నేటి తాజావార్తలు-౧౧/౩౦

*రెండాకుల గుర్తుపై అన్నాడీఎంకేలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఈ గుర్తును పళని-పన్నీర్‌ వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్న దినకరన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెండాకుల గుర్తు పళని-పన్నీర్‌ వర్గానికి కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆయన దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.రెండాకుల గుర్తుపై అన్నాడీఎంకేలో వర్గపోరు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
*బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు సమీపంలో ఉన్న నగరి, పుత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.
*భారత ప్రగతి కోసం కొత్త విధానాలు తీసుకొస్తూనే ఉంటానని.. అవసరమైతే వాటికి ‘రాజకీయ మూల్యం’ చెల్లించడానికి కూడా తాను సిద్ధమేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దిల్లీలో హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన మోదీ.. ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా బదులిచ్చారు.
*ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర 22వ రోజు కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. గురువారం ఆస్పరి మండలం కారుమంచి గ్రామం నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. అయితే… కైరుప్పల, కుప్పలదొడ్డి మీదుగా బిల్లేకల్‌ గ్రామం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 3వేల కిలోమీటర్లు, ఆరునెలల పాటు జగన్ తన పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
*ఇండీవుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌ను డిసెంబరు 1 నుంచి 4 వరకు నిర్వహించనున్నట్టు తెలంగాణ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.రామ్మోహన్‌రావు తెలిపారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి కేంద్ర మంత్రి అల్ఫోన్స్‌ కన్నంథనమ్‌, సీఎం కేసీఆర్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హాజరవుతారని బుధవారం వెల్లడించారు.
*అల్పాదాయ మద్య తరహా ఆదాయ దేశాల్లో ప్రతి పది ఔసదాల్లో ఒకటి నాసిరకమైనదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి. ఏమాత్రం ఉపయోగం లేని మందుల్ని తీసుకుంటున్న వల్ల డబ్బు వ్రుదాతో పాటు అనారోగ్య సమస్యలూ తలెత్తే అవకాశం ఉంది.
*వచ్చే డిసెంబరు నెలను ‘ఎయిడ్స్‌ అవగాహన మాసం’గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ కార్యనిర్వాహక సమితి సమావేశం సచివాలయంలో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అధ్యక్షతన జరిగింది. ప్రపంచ ఎయిడ్స్‌ దినం డిసెంబరు ఒకటో తేదీ నుంచి నెలరోజుల పాటు ఎయిడ్స్‌ వ్యాధి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలను జరపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
* మద్రాస్‌ హైకోర్టు త్వరలో కొత్త చరిత్రకు వేదిక కాబోతోంది. 75 మంది న్యాయమూర్తులు ఉన్న ఈ ఉన్నత న్యాయస్థానంలో ఒకేసారి 11 మంది మహిళా న్యాయమూర్తులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
* హైదరాబాద్‌కి మెట్రోరైల్‌ ప్రాజెక్టు తీసుకురావడానికి తన హయాంలో చాలా పోరాటం చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అప్పట్లో బెంగళూరు, అహ్మదాబాద్‌లకే మెట్రోరైల్‌ ప్రాజెక్టు ఇచ్చారని, తాను ప్రధాని వాజ్‌పేయిపై ఒత్తిడి తెచ్చి హైదారాబాద్‌లో మెట్రోరైల్‌ ప్రాజెక్టుకి అనుమతి సాధించానని తెలిపారు.
* క్రీడలతో ఎంతో నేర్చుకోవచ్చని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గాసవ్కర్‌ అన్నాడు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా ‘పాఠశాల, అభ్యాస సంస్కరణలు’ అంశంపై బుధవారం హెచ్‌ఐసీసీలో జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు.
* కొత్త పంచాయతీరాజ్ బిల్లు ఆమోదానికి డిసెంబర్ మొదటివారంలో అసెంబ్లీ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
* ఈ ఏడాది రెడ్‌మి నోట్‌4 ద్వారా భారత మార్కెట్లో రికార్డు స్థాయిలో మొబైల్‌ విక్రయాలు జరిపిన షియోమి సంస్థ మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘దేశ్‌కా స్మార్ట్‌ఫోన్‌’ పేరుతో ‘రెడ్‌మి 5ఏ’ మొబైల్‌ను రూ.5వేల కన్నా తక్కువ ధరకే ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
* ఏపీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఓ సూచన చేశారు. ఇవాళ శాసన మండలిలో మాట్లాడిన ఆయన.. గన్నవరం విమానాశ్రయంలో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే వేలు వెచ్చించాల్సి వస్తోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
* తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ తొలిసారి ఒకే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఫిబ్రవరిలో జరిగే హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ వార్షికోవత్సవం దీనికి వేదిక కానుంది.
* ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారిఅంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ గురువారం అరెస్టు చేసి జైలులో పెట్టింది. ఉగ్రవాద కేసుల్లో హఫీజ్‌పై సాక్ష్యాధారాలు లేవంటూ వారం క్రితం పాకిస్థాన్ కోర్టు అతనిని విడుదల చేసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడి వచ్చింది. అతనిపై కొత్త ఆరోపణలను నమోదు చేసేందుకు పాకిస్థాన్ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
* తమిళనాడుపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపిస్తున్నాడు. తుఫాను ప్రభావంతో ప్రసిద్ధి పర్యాటకకేంద్రం కన్యాకుమారి అతలాకుతలం అయ్యింది. జిల్లాలో భారీ వర్షాల కారణంగా అయిదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు తోడు, ఈదురు గాలులతో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి. ఒక్కసారిగా చెట్లు కూలడంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
* ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని గురువారం వెలుగు యానిమేటర్లు కలిశారు. డ్వాక్రా సంఘాలను టీడీపీ సర్కార్‌ నిర్వీర్యం చేసిందని, యానిమేటర్లకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యానిమేటర్లకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చాక వెలుగు యానిమేటర్లకు నెలకు రూ.10వేలు జీతం ఇస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
*దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న నేరాల్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ సగటులో కేవలం యూపీలోనే సుమారు 9.5 శాతం నేరాలు నమోదు అవుతున్నట్లు జాతీయ నేర రికార్డుల సంస్థ నివేదిక వెల్లడించింది. అయితే 2016లో మాత్రం అత్యధిక సంఖ్యలో నేరాలు ఢిల్లీలో నమోదు అయినట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ ఏడాది ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో మొత్తం 19 మెట్రో సిటీల డేటాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మర్డర్ కేసులు తగ్గినట్లు బ్యూరో తెలిపింది. 2015తో పోలిస్తే హత్యలు 5.2 శాతం తగ్గినట్లు తెలుస్తున్నది. దొమ్మీలు, దోపిడీలు కూడా తగ్గాయని బ్యూరో నివేదిక స్పష్టం చేసింది. అయితే అపహరణలు మాత్రం పెరిగినట్లు రిపోర్ట్ పేర్కొన్నది. 2016లో మహిళల పట్ల మాత్రం నేరాలు అధికమైనట్లు నివేదిక వెల్లడించింది. మహిళలను భర్తలు, బందువులు హింసిస్తున్న ఘటనలే 32.6 శాతం ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. మహిళల కిడ్నాప్ 19 శాతం ఉన్నట్లు తేల్చారు. రేప్‌లు 11 శాతం జరుగుతున్నాయి. అయితే రేప్ కేసులు పెరిగినట్లు క్రైమ్ బ్యూరో తన నివేదికలో వెల్లడించింది. 2015లో 34, 651 కేసులు నమోదు కాగా, 2016లో 38947 కేసులు నమోదు అయినట్లు తెలుస్తున్నది. ఎస్‌సీ, ఎస్టీల పట్ల కూడా అట్రాసిటీ కేసులు పెరిగినట్లు తేలింది. అట్రాసిటీ కేసుల్లో యూపీ టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత బీహార్, రాజస్థాన్ రాష్ర్టాలు నిలిచాయి. సైబర్ క్రైమ్ కూడా 6.3 శాతంతో పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. వెస్ట్‌బెంగాల్‌లో అత్యధికంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదు అయ్యాయి.
*ఓక్కీ తుఫాను ప్రభావంతో దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి కన్యాకుమారిలో వందల చెట్లు నేలకూలాయి. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు గుర్తించారు. భారీ వర్షం వల్ల శబరిమలకు వెళ్లే రహదారులు మూసివేశారు. దీంతో శబరిమల ఆలయంలో సాయంత్రం 6గంటల నుంచి రేపు ఉదయం 7గంటల వరకు దర్శనం నిలిపివేశారు. కన్యాకుమారిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
* పోప్‌ ఫ్రాన్సి‌స్‌ గురువారం ఉదయం బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో ఆయన మూడు రోజుల పాటు పర‍్టించనున్నారు. మయన్మార్‌లో పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో ఢాకా చేరుకున్న పోప్‌కు బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనిక బలగాల గౌరవ వందనం ఆయన స్వీకరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com