచ్చాం. ఇంతలో నా భర్త దాహంతో పడిపోయి కొట్టుకుంటున్నాడు. ఎవరైనా ఇన్ని నీళ్ళు తెచ్చి నోటిలో పోస్తే బ్రతుకుతాడేమోనని అందరినీ ప్రాధేయపడుతున్నాను’’ అని చెప్పింది ముసలమ్మ. వెంటనే తన చంకన తగిలించుకున్న సొరకాయ బుర్రలో ఉన్న నీరుని పోయబోయాడు.అపుడు ముసలమ్మ ‘‘నాయనా! నీరు పోసే ముందు నువ్వు చేసిన పుణ్యకార్యాలు చెప్పి నీరు పొయ్యి’’ అంది. దొంగకు అంతా అయోమయంగా ఉంది. ‘‘అమ్మా! నేనో దొంగను. ఇంతవరకు నేను అన్నీ పాపాలే చేశాను. ఇపుడు నీ భర్త నోటిలో నీరు పోయాలి అనుకున్నాను. ఇది ఒక్కటే పుణ్యకార్యం’’ అని వృద్ధుని నోట్లో నీరు పోసేడు.అంతే, తక్షణం శివపార్వతులిద్దరూ తమ స్వస్వరూపాలతో దొంగకి దర్శనం ఇచ్చేరు. ‘‘సత్యాన్ని మించిన ధర్మం లేదు. పరోపకారానికి మించిన దైవప్రార్థన లేదు’’ అని చెప్పి పార్వతీ పరమేశ్వరులిద్దరూ దొంగని ఆశీర్వదించారు. అనుగ్రహించేరు. అంతర్థానమైపోయేరు.ఇది సత్యానికి, పరోపకారానికి ఉన్న విశిష్టతని తెలియజెప్పే కథ. పునర్జన్మరహితమై మోక్షప్రాప్తి, కైలాస ప్రాప్తి ఎలా కలుగుతాయో వివరించే కథ. ఎందరెందరో మహనీయులు తమ బోధలలోను ప్రబోధనలలోను చర్విత చరణంగా చెబుతున్న కథ.కథలో వున్న అంతరార్థాన్ని గ్రహించాలి. సత్యనిష్ఠని పరోపకార తత్త్వాన్ని అవగతం చేసుకోవాలి. పరుల సేవే పరమాత్ముని సేవని గుర్తెరగాలి. పరమాత్మ తత్త్వాన్ని గుర్తించాలి. పరమాత్మ కృపకి పాత్రులు కావాలి.

*24 నుంచి పద్మావతి పరిణయోత్సవాలు
పద్మావతి, శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈనెల 24 నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తితిదే తెలిపింది. ఏప్రిల్‌ నెలలోని ముఖ్యమైన పర్వదినాలపై తితిదే శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 12న శ్రీభాష్యకార్ల సాత్తుమొర, 18న అక్షయ తృతీయ, శ్రీపరశురామ జయంతి, 21న శ్రీరామానుజ జయంతి, 22న శ్రీరామ జయంతి, 28న శ్రీనృసింహ జయంతి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, 29న అన్నమాచార్య జయంతి నిర్వహించనున్నట్లు వివరించింది.

*శ్రీశైలంలో శివాజీ ధ్యానమందిరం ప్రారంభించిన మహారాష్ట్ర గవర్నర్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయాన్ని ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగరరావు సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన శివాజీ ధ్యానమందిరాన్ని ప్రారంభించారు. అంతకుముందు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ , మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు , దేవస్థానం ఈవో భారత్ గుప్తా, శివాజీ స్పూర్తి కేంద్ర నిర్వాహకులు సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద విద్యాసాగరరావుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం ఆలయానికి చేరుకొని ధ్యానమందిరాన్ని ప్రారంభించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com