నేటి గరంగరం రాజకీయం-౧౨/౩౦

** తెలంగాణకు వచ్చి కేసీఆర్‌ను పొగడటం ఏంటీ
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కుంతియా కర్ణాటక మంత్రి రెవణ్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు వచ్చి కేసీఆర్‌ని పొగడడంపై ఆయన సీరియస్ అయ్యారు. వెంటనే రెవణ్ణపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాస్తానని ఆయన తెలిపారు.
*2017లో తెలుగువారి గౌరవం పెరిగింది
ఈ సంవత్సరం తెలుగువారికి గౌరవం పెరిగిందని, తెలుగు ఖ్యాతిని తెలుగువారు మరింత పెంచాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఆకాంక్షించారు. ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ 2018 సంవత్సరం క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు.
* జయ గదులు తెరవొద్దు!
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో ఐటీ, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయమే వేదనిలయానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న శశికళ వర్గీయులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పోయెస్‌ గార్డెన్‌ పరిసర ప్రాంతాలను స్వాధీనంలోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా 5 బెటాలియన్ల అదనపు బలగాలను మోహరింపజేశారు.
* విప్‌లకు కేబినెట్‌ హోదా
రాష్ట్ర శాసనమండలి, శాసనసభ విప్‌లుగా ఇటీవల నియామకమైన వారికి కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, శాసనసభ సభ్యుడు పీజీవీఆర్‌ నాయుడును ఇటీవల విప్‌లుగా నియమితులయ్యారు. రాష్ట్ర మంత్రులతో సమానంగా వారికి ఇప్పుడు కేబినెట్‌ హోదా లభించింది.
* ప్రధానిని కలిసిన విజయసాయి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.
* విజయానికి సమయం చాలాముఖ్యం– చెన్నైలో తన అభిమానులతో ఫొటో సెషన్‌లో రజనీకాంత్‌
‘‘రాజకీయాలైనా, సినిమా అయినా, మరే రంగమైనా విజయానికి అనుకూలమైన సమయం అవసరం. సినీ రంగంలో విజయవంతమైన ఎంజీఆర్‌, శివాజీగణేశన్‌ లను చూసి నేర్చుకోవాల్సినది చాలాఉంది. కోయంబత్తూరు జిల్లా అభిమానులతో ఫోటోలు దిగడం సంతోషంగా ఉంది. నా ఆధ్యాత్మిక గురువు సచ్చిదానంద అక్కడివారే. ‘బాబా’ తీయాలన్నవారిలో ఆయన కూడా ఒకరు’’.
* గ్లోబల్‌ వార్మింగ్‌ మంచిదే– డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు
అమెరికా తూర్పు తీరం న్యూ ఇయర్‌ వేడుకలకు అత్యంత శీతలంగా ఉండబోతోంది. కానీ గ్లోబల్‌ వార్మింగ్‌ వేడిమి పుణ్యమా అని మనకు సాధారణం కంటే కాస్త వేడిగానే ఉండనుంది. భూతాపంతో అమెరికాకు మంచే జరగనుంది. కానీ ఇతర దేశాల్లో ఆ పరిస్థితి లేదు. ఆయా దేశాలు అతి శీతల గాలులను ఎదుర్కోవాల్సిందే. వేల కోట్లను ఖర్చు చేయక తప్పదు.
*మహిళా ఎమ్మెల్యే సంచలన ట్వీట్!
ఎట్టకేలకు తలాక్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఎన్నో అడ్డంకులు, ఎన్నో వివాదాల సుడిగుండాలను దాటుకుని ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు’ లోక్‌సభలో నెగ్గింది. కాంగ్రెస్ కూడా మద్దతిచ్చిన ఈ బిల్లుపై ఇంకా కొంతమంది పెదవి విరుస్తూనే ఉన్నారు. తాజాగా ఆప్ మహిళా ఎమ్మెల్యే ఆల్కా లంబా త్రిపుల్ తలాక్‌ బిల్లును ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు.‘‘ఎందుకు అనవసరంగా త్రిపుల్ తలాక్ చెప్పి జైలుకు వెళ్తారు.. ఆమెకు ఏమీ చెప్పకుండా వదిలేస్తే భారత దేశానికి ప్రధాన మంత్రి కావచ్చు’’ అని మోదీ వైవాహిక జీవితాన్ని ఉద్దేశిస్తూ ఆల్కా లంబా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. పలువురు నెటిజన్లు ఆమె ట్వీట్‌కు మద్దతిస్తుండగా.. కొంతమంది విమర్శిస్తున్నారు. మోదీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని కామెంట్ చేస్తున్నారు. ‘కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరిన మీకు మోదీ గొప్పతనం గురించి ఏం తెలుసు?’ అని బీజేపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.
* ఇద్దరు విప్‌లకు సహాయమంత్రి హోదా
శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ డొక్కా మాణిక్య వరప్రసాద్‌, శాసనసభలో ప్రభుత్వ విప్‌ పి.జి.వి.ఆర్‌.నాయుడులకు సహాయ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
* ఎస్టీయూ డైరీ ఆవిష్కరించిన సీఎం
రాష్ట్రోపాధ్యాయ సంఘం 2018 నూతన డైరీ, క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో డైరీ ఆవిష్కరించి ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా రూపొందించినందుకు సీఎం అభినందించారని సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇ.షణ్మూర్తి, సి.హెచ్‌.జోసఫ్‌ సుధీర్‌బాబు తెలిపారు.
* ఫిబ్రవరి 2కు అందుబాటులోకి పది శాతం గృహాలు
రాష్ట్రంలో అందరికీ ఇళ్లు పథకం కింద మొదటి దశలో చేపట్టిన గృహ నిర్మాణ సముదాయాల్లో 10 శాతం ఫిబ్రవరి 2నాటికి అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉపకలెక్టర్లు, ప్రత్యేక శ్రేణి ఉప కలెక్టర్ల విభజన ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు విభజన చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 536 మంది అధికారులున్నారు. వీరిలో ఏపీకి 322 మంది ఉప కలెక్టర్లను, ప్రత్యేక శ్రేణి ఉప కలెక్టర్లను కేటాయించారు. తెలంగాణకు 214 మందిని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 సెక్షన్‌ 77(2) మేరకు విభజన చేశారు.
*‘పోలవరం పూర్తయ్యేవరకు నిద్రపోను. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే నా జీవితాశయం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ‘ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తోంది.. బిల్లులు సకాలంలో చెల్లిస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. 2018 నాటికే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనుకున్నా. కాంక్రీటు పనులు వేగం పుంజుకోవాల్సి ఉంద’ని ముఖ్యమంత్రి అన్నారు.
* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కడప జిల్లా ఫాతిమా కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. న్యాయం తప్పక విజయం సాధిస్తుందన్న పవన్‌ కల్యాణ్‌.. ఆర్డినెన్స్‌ అమలయ్యే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు.
*జన్మభూమి-మా ఊరు పూర్తికాగానే మరుగుదొడ్ల నిర్మాణంలో వెనకబడిన చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లోని గ్రామాలకు వస్తా. ఆ ఊళ్లోనే నిద్రపోతా. కలెక్టర్‌ను పక్కన పెట్టుకుని మీ కోసం ధర్నా చేస్తా. మార్చి 31లోపు బహిరంగ మలవిసర్జన రహిత(ఓడీఎఫ్‌) గ్రామాలుగా మారాల్సిందే.
*హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవలి ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థుల అభిప్రాయాల్ని సేకరించినట్లు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సిమ్లాకు వచ్చిన రాహుల్‌ అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల కోసం సన్నద్ధమవ్వాల్సిందిగా పార్టీ నేతలు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
*ఏపీ, తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ డిమాండు
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలంటూ ఏపీ, తెలంగాణ ఎమ్మార్పీఎస్‌లు డిమాండు చేశాయి. ఈ మేరకు శుక్రవారమిక్కడ ఎమ్మార్పీఎస్‌ జాతీయ మహిళా అధ్యక్షురాలు పెబ్బె జీవ మాదిగ అధ్యక్షతన మహా ధర్నా నిర్వహించారు. ఏపీ, తెలంగాణ ఎమ్మారీఎస్‌ అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ, ఇటుక రాజులు మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన భాజపా ఈ అంశాన్ని ఇప్పుడు చర్చించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టకపోతే భాజపా, తెదేపా, తెరాస ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
* మేఘాలయలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న మేఘాలయలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరంతా ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా, పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రస్తుతం కాంగ్రె్‌సకు రాజీనీమా చేసిన ఐదుగురిలో నలుగురిని మంత్రివర్గం నుంచి ఇటీవలే తప్పించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com